gollapalli subbarao
-
బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి
ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్ : బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తామని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఒంగోలు క్లాత్ మార్కెట్ అసోసియేషన్ హాల్లో బుధవారం ఆంధ్రకేసరి సేవా సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. బ్రాహ్మణులకు వైఎస్సార్ ఎలా అండగా ఉన్నారో జగన్ కూడా అలాగే ఉంటారని భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులు వైఎస్సార్ సీపీకి మద్దతిచ్చి, పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ సీపీ ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. తమ పార్టీ అధికారంలోకి రాగానే పేద బ్రాహ్మణులందరికీ ఇళ్ల స్థలాలిస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ హయాంలో ఈబీసీలకు ప్రాధాన్యమిచ్చిన విషయాన్ని బాలినేని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డికి, అసెంబ్లీ అభ్యర్థి అయిన తనకు ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. వైఎస్సార్ సీపీ బాపట్ల అసెంబ్లీ అభ్యర్థి కోన రఘుపతి మాట్లాడుతూ.. బ్రాహ్మణులకు వైఎస్సార్ ఎంతో సేవ చేశారని కొనియాడారు. బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటా శంకరశర్మ మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీలో బ్రాహ్మణులకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. వైవీ సుబ్బారెడ్డి, బాలినేనిని గెలిపించేందుకు బ్రాహ్మణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కోటా శంకరశర్మను ఘనంగా సన్మానించారు. దక్షిణామూర్తి, గొల్లాపల్లి సుబ్బారావు తదితరులు ప్రసంగించారు. తదనంతరం బాలినేని, వైవీ సుబ్బారెడ్డిని గజమాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. బ్రాహ్మణుల సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు గొల్లాపల్లి సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో నేలబొట్ల సదాశివయ్య, ఉదయగిరి సీతారామాచార్యులు, దక్షిణామూర్తి, చీమలమర్రి సుబ్బారావు, టీవీఎల్ సుబ్రహ్మణ్యం, ఉప్పుగుండూరి శ్రీనివాసరావు, రావిపూడి గిరిజారావు, మద్దులూరి హరిప్రేమనాథ్, జీ రంగనాథ్, ముక్తినూతలపాటి వాసు, మైనంపాటి సాయి పాల్గొన్నారు.యువ లాయర్లు ఎన్ శ్రీనివాసప్రసాద్, పీవీ రాఘవరావు, పీ రత్నాకర్, ఎం శ్రీధర్, భద్రేశ్వరరావు తదితరులు వైవీ సుబ్బారెడ్డి, బాలినేని సమక్షంలో పార్టీలో చేరారు. -
గొల్లపల్లికి ‘బాబు’ జెల్ల!
అమలాపురం, న్యూస్‌లైన్ : ‘నమ్మిన వారినే మోసగించగలరు’ అంటారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అలా మోసగించే విద్యలో తనకు సాటి లేరంటూ.. ‘నమ్ముకున్న వారినీ’ మోసగిస్తూ పోతున్నారు. అదిగో.. ఆ వరవడిలోనే ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు చంద్రబాబు చేదును చవి చూపించనున్నట్టు పార్టీ వర్గాలే అంటున్నాయి. ‘అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థి గొల్లపల్లే’ నని ఏడాది కింద బాబే స్వయంగా, బహిరంగంగా ప్రకటించారు. ఆ మాటను నమ్మిన గొల్లపల్లి నాటి నుంచీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రచారం చేస్తున్నారు. అయితే.. చాప కింద నీరులా తన ఆశలను వమ్ము చేసే పరిణామాలు చోటు చేసుకుంటున్న వాస్తవాన్ని పసిగట్టలేకపోయారు. ఇచ్చిన మాటకు కట్టుబడడం ఇంటావంటా లేదని చాటుతూ.. చంద్రబాబు ఇప్పుడు అమలాపురం పార్లమెంట్ టిక్కెట్‌ను విశాఖలో సెంట్రల్ కస్టమ్స్‌లో అడిషనల్ కమిషనర్‌గా పనిచేస్తూ ఇటీవల వీఆర్ఎస్ తీసుకున్న పండుల రవీంద్రబాబు ఇవ్వాలనుకుంటున్నట్టు సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వలికి చెందిన రవీంద్రబాబు ఎంబీబీఎస్ తర్వాత ఐపీఎస్ చేసినా అప్పట్లో ఉన్న ఆప్షన్లతో రెవెన్యూ సర్వీసుకు వెళ్లారు. ప్రచారంలో గొల్లపల్లి వెనుకబడ్డారని, పార్టీ ఆశిస్తున్న స్థాయిలో ఖర్చు చేయలేకపోతున్నారని భావించిన అధినేత ఇప్పటికే రవీంద్రబాబుకు టిక్కెట్టు ఖరారు చేశారని తెలుస్తోంది. రవీంద్రబాబు ఉద్యోగానికి రాజీనామా చేసినా సాంకేతిక కారణాలవల్ల ఇంకా ఆమోదం పొందలేదు. ఆ లాంఛనం పూర్తయిన వెంటనే పార్లమెంట్ అభ్యర్థిగా ఆయనను ప్రకటించడం ఖాయమని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల చంద్రబాబే స్వయంగా గొల్లపల్లికి చెప్పినట్టు సమాచారం. ‘ఆడి తప్పే నేత’ మాట నమ్మడమెలా? ఏడాదిగా ప్రచారం చేస్తున్న తనను పక్కన పెట్టాలన్న నిర్ణయంపై గొల్లపల్లి ఆగ్రహం వ్యక్తం చేయగా, అమలాపురం లేదా రాజోలు నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని, పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తానని బాబు సముదాయించినట్టు తెలిసింది. ‘జనం మధ్యలో పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన దానికే కట్టుబడని బాబు.. వస్తుందో, రాదో తెలియని ప్రభుత్వంలో మంత్రి పదవి ఇస్తానంటే నమ్మడమెలా?’ అని గొల్లపల్లి వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. గొల్లపల్లి ఎంపిక అనంతరం మిగిలిన నియోజకవర్గాన్ని పొత్తుల్లో బీజేపీకి ఇచ్చే విషయాన్ని పరిశీలించాలనుకుంటున్న సమాచారం. ఇదే జరిగితే అమలాపురం, రాజోలు అసెంబ్లీ స్థానాల నుంచి టిక్కెట్లు తమవేనని నమ్ముతున్న టీడీపీ ఇన్చార్జిలు అయితాబత్తుల ఆనందరావు, బత్తుల రాములకు సైతం మొండిచేయి చూపినట్టవుతుంది. మొత్తం మీద కొత్తవారికి కోరిన వరాలిస్తూ, నమ్ముకున్న వారి నోట కరక్కాయ పెడుతున్న చంద్రబాబు తీరుపై పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ పరిణామం పార్టీ విజయావకాశాలపై క్రీనీడ కాగలదని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.