జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షిస్తున్న మంత్రులు పి.నారాయణ,శిద్దా రాఘవరావు, వేదికపై జేసీ నాగలక్ష్మి తదితరులు
ఒంగోలు టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనలకు వచ్చిన సమయంలో ఇచ్చిన హామీల్లో కొన్ని ఇంతవరకు నెరవేరలేదు. ముఖ్యంగా తాగునీటి సమస్య నుంచి గట్టెక్కేందుకు ఇచ్చిన హామీలు ఏళ్లు గడుస్తున్నా అమలుకు నోచుకోలేదు. పరిస్థితులు ఇదేవిధంగా ఉంటే రానున్న వేసవిలో ప్రజల తాగునీటి సమస్య తీవ్రంగా ఉంటుంది. నీటి రవాణాకు సంబంధించిన బిల్లులు 70కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ బిల్లులు చెల్లించకుంటే ఈసారి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ఎవరూ ముందుకురారు. జిల్లాకు చెందిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పి.నారాయణ వద్ద ఏకరువు పెట్టారు. గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు స్థానిక శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గురువారం ఒంగోలులోని సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో శాసససభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పనులు చేయకపోతే రేపు మనం ప్రజల్లోకి ఎలా వెళ్లగలుగుతాం అంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రిని ప్రశ్నించారు.
ఇగో ప్రాబ్లమ్స్‌లో లేట్ చేస్తున్నారు: ఎమ్మెల్సీ కరణం బలరాం
ప్రపంచబ్యాంకు నిధులతో నాగార్జునసాగర్ కాలువ ఆధునీకరణ పనులకు సంబంధించిన ప్రపోజల్స్ సంవత్సరం నుంచి పైకి కిందకు తిరుగుతున్నాయని శాసనమండలి సభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తి ఇన్‌ఛార్జి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రపంచబ్యాంకుకు సంబంధించిన పనులు తెలంగాణ రాష్ట్రంలో పూర్తయితే, ఇక్కడి సెక్రటేరియట్‌లో ఇగో ప్రాబ్లమ్స్‌తో లేట్ చేస్తున్నారన్నారు. ఇప్పటికే నీటి పంపిణీలో, సాగర్ కాలువ ఆధునీకరణ పనుల్లో జిల్లాకు అన్యాయం జరుగుతోందన్నారు. 150కోట్ల రూపాయలతో పనులు చేస్తామంటూ సీఎం స్వయంగా ప్రకటించినా ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదన్నారు. జిల్లాలోని అద్దంకి బ్రాంచ్ కెనాల్, దర్శి బ్రాంచ్ కెనాల్, ఒంగోలు బ్రాంచ్ కెనాల్‌లో లైనింగ్ పనులు చేపట్టి వచ్చే వేసవిలో నీటిని విడుదల చేసేనాటికి సిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
2015లో ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు: ఎమ్మెల్యే స్వామి
2015 సంవత్సరంలో కొండపి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలుకు నోచుకోలేదని ఆ నియోజకవర్గ శాసనసభ్యుడు డోలా బాలవీరాంజనేయస్వామి ఇన్‌ఛార్జి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మూసీనదిపై ఆరు చెక్‌డ్యామ్‌లు, పాలేరు నదిపై ఐదు చెక్‌డ్యామ్‌లను రూ.25కోట్లలతో నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు ఎలాంటి కదలిక లేదన్నారు. ఆఫీసులతోపాటు సెక్రటేరియేట్ చుట్టూ తిరిగితేనే ఫైళ్లు వస్తున్నాయన్నారు. సీఎం పేషీ నుంచి సంవత్సరం క్రితం ఫైల్ వస్తే ఇంతవరకు పనులు చేపట్టలేదని అధికారుల తీరును ఎండగట్టారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఎస్కేప్ ఛానళ్ల వద్ద బలవంతంగా నీళ్లు తెచ్చుకోవలసిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అనంతపురంలో కరువుపోయి పశ్చిమ ప్రకాశంలో వచ్చిందన్నారు.
పనులు చేస్తేనే జనం వెళ్లగలుగుతాం : ఎమ్మెల్యే ముత్తుముల
2013 సంవత్సరంలో వచ్చిన తుఫాన్‌తో అంబవరం, పూసలపాడు, మోక్షగుండం చెరువులు తెగిపోయాయని, ఆ చెరువులకు వెంటనే ప్రతిపాదనలు పంపి పనులు చేస్తేనే రేపు మనం ఆ గ్రామాల్లోకి వెళ్లగలుగుతామని గిద్దలూరు శాసనసభ్యుడు ముత్తుముల అశోక్‌రెడ్డి ఇన్‌ఛార్జి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆ మూడు ప్రాంతాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి ఉందని, 1200 అడుగుల లోతులో బోర్లు వేసినా నీరు పడటం లేదన్నారు. జిల్లావ్యాప్తంగా తాగునీటి సమస్య ఉండటంతో ట్యాంకర్ల ద్వారా నీటిని రవాణా చేశారని, దానికి సంబంధించి 70కోట్ల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయని, అవి చెల్లించకుంటే ఈసారి నీటిని రవాణా చేసేవారు కూడా ఉండరన్నారు. గత ఏడాది తన నియోజకవర్గంలో 600బోర్లు నాన్ సీఆర్‌ఎఫ్ కింద చేస్తే ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు.
వైఎస్సార్ సీపీ వాళ్లు బోర్లు వేయించుకుంటున్నారు: మాజీ ఎమ్మెల్యే కందుల
మార్కాపురం నియోజకవర్గ పరిధిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు బోర్లు వేయించుకుంటున్నారని, మనం వేసే పరిస్థితులు ఉండటంలేదని ఆ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వాపోయారు. ఎంపీ గ్రాంట్ ఇస్తుండటంతో వాళ్లు బోర్లు వేయించుకుంటున్నారని తెలిపారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులు గ్రామాల్లో నీళ్లు తోలుకుంటున్నారన్నారు. కరువు కారణంగా మిర్చి పంట ఎండిపోతే, పక్క మండలాల్లో నష్టపరిహారం చెల్లించి తమ మండలాలకు చెల్లించలేదన్నారు. తర్లుపాడు, కొనకనమిట్ల మండలాలకు చెందిన రైతులు ఫసల్ బీమా కింద డబ్బులు కట్టినప్పటికీ వారికి బీమా వర్తించలేదన్నారు. ‘నోరున్నోడికే పనులు జరుగుతున్నాయని, నాలాంటి వాడికి కావడంలేదని’ నారాయణరెడ్డి వ్యాఖ్యానించడంతో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు పెద్దగా నవ్వారు.
వాళ్లు ఐదేళ్లు ఎమ్మెల్యేలు, మేము మూడేళ్లే.. : పాలపర్తి డేవిడ్‌రాజు
నీరు–చెట్టు కింద వాళ్లు బాగా పనులు చేసుకుంటున్నారని, వాళ్లు ఐదేళ్లు ఎమ్మెల్యేలు, మేము మూడు సంవత్సరాల ఎమ్మెల్యేమని యర్రగొండపాలెం శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్‌రాజు వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా సభలో నవ్వులు వెలిశాయి. మీరు ముందే రావచ్చు కదా అంటూ అధికారపార్టీ శాసనసభ్యులు వ్యాఖ్యానించారు. రేపటి నుండి తాము దళిత వాడల్లోకి వెళుతున్నామని, అక్కడి తాగునీటి సమస్యను అడుగుతారని, ప్రజలకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడకుండా బోర్లు మంజూరు చేయాలని ఇన్‌ఛార్జి మంత్రిని కోరారు. అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ జిల్లాలో 13వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయని, రైతులు డీడీలు కట్టినప్పటికీ ఇవ్వలేదన్నారు. ముంపు గ్రామాల కాలనీలకు ఇళ్లు నిర్మాణ వ్యయాన్ని పెంచాలని ఇన్‌ఛార్జి మంత్రిని కోరారు.
మాది ఏకాకి జీవితం: ఎమ్మెల్సీ మాగుంట
జిల్లాలోని శాసనసభ్యులకు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. శాసనమండలి సభ్యులమైన తమది ఏకాకి జీవితమని ఎమ్మెల్యే మాగుంట శ్రీనివాసులరెడ్డి వ్యాఖ్యానించడంతో çసమావేశం ఒక్కసారిగా నవ్వులతో నిండిపోయింది. తమకు నియోజకవర్గాలు లేకపోయినప్పటికీ శాసనసభ్యుల సమస్యలను మా సమస్యలుగా భావించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నారాయణ పలువురు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు లేవనెత్తిన సమస్యలపై వెంటనే సంబంధిత ఉన్నతాధికారులతో సెల్‌ఫోన్‌లో మాట్లాడి నిర్ణీత గడువులోగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి శిద్దా రాఘవరావు, శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, పోతుల రామారావు, దామచర్ల జనార్ధన్‌రావు, శాసనమండలి సభ్యులు పోతుల సునీత, జాయింట్ కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్–2 మార్కండేయులు, సీపీఓ కేటీ వెంకయ్య, మాజీ శాసనసభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment