గ్రామసభలకు నిధులెలా ? | To deal with the problems of the people is not new... | Sakshi
Sakshi News home page

గ్రామసభలకు నిధులెలా ?

Published Sat, Jan 4 2014 3:07 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

To deal with the problems of the people is not new...

నెల్లూరు(టౌన్ ), న్యూస్‌లైన్: ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ వినూత్నంగా నిర్వహిస్తున్న గ్రామసభలకు స్పందన లభిస్తోంది. చిల్లకూరు మండలం పాలిచెర్లవారిపాళెంలో నిర్వహించిన తొలిసభ విజయవంతమైంది. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు ఓటింగ్ ద్వారా తమ అభిప్రాయం తెలిపారు. ఇదంతా బాగానే ఉన్నా.. ఈ గ్రామసభ నిర్వహణ ఖర్చు సుమారు రూ.7 వేలు అయింది.
 
 ఏడాదిలో మొత్తం నాలుగు సభలు నిర్వహించాలంటే ఖర్చు రూ.28 వేలు అవుతుంది. ఈ మొత్తాన్ని జనరల్ ఫండ్ నుంచి ఖర్చు చేసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారులు ఆదేశాలు ఇవ్వడంతో చిన్న పంచాయతీల సర్పంచ్‌లు, కార్యదర్శులు గగ్గోలు పెడుతున్నారు. సాధారణ పనులు చేపట్టేందుకే నిధులు లేకపోవడంతో ఈ గ్రామసభలకు ఎలా చేయాలని ప్రశ్నిస్తున్నారు.
 
 జిల్లాలో మొత్తం 940 పంచాయితీలు ఉన్నాయి. వీటిలో 500 ఓటర్లలోపు ఉన్న పంచాయతీలు 89,  501 నుంచి వెయ్యి ఓటర్లలోపు ఉన్న పంచాయతీలు 311 , 1,001 నుంచి 1500 ఓటర్లలోపు ఉన్న పంచాయతీలు 259 ఉన్నాయి. మొత్తం మీద చిన్న పంచాయతీలే ఎక్కువ. వీటికి ఏడాదికి వచ్చే ఆదాయం రూ.15 వేలు నుంచి రూ.20 వేలు లోపే ఉంటుంది. ఈ క్రమంలో గ్రామసభల నిర్వహణకు రూ.28 వేలు ఎక్కడి నుంచి తేవాలనేది ప్రశ్నార్థకంగా మారింది. వెంకటాచలం మండలంలోని ఆత్రంవారి కండ్రికలో 100 ఓట్లే ఉన్నాయి. సైదాపురం మండలంలోని గోకుల బృందావనంలోనూ ఇదే పరిస్థితి.
 
 వరికుంటపాడు మండలంలోని జ్ఞానేశ్వరపురంలో 300 ఓట్లు వరకు ఉన్నారు. ఇలా వెయ్యి లోపు ఓటర్లున్న పంచాయతీలకు ప్రభుత్వం దామాషా ప్రకారం సాధారణ నిధుల కింద ఏడాదికి రూ.4 వేలు ఇస్తుంది. వివిధ రకాల పన్నుల రూపంలో మరో రూ.5 వేలు నుంచి రూ.10 వేలు వరకు వచ్చే అవకాశముంది.
 పెద్ద పంచాయతీల్లో ఓకే : సీనరేజీ, లేఅవుట్లు, భవననిర్మాణ ఫీజులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, వేలం పాటల ద్వారా పెద్దపంచాయతీలకు ఆదాయం లక్షల్లో ఉంటుంది. ఇలాంటి పంచాయతీలకు గ్రామసభల నిర్వహణ పెద్దసమస్య కాబోదు. చిన్న పంచాయతీలే నిధుల కొరత సమస్యను ఎదుర్కొంటున్నారు. అధికారులు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని గ్రామసభల నిర్వహణ ఖర్చును ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌లు కోరుతున్నారు.
 
  ఖర్చు తగ్గించే ప్రయత్నం చేస్తాం
 గ్రామసభలకు అయ్యే ఖర్చును తగ్గించేందుకు చూస్తున్నాం. కుర్చీలకు బదులు పట్టలు వేయించే ఆలోచన చేస్తున్నాం. ఫొటోలు, వీడియో తప్పనిసరి అని ప్రభుత్వం సూచించింది. ఈ ఖర్చును ప్రభుత్వమే భరించే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం. ఎం.జితేంద్ర, జెడ్పీ సీఈవో, ఇన్‌చార్జి డీపీఓ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement