బంగారు అక్షరాలు పొదిగిన ఆహ్వాన పత్రిక!
మైసూరు : మైసూరు రాజుగా బాధ్యతలు స్వీకరించనున్న యదువీర్ గోపాలరాజ అరసు దత్తత స్వీకార మహోత్సవానికి బంగారంతో అక్షరాలు పొదిగిన ఆహ్వాన పత్రికను సిద్ధం చేశారు. ఒక్కో ఆహ్వాన పత్రికకు 20 వేల రూపాయలకు పైగా ఖర్చు పెట్టినట్లు సమాచారం. ఎంపిక చేసిన బంధువులు, శ్రేయోభిలాషులు, ప్రముఖులకు మాత్రమే ఈ ఆహ్వానం పంపనున్నారు. ఈ నెల 23న ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మైసూరు ప్యాలెస్‌లో సంప్రదాయ ప్రకారం దత్తత స్వీకార మహోత్సవం నిర్వహించనున్నారు.
మైసూరు రాజ వంశీకుడిగా ఒడయార్ సోదరి గాయత్రీ దేవి మనవడు యదువీర్ గోపాలరాజ అరసును ఎంపిక చేసినట్లు శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్ సతీమణి రాణి ప్రమోదాదేవి ప్రకటించిన విషయం తెలిసిందే. యదువీర్ ప్రస్తుతం అమెరికాలోని బాస్టన్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసిస్తున్నారు. దత్తత స్వీకారానంతరం ఆయన వారం రోజుల పాటు మైసూరులో ఉంటారు. ఆ తరువాత మళ్లీ విద్యాభ్యాసం కోసం వెళ్లిపోతారు.
మైసూర్ సంస్థానం చివరి రాజైన శ్రీకంఠదత్త నరసింహరాజ వడయార్ 2013 డిసెంబరులో మరణించారు. ఆయనకు సంతానం లేకపోవడంతో ఆ సంస్థానంలో మరొకరిని నియమించలేదు.ఇప్పుడు రాణి ప్రమోదాదేవి యదువీర్ను దత్తత తీసుకుంటున్నారు.దత్తత స్వీకారం అనంతరం అతని పేరు యదువీర్ కృష్ణదత్త చామరాజ్ వడయార్గా మారుతుంది.
వడయార్ వంశస్తులు దాదాపుగా 550 ఏళ్లు (1399 నుంచి 1947) మైసూర్ సంస్థానాన్ని పరిపాలించారు. ఆ ప్రాంతాన్ని ఒకే రాజవంశం అత్యధిక కాలం పరిపాలించడం అదే ప్రథమం. వీరి పరిపాలన ఎంతో సుభిక్షంగా ఉండటంతో ఆ వంశస్తులంటే మైసూర్ ప్రజలకు ఎంతో గౌరవం. ఇప్పటికీ ఆ వంశస్తులను రాజులుగానే భావిస్తారు. 1940 నుంచి 1947 మధ్యకాలంలో మైసూర్‌ను పాలించిన జయ చమరాజేంద్ర వడయార్‌కు నరసింహరాజు ఒక్కగానొక్క కుమారడు. నరసింహరాజుకు ఐదుగురు సోదరీ మణులు ఉన్నారు. వారిలో ఒక సోదరి గాయత్రిదేవి మనుమడే ఈ యదువీర్.