టీడీపీ నేతల సిబ్బందే ఎన్నికల అధికారులు! | TDP Leaders Staff Itself the Election Officials | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల సిబ్బందే ఎన్నికల అధికారులు!

Published Wed, Apr 3 2019 4:56 AM | Last Updated on Wed, Apr 3 2019 4:56 AM

TDP Leaders Staff Itself the Election Officials - Sakshi

ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం నిర్వహిస్తున్న ఆర్‌జీఎం విద్యాసంస్థల అధినేత మిద్దె శాంతిరాముడు

సాక్షి, గుంటూరు/సాక్షి ప్రతినిధి, విజయనగరం: టీడీపీ నాయకులను ఓటమి భయం వెంటాడుతోంది. అందుకే పోల్‌ మేనేజ్‌మెంట్‌కు దిగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  జిల్లాలో పోలింగ్‌ సిబ్బంది కొరత ఉండటంతో అధికారులు ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు, లెక్చరర్లను నియమించుకుంటున్నారు. వారికి ఎన్నికల విధుల కేటాయింపులో వివక్ష చూపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ అభ్యర్థులు, ఆ పార్టీ నేతలు, సానుభూతిపరులు నడుపుతున్న విద్యా సంస్థల్లో పనిచేస్తున్న వారినే ఎన్నికల విధులకు నియమిస్తున్నట్లు తెలుస్తోంది.  పోల్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగానే టీడీపీ నేతలు ఇదంతా చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.  

ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేనా?..: గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొమ్మాలపాటి శ్రీధర్‌కు చెందిన అభినందన ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న విజయ విద్యా విహార్‌ పాఠశాల నుంచి ఏడుగురు ఉపాధ్యాయులను, అదే మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడి పాఠశాల నుంచి 12 మందిని, తాళ్లూరులో టీడీపీ నేత కొల్లి చంద్రశేఖర్‌రెడ్డికి చెందిన శ్రీవివేకానంద విద్యానికేతన్‌ నుంచి 20 మంది ఉపాధ్యాయులు, క్రోసూరు టీడీపీ నేత రవి గోవర్దన్‌రెడ్డికి చెందిన పద్మావతి పబ్లిక్‌ స్కూల్‌ నుంచి 11 మందిని ఎన్నికల విధుల కోసం నియమించుకోవడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది.

నరసరావుపేట పట్టణంలోని నారాయణ విద్యా సంస్థలు, టీడీపీ నేత కొల్లి బ్రహ్మయ్యకు చెందిన కృష్ణచైతన్య పాఠశాల నుంచి, టీడీపీ నాయకుడు మైనేడి శ్రీనివాసరావుకు చెందిన హిందూ స్కూల్, భావన, వాసవి కళాశాలల నుంచి సైతం ఉపాధ్యాయులను ఎన్నికల విధులకు తీసుకున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలంలో గొట్టిముక్కల వెంకటేశ్వర్లుకు చెందిన ఇండియన్‌ జెమ్స్‌ స్కూల్‌ నుంచి 20 మంది ఉపాధ్యాయులను, పెదనందిపాడు టీడీపీ జెడ్పీటీసీ నగరాజకుమారి కోశాధికారిగా వ్యవహరిస్తున్న ఎల్‌ఎంహెచ్‌ స్కూల్‌ నుంచి 20 మంది ఉపాధ్యాయులను ఎన్నికల విధుల కోసం నియమించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గుంటూరు జిల్లాలో ఎన్నికల విధుల కోసం తీసుకున్న టీచర్లలో 70 శాతం మంది టీడీపీ నేతలు నడుపుతున్న పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న వారే కావడం గమనార్హం.   

ప్రభుత్వ స్కూళ్ల టీచర్లకు మొండిచేయి   
విజయనగరం జిల్లాలో టీడీపీ నేతలు, మంత్రి పి.నారాయణకు చెందిన నారాయణ విద్యాసంస్థలు, టీడీపీ ఎంపీ అభ్యర్థి పూసపాటి ఆశోక్‌గజపతిరాజు ఛైర్మన్‌గా ఉన్న మాన్సాస్‌ సంస్థకు చెందిన ఎంవీజీఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ అధ్యాపకులకు ఎన్నికల ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌(పీఓ), ఏపీఓ విధులు కేటాయించారు. వాస్తవానికి ముందుగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు పీఓ, ఏపీఓ ట్రైనింగ్‌ ఇచ్చారు. కానీ, రెండోసారి ట్రైనింగ్‌కు పిలవలేదు. వారికి పీఓ, ఏపీఓ డ్యూటీలు వేయలేదు. ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను సైతం పక్కనపెట్టి, ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేసే వారికి ఎన్నికల విధులు కేటాయించారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమంటున్నాయి.

టీడీపీ నాయకుడి కాలేజీలో కౌంటింగ్‌ కేంద్రాలు 
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీ నాయకుడు మిద్దె శాంతిరాముడుకు చెందిన ఆర్‌జీఎం ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని నంద్యాల, ఆళ్లగడ్డ, పాణ్యం, బనగానపల్లె, నందికొట్కూరు, డోన్, శ్రీశైలం అసెంబ్లీతోపాటు నంద్యాల పార్లమెంట్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపును ఆర్‌జీఎం ఇంజినీరింగ్‌ కళాశాలలో చేపట్టనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రామ్మోహన్‌ మంగళవారం తెలిపారు. టీడీపీ నాయకుడు శాంతిరాముడు, ఆయన కుమారుడు మిద్దెశివరాంలు ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. టీడీపీ నాయకులకు చెందిన ప్రైవేటు కాలేజీలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయడం పట్ల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement