DSR hospital
-
ఐదుగురు హెడ్‌నర్సులు మెడికల్ కాలేజీకి..
నెల్లూరు(విద్యుత్): టీబీ హాస్పిటల్‌తో పాటు డీఎస్సార్ ఆస్పత్రి(పెద్దాసుపత్రి) నుంచి ఐదుగురు హెడ్‌నర్సులను మెడికల్ కళాశాలకు బదిలీ చేస్తూ మంగళవారం వెలువడిన ఉత్తర్వులు వివాదాస్పదమయ్యాయి. అందరూ మెడికల్ కళాశాలకు బదిలీ కోరుతుండగా కొందరికే అవకాశం కల్పించడమేంటమని మిగిలిన ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఉత్తర్వులు వెలువడిన ప్రక్రియపై అభ్యంతరం తెలిపారు. నగరంలోని డీఎస్సార్, జూబ్లీ, రేబాల, టీబీ ఆస్పత్రులకు సంబంధించిన వైద్యాధికారులు, హెడ్‌నర్సులు, నర్సులు, నాలుగో తరగతి సిబ్బంది మెడికల్ కళాశాలకు బదిలీ కోరుకుంటున్నారు. ఈ మేరకు ఇటీవల వీరంతా కేంద్ర, రాష్ట్ర మంత్రులను కలిసి విన్నవించారు. ప్రస్తుతం డీఎస్సార్, రేబాల హాస్పిటళ్లలో 36 మంది, టీబీ హాస్పిటల్లో ఆరుగురు, జూబ్లీ హాస్పిటల్లో 17మంది వైద్యాధికారులు పనిచేస్తున్నారు. అలాగే స్టాఫ్‌నర్సులు 110 మంది, హెడ్ నర్సులు 22 మంది విధులు నిర్వహిస్తున్నారు. అయితే డీఎస్సార్ ఆస్పత్రి నుంచి ముగ్గురు, టీబీ ఆస్పత్రి నుంచి ఇద్దరు హెడ్‌నర్సులను వైద్య కళాశాల పరిధిలోకి తీసుకోవాలని మంగళవారం నిర్ణయం ఉత్తర్వులు వచ్చాయి. డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) నుంచి డీఎస్సార్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ రవీంద్రనాథ్ఠాగూర్కు ఈ ఉత్తర్వులు అందాయి. విషయం తెలుసుకున్న మిగిలిన ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. అందరూ మెడికల్ కళాశాలకు బదిలీ కోరుకుంటుంటే కొందరే దొడ్డిదారిన నియామక పత్రాలు ఎలా తెచ్చుకుంటారని సూపరింటెండెంట్‌ను ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం డీఎంఈ నేరుగా వైద్యవిధాన పరిషత్ కమిషనర్‌కు, అక్కడి నుంచి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్(డీసీహెచ్ఎస్)కు నియామక ఉత్తర్వులు రావాలని, కానీ నేరుగా డీఎంఈ నుంచి మెడికల్ సూపరింటెండెంట్‌కు ఎలా పంపుతారని మండిపడుతున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు పనిచేస్తా ఐదుగురు హెడ్నర్సులకు సంబంధించి నియామక పత్రాలు వచ్చిన విషయం వాస్తవమే. ఈ విషయంపై వైద్యవిధాన పరిషత్ కమిషనర్‌కు ఫ్యాక్స్ ద్వారా సమాచారం అందించాను. వారి ఆదేశాల మేరకు నడుచుకుంటాం. రవీంద్రనాథ్ఠాగూర్, మెడికల్ సూపరింటెంట్ -
‘రక్త’ ప్రక్షాళన
సాక్షి, నెల్లూరు: రక్తనిధిల నిర్వహణలో పారదర్శకత తెచ్చేందుకు కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ శ్రీకారం చుట్టారు. నెల్లూరులోని డీఎస్సార్ ఆస్పత్రి రక్తనిధి నుంచి పెద్ద ఎత్తున రక్తాన్ని అక్రమంగా తరలిస్తూ ఏడాది క్రితం కొందరు దొరికిపోయారు. జిల్లాలోని పలు రక్తనిధిల నుంచి సైతం అక్రమంగా రక్తాన్ని తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు అప్పట్లో జిల్లా అధికారులు ప్రకటించారు. ఏడాది కావస్తున్నా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ క్రమంలో కలెక్టర్ శ్రీకాంత్ పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా అన్ని రక్తనిధిలను ఆన్లైన్ ద్వారా ఒకే గొడుగు కిందకు తె చ్చేలా కార్యాచరణ రూపొందించారు. ఆరోగ్య విభాగం పర్యవేక్షణలో జరిగే ఈ ప్రక్రియ నేడో,రేపో అమలులోకి రానుంది. కలెక్టర్ శ్రీకాంత్ ఆరోగ్యశ్రీ పథకం సీఈఓగా ఉన్న సమయంలోనే రాష్ట్రంలోని అన్ని రక్తనిధిలను ఆన్లైన్ ద్వారా ఏకం చేయాలని సంకల్పించారు. అందుకోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక వెబ్సైట్ రూపొందించారు. దానిని ప్రారంభించే సమయానికి శ్రీకాంత్ నెల్లూరు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఇక్కడికి వచ్చిన ఆయన ప్రభుత్వ రక్తనిధిలో జరిగిన అక్రమాలను తెలుసుకున్నారు. వెంటనే రక్తనిధిల కేంద్రీకరణకు చర్యలు చేపట్టారు. నూతన విధానాన్ని నెల్లూరు నుంచే ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా అమలుచేయనున్నారు. ఆరోగ్యశ్రీ పథక విభాగం పర్యవేక్షణలో నిర్వహించే ఈ ప్రక్రియను 104 విభాగం అమలుచేస్తుంది. రక్తనిధిలను అక్రమాలకు తావులేకుండా నిర్వహించడమే దీని ఉద్దేశం. రక్తదాతల వివరాలతో పాటు వారి రక్తగ్రూపు వివరాలను సైతం ప్రత్యేక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేస్తారు. అన్ని పరీక్షల అనంతరం దాతలు ఇచ్చే రక్తం, గ్రూపుల వివరాలు, గడువు కాలం ఆ ప్యాకెట్‌పై ముద్రిస్తారు. స్టాక్ వివరాలను సైతం ఆన్లైన్లో పొందు పరుస్తారు. రక్తం అవసరమైన వారు 104ను సంప్రదిస్తే రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోని నిల్వల సమాచారమైనా తెలుస్తుంది. తగ్గిపోయిన దాతలు : నెల్లూరులో ప్రభుత్వ రక్తనిధి కేంద్రంతో మరో మూడు ప్రధాన రక్తనిధి కేంద్రాలున్నాయి. కావలి, ఆత్మకూరు, సూళ్లూరుపేట, ఉదయగిరి, గూడూరు, దుగ్గరాజపట్నంలో ఆరు ఉపకేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల పరిధిలో 40 వేల మంది వరకు రక్తదాతలున్నారు. ఏడాది క్రితం నెల్లూరులోని ప్రభుత్వ ఆస్పత్రి రక్తనిధి నుంచి అక్రమంగా రక్తం తరలిస్తున్న విషయం వెలుగులోకి రావడంతో దాతలు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా రక్తనిల్వలు తగ్గిపోయి, అత్యవసర సమయంలో రోగులు ఇబ్బందిపడుతున్నారు. మరోవైపు రక్తదాతలను ప్రోత్సహించడంలోనూ అధికారులు విఫలమవుతున్నారు. నిబంధనల ప్రకారం రక్తదాతల వివరాలను ఆయా రక్తనిధిల్లో తప్పనిసరిగా నమోదుచేయాలి. వారు రక్తం ఎప్పుడు ఇచ్చారు, దానిని ఎలా వినియోగించారో రికార్డుల్లో పేర్కొనాలి. ఒక వేళ ఆ రక్తం పనికిరాకపోయినా సంబంధిత వివరాలను పొందుపరచాలి. ప్రతి రక్తదాత మూడునెలలకోసారి రక్తం ఇవ్వవచ్చు. ఆ సమయం పూర్తయినప్పుడు దాతకు తెలియజేస్తే మళ్లీ వచ్చి రక్తం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ మేరకు కసరత్తు రక్తనిధిల్లో జరుగుతున్న దాఖలాలు లేవు. దాత సిఫార్సు చేస్తే రాయితీ: రక్తం ఇచ్చిన దాత సిఫార్సు చేస్తే 50 శాతం రాయితీతో అందించాల్సి ఉన్నా అది జరగడం లేదు. కొందరు దాతల పేర్లను అధికారులే నమోదు చేసి ఆ రాయితీని జేబులో వేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం కలెక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో చేపడుతున్న చర్యలతో అక్రమాలకు కళ్లెం పడుతుందని రక్తదాతలు ఆశిస్తున్నారు.