Golden jubliee hall
-
4.16 లక్షల ఎకరాలకు సాగునీరు
నెల్లూరు(పొగతోట): జిల్లాలో మొదటి పంటకు 4,16,640 ఎకరాలకు సాగునీరు విడుదల చేయనున్నారు. అక్టోబర్ 25 నుంచి 43.376 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు ఐఏబీలో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. స్థానిక గోల్డెన్జూబ్లీహాల్లో మంగళవారం రాష్ట్రపురపాలక శాఖ మంత్రి పి.నారాయణ అధ్యక్షతన సాగునీటి సలహా మండలి సమావేశం (ఐఏబీ)లో నిర్ణయం తీసుకున్నారు. సమావేశం వాడీవేడిగా సాగింది. పనుల జాప్యంపై ఇరిగేషన్ అధికారులను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు నిలదీశారు. సోమశిల ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 37.803 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జిల్లాలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్షాలు కురుస్తాయి. వర్షాల ఆధారంగా డిసెంబర్ నాటికి సోమశిల ప్రాజెక్టులో 63.322 టీఎంసీల నీరు లభ్యమవుతుందని అధికారులు అంచనా వేశారు. డెడ్ స్టోరేజ్, తాగునీరు, నీటి అవిరి, కండలేరు రిజర్వాయర్‌కు నీరు విడుదల తదితర అవసరాలకు పోనూ సోమశిల ప్రాజెక్టులో నుంచి 43.376 టీఎంసీల సాగునీటిని విడుదల చేయనున్నారు. పెన్నార్ డెల్టా 2.47 లక్షల ఎకరాలు, కనుపూరు కాలువ 33 వేలు, కావలి కాలువ 72,489, జీకేఎన్ (ఎన్ఎఫ్సీ) కాలువ 34,257, సౌత్ఫీడర్కు 29,894 ఎకరాలకు సాగునీరు విడుదల చేయనున్నారు. 2013-14 సీజన్‌కు ఎన్ని ఎకరాలకు నీరు విడుదల చేశారో ఈ ఏడాది కుడా అలాగే విడుదల చేయనున్నారు. కాలువలో సిల్ట్ పేరుకుపోవడం, చివరి భూములకు నీరు చేరకపోవడం వల్ల వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు కోట్ల రూపాయలు నష్టపోతున్నారని అధికారులపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ధనం దుర్వినియోగం అవుతోందని మంత్రి దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు. నగరంలో పంట కాలువలు ఆక్రమించి అపార్టుమెంట్లు నిర్మించారని, ఫ్లాట్లు వేసి విక్రయిస్తుండటంపై అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించు కోవడం లేదని నెల్లూరు నగర, రూరల్ ఎమ్యెల్యేలు పి.అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి స్పందిస్తూ ఈ నెలాఖరులో ఎమ్మెల్యేలు, అధికారులందరినీ కలుపుకుని నగరంలో పంట కాలువలు పరిశీలించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ కృష్ణపట్నం పోర్టుకు ఒక టీఎంసీ నీరు ఏ విధంగా విడుదల చేస్తారని ప్రశ్నించారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి 4,16,640 ఎకరాలకు సాగునీరు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాలువలో సిల్ట్, గుర్రపునాడ తొలగించేందుకు రెండు రోజుల్లో అనుమతులు మంజూరు చేయిస్తామన్నారు. అక్టోబర్ 25 లోపు పనులు పూర్తి చేసి నీరు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పోతిరెడ్డిపాడు పనుల విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఎన్.శ్రీకాంత్,జేసీ రేఖారాణి, ఇరిగేషన్ ఎస్ఈ కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
కోడ్ ఉల్లంఘిస్తే ఉపేక్షించం
కోడ్ ఉల్లంఘిస్తే ఉపేక్షించం నెల్లూరు(పొగతోట), న్యూస్‌లైన్ : ఎన్నికల నిర్వహణకు సంబంధించి కోడ్ ఆఫ్ కాండక్ట్ అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ అన్నారు. శుక్రవారం స్థానిక గోల్డన్జూబ్లీ హాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రత్యేక బ్యాంక్ అకౌంట్లు ప్రారంభించాలని సూచించారు. లోక్‌సభకు పోటి చేసే అభ్యర్థి రూ.70 లక్షలు, శాసనసభకు పోటి చేసే అభ్యర్థి రూ.28 లక్షలకు మించి ఖర్చు చేయకూడదన్నారు. అభ్యర్థులు సభలు, సమావేశాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. అభ్యర్థులు చేస్తున్న ఖర్చును