గిరిజన సంక్షేమ శాఖ ఉద్యోగిపైనా వేటు
నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్ : నిబంధనలకు విరుద్ధంగా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో కావలి డివిజన్‌లో ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఎన్. శ్రీకాంత్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. డీఈఓ ఎన్.ఉషారాణి ద్వారా విచారణ చేయించి ఫైల్ సిద్ధం చేయించి వారిపై వేటు వేశారు.
కావలి మండలంలోని చిన్ననట్టు ప్రాథమిక పాఠశాలలో శానం కృష్ణ ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు. ఇతను ఇటీవల జరిగిన ఎన్నికల్లో, గతంలో ఎంపీ కోసం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ప్రచారంలో పాల్గొన్నాడు. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని ప్రచారం చేశాడని ఆరోపణలు రావడంతో జిల్లా అధికారులు విచారణ చేశారు.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా తన భార్యను కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టి ఆమె తరపున ప్రచారం చేశాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను సస్పెండ్ చేశారు. ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరొక ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. అల్లూరు మండలంలోని బట్రకాగొల్లు ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న గంటా సుధాకర్ తెలుగుదేశం పార్టీ వ్యక్తిగా ముద్ర పడ్డాడు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తగా ఉన్న కోవూరు రామయ్య హత్య కేసులో సుధాకర్ పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. ఆ మేరకు కేసును ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన అధికారులు ఆయనపై కూడా వేటు వేశారు.
ట్రైబల్ వెల్ఫేర్‌లో ఒకరు సస్పెన్షన్
పలు ఆరోపణల నేపథ్యంలో ట్రైబల్ వెల్ఫేర్ శాఖలో పనిచేస్తున్న ఏవీ రమణయ్య అనే ఉద్యోగిని కూడా కలెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అయితే ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్
Published Fri, May 30 2014 2:57 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement