Godrej Appliances
-
అమ్మకాల్లో 20 శాతం వృద్ధి 2023-24పై గోద్రెజ్ అప్లయన్సెస్
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్థూల అమ్మకాలు 20 శాతం పెరిగి రూ. 6,200 కోట్లకు చేరగలవని గోద్రెజ్ అప్లయన్సెస్ అంచనా వేస్తోంది. ప్రీమియం ఉత్పత్తుల వాటా ప్రస్తుతమున్న 35 శాతం నుంచి 40 శాతానికి పెరగగలదని భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల అమ్మకాలు రూ. 5,200 కోట్లుగా ఉండగలవని అంచనా వేస్తున్నట్లు సంస్థ బిజినెస్ హెడ్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్ నంది చెప్పారు. ఏసీల విభాగం అమ్మకాలు రెండింతలు పెరిగి రూ. 1,200 కోట్లకు చేరగలవని భావిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం కంపెనీ అమ్మకాల్లో ఏసీల వాటా 15 శాతంగా ఉండగా ఇది 22 శాతానికి చేరవచ్చని నంది చెప్పారు. కొత్తగా లీక్ ప్రూఫ్ ఎయిర్ కండీషనర్లను గురువారం ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. దీని ధర రూ. 48,900గా ఉంటుంది. ఈ వేసవిలో కూలింగ్ ఉత్పత్తులకు డిమాండ్ అధికంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. చైనా నుంచి సరఫరాల్లో అంతరాయాలు ఏర్పడిన నేపథ్యంలో ప్రస్తుతం చాలా మటుకు విడిభాగాలు, పరికరాలను దేశీయంగానే తయారు చేసుకోవడం పెరుగుతోందని నంది వివరించారు. -
ఏసీ మార్కెట్ వృద్ధి 10 శాతమే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గడిచిన కొన్నేళ్లుగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతూ వస్తున్నాయి. ఇది ఏసీల డిమాండ్‌ను అంతకంతకూ పెంచుతుండగా... దేశంలో మాత్రం వీటిపై 28 శాతం జీఎస్టీ విధిస్తుండటం అమ్మకాల జోరుకు కొంత అడ్డుకట్ట వేస్తున్నట్లుగానే భావించాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఏటా రూ.14,000 కోట్ల విలువైన ఏసీలు అమ్ముడుపోతున్నాయి. సంఖ్యలో చూస్తే... 2017–18లో 55 లక్షల యూనిట్లు విక్రయం కాగా... ఈ ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వరకూ వృద్ధి ఉండవచ్చని, ఇది 60 లక్షల యూనిట్లకు చేరవచ్చని బ్లూస్టార్ జేఎండీ త్యాగరాజన్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోతో చెప్పారు. 2019–20లో ఇవి 66 లక్షల యూనిట్లను చేరవచ్చన్నారు. మార్కెట్ వృద్ధి 10 శాతం వరకూ ఉంటే... బ్లూస్టార్ కూడా అదే స్థాయి వృద్ధిని లకి‡్ష్యస్తున్నట్లు చెప్పారాయన. జీఎస్టీని తగ్గిస్తే మాత్రం ఈ వృద్ధి మరింత పెరగవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తగ్గిన విండో... పెరిగిన ఇన్వర్టర్: విద్యుత్‌ను ఆదా చేసే ఇన్వర్టర్ ఏసీల వార్షిక వృద్ధి 100 శాతం దాటిపోతుండగా... విండో ఏసీల వాటా గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం మొత్తం ఏసీల్లో విండో శ్రేణి వాటా 12 శాతం ఉండగా... 88 శాతం స్ప్లిట్ ఏసీలే ఉన్నాయి. ఇందులో మల్టీ స్ప్లిట్ వాటా 2 శాతం. స్ప్లిట్ ఏసీల్లో ఇన్వర్టర్ విభాగం 52 శాతం, ఫిక్స్డ్ స్పీడ్ మోడళ్లు 47 శాతం ఉన్నాయి. 2016లో ఇన్వర్టర్ ఏసీల వాటా 10 శాతం మాత్రమే. తెలుగు రాష్ట్రాల్లో విండో ఏసీల అమ్మకాలు పూర్తిగా పడిపోయినట్లు విక్రేతలు చెబుతున్నారు. ఎక్కువగా 3 స్టార్.. విక్రయమవుతున్న ఏసీల్లో 5 స్టార్ మోడళ్ల వాటా 14 శాతంగా ఉంది. 82 శాతం వాటా మాత్రం 3 స్టార్‌దే. 5 స్టార్‌తో పోలిస్తే 3 స్టార్ మోడళ్ల ధర కనీసం రూ.5 వేలు తక్కువగా ఉండటమే దీనికి కారణమని, ఏసీని ఎక్కువగా వాడేవారు మాత్రమే విద్యుత్ ఆదా కోసం 5 స్టార్ వైపు మొగ్గు చూపుతున్నారని టీఎంసీకి చెందిన కె.శ్రీనివాస్ చెప్పారు. ‘‘తెలంగాణ, ఏపీ కస్టమర్లకు విద్యుత్ ఆదా విషయంలో అవగాహన ఎక్కువ. ఈ రెండు రాష్ట్రాల్లో ఇన్వర్టర్ ఏసీల అమ్మకాలు 90 శాతం ఉంటున్నాయి’’ అని సోనోవిజన్ మేనేజింగ్ పార్టనర్ భాస్కరమూర్తి చెప్పారు. 5 స్టార్ సేల్స్ దేశంలో ఇక్కడే ఎక్కువన్నారాయన. కాగా ఏసీ విక్రయాల్లో 30–35 శాతం ఈఎంఐల ద్వారా జరుగుతున్నాయని గోద్రెజ్ చెబుతోంది. -
గోద్రేజ్ అప్లయెన్సెస్ 5 స్టార్ పండుగ సంబరాలు
హైదరాబాద్: గోద్రేజ్ అప్లయెన్సెస్ సంస్ధ దసరా, దీపావళి పండుగల సందర్భంగా 5 స్టార్ పండుగ సంబరాల ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్ ఈ నెల 1 నుంచి వచ్చే నెల 15 వరకూ వర్తిస్తుందని గోద్రేజ్ అప్లయెన్సెస్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతీ కొనుగోలుపై జ్యూసర్ మిక్సర్ గ్రైండర్లు, లా ఓపాలా డిన్సర్ సెట్లు, స్టీమ్ ఐరన్, డ్రై ఐరన్ తదితర ఖచ్చితమైన వస్తువు రూ.3795 విలువ వరకూ పొందవచ్చని కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్ నంది పేర్కొన్నారు. సులభ నెలసరి వాయిదాల్లో ఎలాంటి వడ్డీ లేకుండా వస్తువులను కొనుగోలు చేయవచ్చని, ఏసీల కొనుగోలుపై రూ.7,000 వరకూ డిస్కౌంట్‌ను పొందవచ్చని తెలిపారు. కొన్ని ఎంపిక చేసిన వస్తువులపై పదేళ్ల వారంటీని ఇస్తున్నామని, గోద్రేజ్ స్మార్ట్‌కేర్ ద్వారా విక్రయానంతర సేవలను కూడా అందిస్తున్నామని వివరించారు. సాంకేతికంగా మరింత అధునాతన ఫీచర్లతో వస్తువులను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. -
మెడికల్ రిఫ్రిజిరేషన్‌లోకి గోద్రెజ్
న్యూఢిల్లీ: గోద్రేజ్ అప్లయెన్సెస్ సంస్థ మెడికల్ రిఫ్రిజిరేషన్ రంగంలోకి ప్రవేశిస్తోంది. ఇంగ్లాండ్‌కు చెందిన ష్యూర్ చిల్ కంపెనీ భాగస్వామ్యంతో ఈ రంగంలోకి అడుగిడుతున్నామని గోద్రేజ్ అప్లయెన్సెస్ సీఓఓ జార్జి మెనెజెస్ తెలిపారు. వచ్చే ఏడాది జూన్ కల్లా వ్యాక్సిన్ స్టోరేజ్ కోసం రెండు మోడళ్లను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఒకటి వంద లీటర్ల కెసాపిటీ ఉన్న మోడల్ అని, దీంట్లో 3,000 నుంచి 3,500 వరకూ వ్యాక్సిన్లను స్టోర్ చేసుకోవచ్చని, ధర రూ.1.35 లక్షల నుంచి రూ.1.5 లక్షల రేంజ్లో ఉంటుందని వివరించారు. మరొకటి 50 లీటర్ల కెపాసిటీ ఉన్న మోడల్ అని, దీంట్లో 1,500 నుంచి 1,750 వరకూ వ్యాక్సిన్లను స్టోర్ చేసుకోవచ్చని, ధర రూ.65,000 నుంచి రూ.75,000 వరకూ ఉంటుందని పేర్కొన్నారు. ఈ రిఫ్రిజిరేటర్లలో 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో వ్యాక్సిన్లను 8 నుంచి 10 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చని వివరించారు. ప్రభుత్వ ఏజెన్సీలకు విక్రయించడం, ప్రైవేట్ రంగ ఆసుపత్రులు, ఫార్మసీ చెయిన్లు, బ్లడ్ బ్యాంకులు లక్ష్యాలుగా వీటిని అందిస్తామని పేర్కొన్నారు. ప్రారంభంలో ముంబైలోని విక్రోలి ప్లాంట్‌లో వీటిని తయారు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత పుణేలో రూ. 30 కోట్ల పెట్టుబడులతో కొత్తగా నిర్మించే ప్లాంట్‌లో వీటిని తయారు చేస్తామని జార్జి వివరించారు.