డీడీ, చెక్ రూపంలో మాత్రమే చెల్లించాల్సి ఉందన్నారు. నగదు, మద్యం, నగలు తదితర వాటితో ఓటర్లను ప్రలోభపేట్టె వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగదు, మద్యం పంపిణీ కాకుండా అంబులెన్స్‌లు, పోలీస్ వాహనాలు, ఆయిల్ ట్యాంకర్లను పూర్తి స్థాయిలో తనిఖీ చేస్తామన్నారు. గ్రామాల్లో శుభకార్యాలకు, పుట్టిన రోజు వేడుకల్లో భోజనాలు పెట్టి దానికి ఎన్నికల్లో పోటి చేస్తున్న అభ్యర్థి హాజరైతే దానిని కూడా వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. నిబంధనల ప్రకారం నీతివంతమైన ఎన్నికలు నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. పత్రికల్లో వస్తున్న పెయిడ్ యాడ్స్, యాడ్స్‌ను నిర్ధారించేందు మీడియా సర్టిఫికేషన్ మానటరింగ్ కమిటీని(ఎంసీఎంసీ) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్రైనీ జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ అధ్వర్యంలో కమిటీ పనిచేస్తుందని తెలిపారు. యాడ్ ఇవ్వాలనుకునే అభ్యర్థులు మూడు రోజుల ముందుగా ఎంసీఎంసీ వద్ద అనుమతి తీసుకోవాలన్నారు. రూ.50 వేలకు మించి నగదుతో ఎవరూ ప్రయాణం చేయకూడదన్నారు. అధిక మొత్తంలో నగదుతో ప్రయాణం చేస్తే ఆ డబ్బును స్వాధీనం చేసుకుంటామన్నా రు. నగదుకు పూర్తి స్థాయిలో ఆధారాలు చూపితే దానిని తిరిగి వారికి ఇస్తామన్నారు. ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రత్యేక స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే నిష్పక్షపాతంగా వ్యవహరించి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలి పారు. అనంతరం వివిధ పత్రికల బ్రాంచ్ మేనేజర్లు, ప్రింటింగ్ ప్రెస్‌ల యజామాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాల్లో జాయింట్ కలెక్టర్ జి.రేఖారాణి, ఏజేసీ రాజ్‌కుమార్, డీఆర్ఓ నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
9న ‘టెట్’ పరీక్ష
నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్ : ఈ నెల 9వ తేదీన టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించనున్నట్లు ఏజేసీ పెంచలరెడ్డి తెలిపారు. స్థానిక గోల్డెన్జూబ్లీహాల్లో సోమవారం పరీక్షల నిర్వహణపై ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏజేసీ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 11,626 మంది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం నెల్లూరు నగరంలో 51 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఉదయం ఆరు కేంద్రాలు, మధ్యాహ్నం 45 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షలు ఉదయం 9 నుంచి12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్షలకు నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేదిలేదని స్పష్టం చేశారు. అభ్యర్థులు గంట ముందు పరీక్ష కేంద్రాలకు హాజరుకావాలని సూచించారు. మొబైల్ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తమ వెంట తీసుకుని రాకూడదన్నారు. వాటిని పరీక్ష కేంద్రాల్లోకి తెచ్చినవారిపై చర్యలు ఉంటాయన్నారు. ప్రతి సెంటర్‌కు చీఫ్ సూపరింటెండెంట్లను నియమిస్తున్నామన్నారు. జిల్లా అధికారులను చీఫ్ సూపరింటెండెంట్లుగా నియమించనున్నట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల్లో మౌలికసదుపాయాలు ఏర్పాటుచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. 8న నవోదయ ప్రవేశ పరీక్షలు జవహర్ నవోదయ విద్యాలయ-2014 ప్రవేశ పరీక్షలను ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్నట్లు ఏజేసీ తెలిపారు. ఆరో తరగతిలో ప్రవేశం కోసం జిల్లాలో 15 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 4500 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీఈఓ రామలింగం, రాష్ట్ర పరిశీలకులు ప్రొఫెసర్ రాఘవరెడ్డి పాల్గొన్నారు.