4.16 లక్షల ఎకరాలకు సాగునీరు
నెల్లూరు(పొగతోట): జిల్లాలో మొదటి పంటకు 4,16,640 ఎకరాలకు సాగునీరు విడుదల చేయనున్నారు. అక్టోబర్ 25 నుంచి 43.376 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు ఐఏబీలో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. స్థానిక గోల్డెన్‌జూబ్లీహాల్లో మంగళవారం రాష్ట్రపురపాలక శాఖ మంత్రి పి.నారాయణ అధ్యక్షతన సాగునీటి సలహా మండలి సమావేశం (ఐఏబీ)లో నిర్ణయం తీసుకున్నారు. సమావేశం వాడీవేడిగా సాగింది. పనుల జాప్యంపై ఇరిగేషన్ అధికారులను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు నిలదీశారు. సోమశిల ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం 37.803 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జిల్లాలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వర్షాలు కురుస్తాయి.
వర్షాల ఆధారంగా డిసెంబర్ నాటికి సోమశిల ప్రాజెక్టులో 63.322 టీఎంసీల నీరు లభ్యమవుతుందని అధికారులు అంచనా వేశారు. డెడ్ స్టోరేజ్, తాగునీరు, నీటి అవిరి, కండలేరు రిజర్వాయర్‌కు నీరు విడుదల తదితర అవసరాలకు పోనూ సోమశిల ప్రాజెక్టులో నుంచి 43.376 టీఎంసీల సాగునీటిని విడుదల చేయనున్నారు. పెన్నార్ డెల్టా 2.47 లక్షల ఎకరాలు, కనుపూరు కాలువ 33 వేలు, కావలి కాలువ 72,489, జీకేఎన్ (ఎన్‌ఎఫ్‌సీ) కాలువ 34,257, సౌత్‌ఫీడర్‌కు 29,894 ఎకరాలకు సాగునీరు విడుదల చేయనున్నారు.
2013-14 సీజన్‌కు ఎన్ని ఎకరాలకు నీరు విడుదల చేశారో ఈ ఏడాది కుడా అలాగే విడుదల చేయనున్నారు. కాలువలో సిల్ట్ పేరుకుపోవడం, చివరి భూములకు నీరు చేరకపోవడం వల్ల వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు కోట్ల రూపాయలు నష్టపోతున్నారని అధికారులపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ధనం దుర్వినియోగం అవుతోందని మంత్రి దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు. నగరంలో పంట కాలువలు ఆక్రమించి అపార్టుమెంట్లు నిర్మించారని, ఫ్లాట్లు వేసి విక్రయిస్తుండటంపై అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించు కోవడం లేదని నెల్లూరు నగర, రూరల్ ఎమ్యెల్యేలు పి.అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి స్పందిస్తూ ఈ నెలాఖరులో ఎమ్మెల్యేలు, అధికారులందరినీ కలుపుకుని నగరంలో పంట కాలువలు పరిశీలించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ కృష్ణపట్నం పోర్టుకు ఒక టీఎంసీ నీరు ఏ విధంగా విడుదల చేస్తారని ప్రశ్నించారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి 4,16,640 ఎకరాలకు సాగునీరు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాలువలో సిల్ట్, గుర్రపునాడ తొలగించేందుకు రెండు రోజుల్లో అనుమతులు మంజూరు చేయిస్తామన్నారు. అక్టోబర్ 25 లోపు పనులు పూర్తి చేసి నీరు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పోతిరెడ్డిపాడు పనుల విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ ఎన్.శ్రీకాంత్,జేసీ రేఖారాణి, ఇరిగేషన్ ఎస్‌ఈ కోటేశ్వరరావు పాల్గొన్నారు.