ఫైనల్లో ఢిల్లీ, తమిళనాడు | In finals delhi,Tamilnadu | Sakshi
Sakshi News home page

ఫైనల్లో ఢిల్లీ, తమిళనాడు

Sep 9 2013 1:44 AM | Updated on Sep 1 2017 10:33 PM

మొయినుద్దౌలా గోల్డ్‌కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టు సెమీస్‌లోనే వెనుదిరిగింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఢిల్లీ జట్టు తుదిపోరుకు అర్హత సంపాదించింది.

 సాక్షి, హైదరాబాద్: మొయినుద్దౌలా గోల్డ్‌కప్ క్రికెట్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ జట్టు సెమీస్‌లోనే వెనుదిరిగింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఢిల్లీ జట్టు తుదిపోరుకు అర్హత సంపాదించింది. చివరి రోజు ఆటకు వర్షం అడ్డంకిగా మారింది. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ  స్టేడియంలో జరిగిన మూడో రోజు ఆటలో ఢిల్లీ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 307 పరుగుల భారీ స్కోరు చేసింది. మిలింద్ కుమార్ (74 బంతుల్లో 101 నాటౌట్, 10 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు సెంచరీ చేశాడు.
 
 మోహిత్ శర్మ (60 బంతుల్లో 57, 4 ఫోర్లు), పునీత్ బిస్త్ (44 బంతుల్లో 60, 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించారు. హైదరాబాద్ బౌలర్లలో సీవీ మిలింద్, ప్రజ్ఞాన్ ఓజా, ఆశిష్ రెడ్డి తలా 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 4 పరుగులు కలుపుకొని ఆతిథ్య హైదరాబాద్ ముందు 312 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్ ఇన్నింగ్స్‌కు వరుణుడు అడ్డంకిగా మారాడు. వర్షంతో ఆట నిలిచే సమయానికి హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో 3.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 11 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ల్లో ఢిల్లీ 387, హైదరాబాద్ 383/8 స్కోరు చేశాయి.
 
 మరోసారి ఫైనల్‌కు తమిళనాడు
 డిఫెండింగ్ చాంపియన్ తమిళనాడు... ఢిల్లీతో అమీతుమీకి సిద్ధమైంది. కర్ణాటకతో జరిగిన రెండో సెమీస్‌లో తమిళనాడు జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ముందంజ వేసింది. ఈసీఐఎల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో చివరి రోజు కర్ణాటక రెండో ఇన్నింగ్స్‌లో 38.4 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది. రాహుల్ (104 బంతుల్లో 102, 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేశాడు. తమిళ బౌలర్లు రాహిల్ షా, రోహిత్ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత 238 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడు వర్షంతో ఆట నిలిచే సమయానికి 3 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 13 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ల్లో కర్ణాటక 387, తమిళనాడు 392 పరుగులు చేశాయి. ఫైనల్ మ్యాచ్ 10 నుంచి ఉప్పల్ స్టేడియంలో జరగనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement