సాక్షి, నెల్లూరు: రక్తనిధిల నిర్వహణలో పారదర్శకత తెచ్చేందుకు కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ శ్రీకారం చుట్టారు. నెల్లూరులోని డీఎస్సార్ ఆస్పత్రి రక్తనిధి నుంచి పెద్ద ఎత్తున రక్తాన్ని అక్రమంగా తరలిస్తూ ఏడాది క్రితం కొందరు దొరికిపోయారు. జిల్లాలోని పలు రక్తనిధిల నుంచి సైతం అక్రమంగా రక్తాన్ని తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు అప్పట్లో జిల్లా అధికారులు ప్రకటించారు. ఏడాది కావస్తున్నా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ క్రమంలో కలెక్టర్ శ్రీకాంత్ పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా అన్ని రక్తనిధిలను ఆన్‌లైన్ ద్వారా ఒకే గొడుగు కిందకు తె చ్చేలా కార్యాచరణ రూపొందించారు. ఆరోగ్య విభాగం పర్యవేక్షణలో జరిగే ఈ ప్రక్రియ నేడో,రేపో అమలులోకి రానుంది. కలెక్టర్ శ్రీకాంత్ ఆరోగ్యశ్రీ పథకం సీఈఓగా ఉన్న సమయంలోనే రాష్ట్రంలోని అన్ని రక్తనిధిలను ఆన్‌లైన్ ద్వారా ఏకం చేయాలని సంకల్పించారు. అందుకోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించారు. దానిని ప్రారంభించే సమయానికి శ్రీకాంత్ నెల్లూరు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఇక్కడికి వచ్చిన ఆయన ప్రభుత్వ రక్తనిధిలో జరిగిన అక్రమాలను తెలుసుకున్నారు.
వెంటనే రక్తనిధిల కేంద్రీకరణకు చర్యలు చేపట్టారు. నూతన విధానాన్ని నెల్లూరు నుంచే ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేయనున్నారు. ఆరోగ్యశ్రీ పథక విభాగం పర్యవేక్షణలో నిర్వహించే ఈ ప్రక్రియను 104 విభాగం అమలుచేస్తుంది. రక్తనిధిలను అక్రమాలకు తావులేకుండా నిర్వహించడమే దీని ఉద్దేశం. రక్తదాతల వివరాలతో పాటు వారి రక్తగ్రూపు వివరాలను సైతం ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. అన్ని పరీక్షల అనంతరం దాతలు ఇచ్చే రక్తం, గ్రూపుల వివరాలు, గడువు కాలం ఆ ప్యాకెట్‌పై ముద్రిస్తారు. స్టాక్ వివరాలను సైతం ఆన్‌లైన్‌లో పొందు పరుస్తారు. రక్తం అవసరమైన వారు 104ను సంప్రదిస్తే రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోని నిల్వల సమాచారమైనా తెలుస్తుంది.
తగ్గిపోయిన దాతలు : నెల్లూరులో ప్రభుత్వ రక్తనిధి కేంద్రంతో మరో మూడు ప్రధాన రక్తనిధి కేంద్రాలున్నాయి. కావలి, ఆత్మకూరు, సూళ్లూరుపేట, ఉదయగిరి, గూడూరు, దుగ్గరాజపట్నంలో ఆరు ఉపకేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల పరిధిలో 40 వేల మంది వరకు రక్తదాతలున్నారు. ఏడాది క్రితం నెల్లూరులోని ప్రభుత్వ ఆస్పత్రి రక్తనిధి నుంచి అక్రమంగా రక్తం తరలిస్తున్న విషయం వెలుగులోకి రావడంతో దాతలు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా రక్తనిల్వలు తగ్గిపోయి, అత్యవసర సమయంలో రోగులు ఇబ్బందిపడుతున్నారు. మరోవైపు రక్తదాతలను ప్రోత్సహించడంలోనూ అధికారులు విఫలమవుతున్నారు.
నిబంధనల ప్రకారం రక్తదాతల వివరాలను ఆయా రక్తనిధిల్లో తప్పనిసరిగా నమోదుచేయాలి. వారు రక్తం ఎప్పుడు ఇచ్చారు, దానిని ఎలా వినియోగించారో రికార్డుల్లో పేర్కొనాలి. ఒక వేళ ఆ రక్తం పనికిరాకపోయినా సంబంధిత వివరాలను పొందుపరచాలి. ప్రతి రక్తదాత మూడునెలలకోసారి రక్తం ఇవ్వవచ్చు. ఆ సమయం పూర్తయినప్పుడు దాతకు తెలియజేస్తే మళ్లీ వచ్చి రక్తం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ మేరకు కసరత్తు రక్తనిధిల్లో జరుగుతున్న దాఖలాలు లేవు.
దాత సిఫార్సు చేస్తే రాయితీ: రక్తం ఇచ్చిన దాత సిఫార్సు చేస్తే 50 శాతం రాయితీతో అందించాల్సి ఉన్నా అది జరగడం లేదు. కొందరు దాతల పేర్లను అధికారులే నమోదు చేసి ఆ రాయితీని జేబులో వేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం కలెక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో చేపడుతున్న చర్యలతో అక్రమాలకు కళ్లెం పడుతుందని రక్తదాతలు ఆశిస్తున్నారు.
‘రక్త’ ప్రక్షాళన
Published Sat, Dec 14 2013 3:50 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement