రెండు మూడు రుణాలుంటే.. విముక్తి ఏ ఖాతాకో మీరే చెప్పండి!
ఆ బాధ్యత మాపై పెట్టొద్దు: ప్రభుత్వానికి బ్యాంకర్ల వినతి
సాక్షి, హైదరాబాద్: ఒకే సర్వే నంబరుపై పలు బ్యాంకుల్లో పట్టాదారు పాసుపుస్తకం, బంగారం కుదవపెట్టి రుణాలు తీసుకున్న రైతులకు.. ఏ బ్యాంకులో రుణానికి విముక్తి కల్పించాలో ప్రభుత్వమే నిర్ణయించి చెప్పాల్సిందిగా బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంచేశాయి. ఈ విషయంలో బ్యాంకులను బాధ్యులను చేయొద్దని, ఏ రుణానికి విముక్తి కల్పించాలో తాము నిర్ణయించలేమని బ్యాంకర్లు పేర్కొన్నాయి. ఒకే సర్వే నంబర్‌పై రైతులు తొలుత పట్టాదారు పాసుపుస్తకంతో ఒక బ్యాంకులో రుణం తీసుకున్నాక ఆ రుణం సరిపోకపోతే అదే సర్వే నంబ ర్‌పై బంగారం కుదవపెట్టి మరో బ్యాంకులో రుణం తీసుకున్నారు. ఇలాంటి రుణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు ఇటీవల సర్క్యులర్ జారీ చేసింది.
ఒకే సర్వే నంబర్‌పై రెండు మూడు బ్యాంకుల్లో రుణం తీసుకుంటే అందులో తొలుత ఏ బ్యాంకులో రుణం తీసుకున్నారో అదే రుణానికి రుణ విముక్తి కల్పించాల ని, మిగతా బ్యాంకుల్లో రుణాలకు విముక్తి కల్పిం చవద్దని ఆ సర్క్యులర్‌లో ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతటితో ఆగకుండా మిగతా రుణాలకు విముక్తి కల్పిస్తే సంబంధిత బ్యాంకు మేనేజరును బాధ్యుడిని చేయడంతో పాటు అతని నుంచే రికవరీ చేస్తామని సర్క్యులర్‌లో పేర్కొం ది. ఈ అంశంతో పాటు రుణ విముక్తి పథకంలో పలు అంశాలపై ఆర్థికశాఖ ఉన్నతాధికారులు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు శనివారం ఎస్బీఐ, సిండికేట్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు, ఆప్కాబ్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏ రుణం విముక్తి కల్పించాలో ప్రభుత్వమే చెప్తే అదే చేస్తామని, ఈ విషయంలో బ్యాంకులను భాగస్వామ్యం చేయద్దని బ్యాంకుల ప్రతినిధులు కోరా రు. అయితే ఇందుకు కుటుంబరావు ససేమిరా అన్నారు. ఇక పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ కలిపినందున ఆ మండలాల్లోని రైతుల రుణాల వివరాలను ఆన్లైన్లో కాకుండా బ్యాంకుల వారీగా సీడీల్లో అందజేయాల్సిందిగా ప్రభుత్వం కోరింది.