gold cup cricket tournment
-
మళ్లీ తమిళనాడుకే
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్‌కప్ క్రికెట్ టోర్నమెంట్లో గత ఏడాది ఫలితమే పునరావృతం అయింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌సీఏ) జట్టు టైటిల్ నిలబెట్టుకోగా... ఢిల్లీ (డీడీసీఏ) జట్టుకు మరోసారి ఫైనల్లో నిరాశే ఎదురైంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో గురువారం ముగిసిన ఫైనల్లో తమిళనాడు 88 పరుగులు తేడాతో ఢిల్లీని చిత్తు చేసింది. మూడు రోజుల పాటు జరగాల్సిన ఫైనల్లో తొలి రెండు రోజుల పాటు వర్షం కారణంగా ఆట సాధ్యం కాలేదు. దాంతో చివరి రోజు ఇరు జట్ల మధ్య 50 ఓవర్ల వన్డే మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటిం గ్‌కు దిగిన తమిళనాడు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. బాబా అపరాజిత్ (128 బంతుల్లో 123; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగాడు. శ్రీకాంత్ అనిరుధ (102 బంతుల్లో 78; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా, సురేశ్ కుమార్ (31) రాణించాడు. అపరాజిత్, అనిరుధ రెండో వికెట్‌కు 153 పరుగులు జోడించారు. ఢిల్లీ బౌలర్లలో పర్వీందర్ అవానా 46 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఢిల్లీ 45.1 ఓవర్లలో 206 పరుగులకే ఆలౌటైంది. పునీత్ బిస్త్ (44), మిలింద్ కుమార్ (40), జాగృత్ ఆనంద్ (33), మోహిత్ శర్మ (32) కొద్దిగా ప్రతిఘటించగలిగారు. తమిళనాడు బౌలర్ రాహిల్ షా 40 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. సురేశ్‌కుమార్‌కు 2 వికెట్లు దక్కాయి. విజేతగా నిలిచి తమిళనాడుకు రూ. 1 లక్ష, రన్నరప్ ఢిల్లీకి రూ.50 వేల ప్రైజ్‌మనీ దక్కింది. ఆర్మీ ఉన్నతాధికారి మేజర్ జనరల్ సీఏ పీఠావాలా (ఏసీ వీఎస్ఎం జీఓసీ-ఆంధ్రా సబ్ ఏరియా) ముఖ్య అతిథిగా హాజరై ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏ అధ్యక్ష, కార్యదర్శులు జి.వినోద్, ఎంవీ శ్రీధర్‌లతో పాటు పలువురు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
ఫైనల్లో ఢిల్లీ, తమిళనాడు
సాక్షి, హైదరాబాద్: మొయినుద్దౌలా గోల్డ్‌కప్ క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు సెమీస్‌లోనే వెనుదిరిగింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఢిల్లీ జట్టు తుదిపోరుకు అర్హత సంపాదించింది. చివరి రోజు ఆటకు వర్షం అడ్డంకిగా మారింది. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మూడో రోజు ఆటలో ఢిల్లీ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 307 పరుగుల భారీ స్కోరు చేసింది. మిలింద్ కుమార్ (74 బంతుల్లో 101 నాటౌట్, 10 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు సెంచరీ చేశాడు. మోహిత్ శర్మ (60 బంతుల్లో 57, 4 ఫోర్లు), పునీత్ బిస్త్ (44 బంతుల్లో 60, 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించారు. హైదరాబాద్ బౌలర్లలో సీవీ మిలింద్, ప్రజ్ఞాన్ ఓజా, ఆశిష్ రెడ్డి తలా 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 4 పరుగులు కలుపుకొని ఆతిథ్య హైదరాబాద్ ముందు 312 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్ ఇన్నింగ్స్‌కు వరుణుడు అడ్డంకిగా మారాడు. వర్షంతో ఆట నిలిచే సమయానికి హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో 3.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ల్లో ఢిల్లీ 387, హైదరాబాద్ 383/8 స్కోరు చేశాయి. మరోసారి ఫైనల్‌కు తమిళనాడు డిఫెండింగ్ చాంపియన్ తమిళనాడు... ఢిల్లీతో అమీతుమీకి సిద్ధమైంది. కర్ణాటకతో జరిగిన రెండో సెమీస్‌లో తమిళనాడు జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ముందంజ వేసింది. ఈసీఐఎల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో చివరి రోజు కర్ణాటక రెండో ఇన్నింగ్స్‌లో 38.4 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ (104 బంతుల్లో 102, 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేశాడు. తమిళ బౌలర్లు రాహిల్ షా, రోహిత్ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత 238 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు వర్షంతో ఆట నిలిచే సమయానికి 3 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 13 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ల్లో కర్ణాటక 387, తమిళనాడు 392 పరుగులు చేశాయి. ఫైనల్ మ్యాచ్ 10 నుంచి ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. -
కేరళతో హైదరాబాద్ తొలి పోరు
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్ కప్ క్రికెట్ టోర్నీ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 12 వరకు జరిగే ఈ టోర్నీని నాకౌట్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. మూడు రోజుల ఫార్మాట్ (90, ప్లస్ 40 ఓవర్లు)లో మ్యాచ్‌లు జరుగుతాయి. హెచ్‌సీఏ తరఫున రెండు జట్లు బరిలోకి దిగుతున్నాయి. హెచ్‌సీఏ ఎలెవన్‌కు అక్షత్ రెడ్డి కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, హెచ్‌సీఏ ప్రెసిడెంట్స్ ఎలెవన్‌కు డీబీ రవితేజ నాయకత్వం వహిస్తాడు. ఉప్పల్ స్టేడియంలో నేటి నుంచి జరిగే తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ ఎలెవన్ జట్టు కేరళతో తలపడుతుంది. ఉప్పల్, ఏఓసీ సెంటర్, ఎన్ఎఫ్సీ, ఈసీఐఎల్ మైదానాల్లో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. గోల్డ్ కప్ టోర్నీకి ఈసారి కూడా కోరమాండల్ కింగ్ సంస్థ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. విజేతకు రూ. లక్ష, రన్నరప్‌కు రూ. 50 వేల నగదు బహుమతి లభిస్తుంది. టోర్నీ డ్రాను హెచ్‌సీఏ ఆదివారం విడుదల చేసింది. టోర్నీ షెడ్యూల్ సెప్టెంబర్ 2 నుంచి 4 వరకు హెచ్‌సీఏ ఎలెవన్ x కేరళ (ఉప్పల్ స్టేడియం) గోవా xఢిల్లీ (ఎన్ఎఫ్సీ) హెచ్‌సీఏ ప్రెసిడెంట్స్x కర్ణాటక (ఈసీఐఎల్) సర్వీసెస్ x తమిళనాడు (ఏఓసీ సెంటర్) సెప్టెంబర్ 6-8 (సెమీ ఫైనల్స్) సెప్టెంబర్ 10-12 (ఫైనల్స్)