నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: పంచాయతీ కార్యదర్శుల పోస్టులను ప్రస్తుతం కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వర్తిస్తున్న వారికే ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫైలుపై కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ శనివారం రాత్రి సంతకం చేశారు. వారికి సోమవారం నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను అధికారులు గోప్యంగా ఉంచారు. ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాలతో నిరుద్యోగులు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు వివిధ రకాలుగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ జరుగుతున్న తీరే ఇందుకు నిదర్శనం. జిల్లాలో 140 పంచాయతీ కార్యదర్శి పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ నవంబర్‌లో నోటిఫికేషన్ విడుదలైంది.
డిగ్రీ మార్కుల మెరిట్ ఆధారంగా పోస్టులను భర్తీ చేస్తామని అధికారులు ప్రకటించడంతో పాటు 11,400 మంది దరఖాస్తులు సమర్పించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను మినహాయించి మిగిలిన వారి వద్ద రూ.50 వంతున దరఖాస్తు ఫీజు స్వీకరించారు. ఇలా సుమారు 8 వేల మంది నుంచి రూ.4 లక్షల రూపాయల వరకు ప్రభుత్వ ఖజానాకు జమయింది. 15 మార్కుల వెయిటేజీ ఇచ్చినప్పటికీ తమకు ఉ ద్యోగాలు వచ్చేలా లేవంటూ కొందరు కాంట్రాక్టు కార్యదర్శులు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. తుది తీర్పు వచ్చేంత వరకు కాం ట్రాక్ట్ కార్యదర్శులనే రెగ్యులర్‌గా నియమించాలని ట్రిబ్యునల్ ఇటీవల ఆదేశించింది. ఈ క్రమంలో 129 పోస్టులను కాంట్రాక్ట్ కార్యదర్శులతోనే భర్తీ చేస్తూ అధికారులు చర్యలు చేపట్టారు.
నిరుద్యోగుల ఆగ్రహం
కాంట్రాక్టు కార్యదర్శులకే పోస్టులు ఇవ్వాలనుకుంటే నోటిఫికేషన్ లేకుండా వారినే రెగ్యులర్ చేయవచ్చు కదా..అని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పడంతో జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి వచ్చామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తు ఫీజు రూ.50 పోగా వివిధ సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశామని, చివరకు కాళ్లతిప్పట తప్ప ఫలితం కరువైందని వాపోతున్నారు. తమకు లేనిపోని ఆశలు రేకెత్తించడం దేనికని ప్రశ్నిస్తున్నారు.
మిగిలిన 11 పోస్టుల గతేంటి?
నోటిఫికేషన్‌లో 140 పోస్టులను ప్రకటించ గా ప్రస్తుతం 129 మాత్రమే భర్తీ అవుతున్నాయి. మిగిలిన 11 పోస్టులపై అధికారుల నుంచి స్పష్టత కరువైంది. ఈ విషయాన్ని జెడ్పీ సీఈవో, ఇన్‌చార్జి డీపీవో జితేంద్ర వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా ట్రిబ్యునల్ తుది తీర్పును అనుసరించి తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
కాంట్రాక్టు ‘కార్యదర్శుల’కే పోస్టులు
Published Mon, Jan 27 2014 3:30 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement