ఆక్వా ఫుడ్ పార్క్‌కు పూర్తిగా వ్యతిరేకం
భీమవరం అర్బన్ : తుందుర్రులో జనావాసాల మధ్య నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్‌కు తామంతా పూర్తి వ్యతిరేకమని తుందుర్రు, కంసాలిబేతపూడి, జొన్నలగరువు గ్రామాల పెద్దలు తేల్చిచెప్పారు.
శుక్రవారం తుందుర్రులో ఆరేటి కనకయ్య అధ్యక్షతన తుందుర్రు, కంసాలిబేతపూడి, జొన్నలగరువు పెద్దలు, పోరాట కమిటీ నాయకులు సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయా గ్రామాల పెద్దలు ఆరేటి అబ్బులు, కాండ్రేగుల నరసింహరావు, కొట్టు త్రినాథ్, తాడి దానియేలు, నన్నేటి నాగరాజు మాట్లాడుతూ ఇటీవల సబ్ కలెక్టర్, డీఎస్పీ విడివిడిగా గ్రామస్తులతో సమావేశాలు నిర్వహించి ఫుడ్‌పార్కు నిర్మాణంపై పలు అంశాలపై చర్చించి గ్రామస్తులకు వివరించారన్నారు. అయితే ఇంకా పలు అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని అందువల్ల ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. గతంలో ఫ్యాక్టరీ నిర్మించవద్దని పంచాయతీ తీర్మానాలు చేశామని గుర్తు చేశారు. అయినా ప్రభుత్వం, యాజమాన్యం వాటిని పట్టించుకోకుండా పెడచెవిన పెట్టి ఇక్కడే ఫుడ్పార్కుని నిర్మించాలని చూడడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. ఫుడ్‌పార్కు నిర్మాణానికి మూడు గ్రామాల ప్రజలు వ్యతిరేకమని చెప్పారు. సమావేశంలో సముద్రాల వెంకటేశ్వరరావు, బెల్లపు సత్యనారాయణ, యర్రంశెట్టి అబ్బులు, కొత్తపలి విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.