కోడ్ ఉల్లంఘిస్తే ఉపేక్షించం
నెల్లూరు(పొగతోట), న్యూస్‌లైన్ : ఎన్నికల నిర్వహణకు సంబంధించి కోడ్ ఆఫ్ కాండక్ట్ అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ అన్నారు. శుక్రవారం స్థానిక గోల్డన్‌జూబ్లీ హాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రత్యేక బ్యాంక్ అకౌంట్లు ప్రారంభించాలని సూచించారు.
లోక్‌సభకు పోటి చేసే అభ్యర్థి రూ.70 లక్షలు, శాసనసభకు పోటి చేసే అభ్యర్థి రూ.28 లక్షలకు మించి ఖర్చు చేయకూడదన్నారు. అభ్యర్థులు సభలు, సమావేశాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. అభ్యర్థులు చేస్తున్న ఖర్చును డీడీ, చెక్ రూపంలో మాత్రమే చెల్లించాల్సి ఉందన్నారు. నగదు, మద్యం, నగలు తదితర వాటితో ఓటర్లను ప్రలోభపేట్టె వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నగదు, మద్యం పంపిణీ కాకుండా అంబులెన్స్‌లు, పోలీస్ వాహనాలు, ఆయిల్ ట్యాంకర్లను పూర్తి స్థాయిలో తనిఖీ చేస్తామన్నారు. గ్రామాల్లో శుభకార్యాలకు, పుట్టిన రోజు వేడుకల్లో భోజనాలు పెట్టి దానికి ఎన్నికల్లో పోటి చేస్తున్న అభ్యర్థి హాజరైతే దానిని కూడా వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. నిబంధనల ప్రకారం నీతివంతమైన ఎన్నికలు నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. పత్రికల్లో వస్తున్న పెయిడ్ యాడ్స్, యాడ్స్‌ను నిర్ధారించేందు మీడియా సర్టిఫికేషన్ మానటరింగ్ కమిటీని(ఎంసీఎంసీ) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్రైనీ జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ అధ్వర్యంలో కమిటీ పనిచేస్తుందని తెలిపారు. యాడ్ ఇవ్వాలనుకునే అభ్యర్థులు మూడు రోజుల ముందుగా ఎంసీఎంసీ వద్ద అనుమతి తీసుకోవాలన్నారు. రూ.50 వేలకు మించి నగదుతో ఎవరూ ప్రయాణం చేయకూడదన్నారు. అధిక మొత్తంలో నగదుతో ప్రయాణం చేస్తే ఆ డబ్బును స్వాధీనం చేసుకుంటామన్నా రు. నగదుకు పూర్తి స్థాయిలో ఆధారాలు చూపితే దానిని తిరిగి వారికి ఇస్తామన్నారు.
ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రత్యేక స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే నిష్పక్షపాతంగా వ్యవహరించి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలి పారు. అనంతరం వివిధ పత్రికల బ్రాంచ్ మేనేజర్లు, ప్రింటింగ్ ప్రెస్‌ల యజామాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాల్లో జాయింట్ కలెక్టర్ జి.రేఖారాణి, ఏజేసీ రాజ్‌కుమార్, డీఆర్‌ఓ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
కోడ్ ఉల్లంఘిస్తే ఉపేక్షించం
Published Sat, Mar 8 2014 2:58 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement