Goods manufacturing Center
-
టోకు ద్రవ్యోల్బణం @ 29 నెలల కనిష్టం
న్యూఢిల్లీ: టోకు ధరల ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం మార్చిలో 29 నెలల కనిష్టానికి దిగి వచ్చింది. 1.34 శాతానికి పరిమితమైంది. ఇంధనాలు, తయారీ ఉత్పత్తుల ధరలు తగ్గగా, ఆహార ఉత్పత్తుల భారం మాత్రం పెరిగింది. డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 3.85 శాతంగాను, గతేడాది మార్చిలో 14.63 శాతంగాను నమోదైంది. ఇది తగ్గడం వరుసగా పదో నెల. చివరిసారిగా 2020 అక్టోబర్‌లో డబ్ల్యూపీఐ ఆధారిత ధరల పెరుగుదల 1.31 శాతంగా నమోదైంది. ‘2023 మార్చిలో ద్రవ్యోల్బణం రేటు తగ్గడానికి ప్రధానంగా ప్రాథమిక లోహాలు, టెక్స్టైల్స్, ఆహారయేతర ఆర్టికల్స్, ఖనిజాలు, రబ్బర్.. ప్లాస్టిక్ ఉత్పత్తులు, క్రూడ్ పెట్రోలియం .. సహజ వాయువు, పేపర్ .. పేపర్ ఉత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టడమే కారణం‘ అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సోమవారం తెలిపింది. తాజాగా ఫుడ్ బాస్కెట్లో గోధుమలు వంటి ధాన్యాల ధరలు నెమ్మదించగా.. కూరగాయలు, పండ్లు, పాలు, పప్పులు మొదలైన వాటి రేట్లు పెరిగాయని ఈక్విరస్ సెక్యూరిటీస్ ఒక నోట్లో పేర్కొంది. రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు కూడా వడ్డీ రేట్ల పెంపు విషయంలో నిర్ణయం తీసుకునే ముందు డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం స్థిరపడేలా చూడటంపైనా, వినియోగ ధరల ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం మరింత తగ్గేలా చూడటంపైనా దృష్టి పెట్టాల్సి ఉంటుందని టీఐడబ్ల్యూ క్యాపిటల్ సీఈవో మోహిత్ రాల్హన్ అభిప్రాయపడ్డారు. ► ఆహార ఉత్పత్తుల రేట్ల పెరుగుదల ఫిబ్రవరిలో 3.81 శాతంగా ఉండగా, మార్చిలో 5.48 శాతంగా నమోదైంది. కూరగాయల ధరలు ఫిబ్రవరిలో 21.53 శాతం తగ్గగా (2022 ఫిబ్రవరి ధరతో పోల్చి), మార్చిలో ఈ తగ్గుదల రేటు 2.22 శాతంగానే ఉంది. ఉల్లి విషయంలో ఫిబ్రవరిలో 40.14 శాతం ధరలు తగ్గగా, మార్చిలో తగ్గుదల రేటు 36.83 శాతంగానే నమోదైంది. ► గోధుమల ధరలు 9.16 శాతం, పప్పుల రేట్లు 3.03 శాతం పెరిగాయి. -
యథేచ్ఛగా రోజ్‌వుడ్ అక్రమ రవాణా
దట్టమైన అడవిగా పేరున్న మర్రిపాకల రేంజ్ నుంచి రోజ్‌వుడ్ ఖాళీ అవుతోంది. ప్రతి శనివారం మంప అల్లూరి స్మారక మందిరం వద్ద రోజ్‌వుడ్ ముక్కల వ్యాపారం జరుగుతోంది. తూర్పుగోదావరి, విశాఖ సరిహద్దుల ద్వారా కొనుగోలు చేసిన ఉడ్ మొత్తం తరలిపోతుంది. కాకరపాడు చెక్‌పోస్టు అక్రమ రవాణాకు అడ్డగా మారింది.ఇదంతా అటవీ అధికారులకు తెలిసే జరుగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. * మంపలో రోజ్‌వుడ్ వ్యాపారం * వారానికి రూ.3 లక్షలలావాదేవీలు * వస్తువుల తయారీ కేంద్రంగా రేవళ్ల * పట్టించుకోని అధికారులు కొయ్యూరు:రోజ్‌వుడ్(ఇరుగుడుసేవ)కు మైదా న ప్రాంతంలో మంచి డిమాండ్ ఉంది.దీని తరువాతనే టేకుకు ప్రాధాన్యమిస్తారు.ప్రతి శనివారం మంపలోని అల్లూరి పార్క్ వద్దకు ఆదివాసీలు రోజ్‌వుడ్ ముక్కలు తీసుకు వస్తారు. వాటిని కొనుగోలు చేసేందుకు రాజవమ్మంగి, కొయ్యూరు, రాజేంద్రపాలెం, పాతూరు, కేడీపేట, నర్సీపట్నం ప్రాంతాల నుంచి వ్యాపారులు వస్తున్నారు. తూర్పుగోదావరి, విశాఖలోని మారుమూల ప్రాంతాలకు చెందిన సుమారు 20 గ్రామాలకు చెందిన గిరిజనులు ప్రతి శనివారం రోజ్‌వుడ్‌ను తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ప్రతివారం ఇక్కడ రూ.3 లక్షల వ్యాపారం జరుగుతుందని అంచనా. వ్యాపారులు వాటిని కొనుగోలు చేసి రాజేంద్రపాలెం, మంప, రేవళ్లలో నిల్వ చేస్తా రు. కొంతకాలం తరువాత వాటిని ఐసర్ లేదా జీపులు, టాటా మేజిక్‌లలో తరలిస్తున్నారు. వస్తువుల తయారీ కేంద్రంగా రేవళ్ల: రోజ్‌వుడ్ ముక్కలను వస్తువులుగా చేసేందుకు వీలుగా మెషీన్లు ఏర్పాటు చేసుకున్న వారికి అనుమతి ఇస్తున్నారు. దీనికి సంబంధించి వడ్రంగులు,అధికారుల మధ్య ఒప్పందాలున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంపలో కొనుగోలు చేసిన వాటిని రేవళ్ల తీసుకువచ్చి అక్కడ వస్తువులుగా తయారు చేసి మైదాన ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. అనుమతి లేని వీటిపై దాడులు చేసి పట్టుకోవాల్సిన అట వీశాఖ అధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తుండటంతో ఈ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. అడవిలో రోజ్‌వుడ్ ఖాళీ!: వారానికి 250 వరకూ రోజ్ఉడ్ ముక్కలు రావడంతో అడవి ఖాళీఅవుతోంది.అటవీ అధికారులు అక్రమ రవాణాను అరికట్టడం ద్వారా రోజ్వుడ్చెట్లను పరిరక్షించవచ్చు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని అదుపులోకి తీసుకున్నా లేకుంటే వారు కొనుగోలు చేసిన ఉడ్‌ను పట్టుకున్నా రావడం మానేస్తారు. * ఎప్పుడో ఒకసారి దాడులు: దాడులు చేయకుంటే ఉన్నతాధికారులకు అనుమానం వస్తుందని ఇక్కడ అధికారులు ఎప్పుడో ఒకసారి దాడులు చేస్తారు. పట్టుకున్న రోజ్‌వుడ్‌ను కూడా పూర్తిగా కలప డిపోకు చేరుస్తారన్న నమ్మకం లేదు. * అక్రమ రవాణాపై దాడులు చేస్తాం: నర్సీపట్నం డీఎఫ్‌వో లక్ష్మణ్‌ను వివరణ కోరగా, అక్రమ రవాణాపై దాడులు చేస్తామని చెప్పారు. కలప రవాణా అయ్యే ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సిబ్బందికి వెంటనే ఆదేశాలు ఇస్తామని తెలిపారు.