Google mapping
-
భూముల ధరలకు రెక్కలు.. ‘రింగ్’ రియలేనా?
సాక్షి, రంగారెడ్డి/ కొందుర్గు: గత కొంతకాలంగా స్తబ్దతగా ఉన్న రియల్ వ్యాపారం ఒక్కసారిగా జోరందుకుంది. రింగ్‌రోడ్డు వస్తుందంటూ వార్తలు రావడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చినట్లయింది. అయితే “రింగ్’ రియల్‌గా ఎక్కడి నుంచి వెళ్తుందో ఎవరి భూములు రోడ్డుకు పోతాయో, ఎవరి భూ ములు మిగులుతాయో అంటు స్థానికులు అయోమయానికి గురవుతున్నారు. ఇటీవలే గూగుల్ ఎర్త్‌మ్యాప్ ద్వారా రోడ్డు వెళ్లే మార్గం సూచిస్తున్న గూగుల్ మ్యాప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో, చుట్టుపక్కల భూముల రైతులు తమ భూములకు మంచి ధరలు వస్తాయని ఆశల పల్లకీలో తేలుతున్నారు. మండలంలో ఇప్పటికి వరకు ఎకరం భూమి ధర రూ.40 లక్షల నుంచి 80 లక్షల వరకు ఉండేది. కాగా, రింగ్‌రోడ్డు ప్రకటనతో ఏకంగా ఎకరం కోటి రూపాయలు దాటింది. ఎక్కడ మారుమూల ప్రాంతంలో భూమి కొనుగోలు చేద్దామన్నా రూ.80 లక్షలకు తక్కువ దొరకడం లేదని రియల్ వ్యాపారులు అంటున్నారు. ఇన్నర్, ఔటర్ గ్రామాలు ఇవే.. చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు నిర్మించనున్న దక్షిణ భాగం రీజినల్ రింగ్‌రోడ్డుకు సంబంధించి గ్రామాల్లో మార్కింగ్ కూడా చేసినట్లు తెలిసింది. ఇక తాజాగా రోడ్డుకు లోపలి గ్రామాలు, వెలుపలి గ్రామాల జాబితా విడుదల చేసినట్లు గ్రామాల జాబితా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏకంగా రెవెన్యూ గ్రామాల వారీగా ఎన్ని కిలోమీటర్ల రోడ్డు నిర్మిస్తారోనని గ్రామాల జాబితాలో నమోదు చేయడం జరిగింది. దీంతో ఇక రింగ్‌రోడ్డు వెళ్లేది ఖాయమేనని రియల్ వ్యాపారులు, రైతులు నమ్ముతున్నారు. రింగ్ రోడ్డు ఇలా వెళ్తుందా..? సంగారెడ్డి జిల్లా కొండాపూర్, కంది మండలాల నుంచి వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్, నవాబ్‌పేట్, పూడూర్ మండలాల మీదుగా రంగారెడ్డి చేవెళ్ల, శంషాబాద్, షాబాద్, కొందుర్గు, ఫరూఖ్‌నగర్, కేశంపేట, తలకొండపల్లి, ఆమనగల్లు, కడ్తాల్, మాడ్గుల, మంచాల మండలాల మీదుగా రింగ్‌రోడ్డు వెళ్లనున్నట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆయా గ్రామాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇదే అదును చేసుకొని రియల్ వ్యాపారులు ఓ అడుగు ముందుకేసి తమ వ్యాపారానికి అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇక రోడ్డు ఎక్కడి నుంచి వెళ్తుందో భూముల ధరలు ఎంతవరకు పెరుగుతాయో వేచి చూడాల్సిందే. మాకు ఎలాంటి సమాచారం లేదు మండల పరిధిలోని ఆయా గ్రామాల గుండా రింగ్ రోడ్డు వస్తుందని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వార్తలు మా దృష్టికి వచ్చాయి. అయినా, ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లును నమ్మి రియల్ వ్యాపారుల ఉచ్చులో పడి రైతులు మోసపోవద్దు. – తహసీల్దార్, రమేష్‌కుమార్, కొందుర్గు. -
గడప దాటారో.. పట్టేస్తారు!
సాక్షి, కర్నూలు: జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. కోవిడ్ వైరస్ విస్తరించకుండా తీసుకుంటున్న చర్యలకు సాంకేతికతను జోడించింది. ఆన్లైన్లో పర్యవేక్షించే ఏర్పాట్లు చేసింది. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియం పక్కన ఇందు కోసం ప్రత్యేకంగా కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. రెడ్‌జోన్ ప్రాంతాలకు గూగుల్ మ్యాప్‌లో జియోట్యాగింగ్ చేశారు. దాటి పాజిటివ్ కేసు ఉన్న వ్యక్తులు నివసించే పరిసరాల్లో కిలో మీటర్ దూరంలో పూర్తిగా నిర్భందాన్ని అమలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాలకు ఇతరులు ఎవరూ వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. చిన్న చిన్న వ్యాపార దుకాణాలతో పాటు పట్టణంలోని పెట్రోల్ బంకులన్నింటినీ కూడా మూత వేయించారు. జిల్లాలో 27 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. వాటి పరిధిలోని ప్రజలు నిత్యావసరాల పేరుతో బయటకు వచ్చి వీధుల్లో తిరగకుండా ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేసి లాక్‌డౌన్‌ను కట్టుదిట్టం చేశారు. అత్యధికంగా కేసులు నమోదైన ప్రాంతాల్లో కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అలాగే అనుమానిత ప్రాంతాల్లో వైరస్ నివారణ చర్యలు చేపడుతూనే సర్వే కొనసాగిస్తున్నారు. బయటకు రాకుండా కరోనా నియంత్రణకు సహకరించాలని ప్రజలను పోలీసు అధికారులు కోరుతున్నారు. -
గూగుల్ మ్యాపింగ్‌పై దర్యాప్తునకు సీబీఐ సిద్ధం
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఇంటర్నెట్ సేవల దిగ్గజ సంస్థ గూగుల్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. మ్యాపథాన్-2013 పేరుతో గత ఏడాది ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించిన కార్యక్రమంలో చట్ట విరుద్ధంగా వ్యవహరించినట్లు గూగుల్‌పై ఆరోపణలున్నాయి. దేశంలోని సున్నిత, రక్షణపరమైన ప్రాంతాలను ఆ సంస్థ అక్రమంగా మ్యాపింగ్ చేసినట్లు హోంశాఖకు భారత సర్వేయర్ జనరల్ చేసిన ఫిర్యాదు ఆధారంగా.. ఈ విషయంలో ప్రాథమిక దర్యాప్తు(పీఈ)నకు సీబీఐ సిద్ధమైనట్లు సమాచారం. మ్యాపథాన్లో భాగంగా ఎవరికి వారు తమ చుట్టుపక్కల ప్రాంతాలను మ్యాపింగ్ చేయాలని దేశ పౌరులకు గూగుల్ పోటీ పెట్టింది. దీనిపై దృష్టిసారించిన సర్వే ఆఫ్ ఇండియా.. ఈ పోటీలో గూగుల్‌కు అందిన సమాచారాన్ని తీసుకుని పరిశీలించింది. చట్ట విరుద్ధంగా నిషిద్ధ ప్రాంతాలననూ మ్యాపింగ్ చేసినట్లు గుర్తించింది. జాతీయ మ్యాపింగ్ విధానం నిబంధనల ప్రకారం దేశ భౌగోళిక వ్యవస్థను మ్యాపింగ్ చేసే అధికారం తమకే ఉందని, గూగుల్ చట్టాన్ని ఉల్లంఘించిందని కేంద్రానికిి ఫర్యాదు చేసింది. -
గూగుల్‌పై సీబీఐ విచారణ
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్‌పై సీబీఐ ప్రాథమిక విచారణ నమోదు చేసింది. 2013లో గూగుల్ పొందుపరిచిన మ్యాప్‌లను సీబీఐ నిశితంగా పరిశీలించనుంది. చట్టాలను అతిక్రమించి నిషేధిత ప్రాంతాలను మ్యాపింగ్ చేసినట్టు అభియోగాలు నమోదు చేసింది. భారత రక్షణ స్థావరాలు, ఇతర సున్నితమైన ప్రదేశాలను చిత్రీకరించినట్టు ఆరోపణలు వచ్చాయి. భారత సర్వేయర్ జనరల్ కార్యాలయం ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించింది. గతేడాది మార్చిలో మ్యాపింగ్ పోటీలు నిర్వహించే ముందు భారత సర్వే కార్యాలయం అనుమతి తీసుకోలేదని తెలియజేసింది. పరిసర ప్రాంతాలు, ఆస్పత్రులు, రెస్టారెంట్ల వివరాలను మ్యాపింగ్ చేయాల్సిందిగా ప్రజలను కోరుతూ గూగుల్ పోటీలను నిర్వహించింది. అయితే ప్రజలకు సంబంధంలేని సున్నితమైన రక్షణ స్థావరాలను ఎలా మ్యాపింగ్ చేశారో తెలియజేయాల్సిందిగా సర్వే ఆఫ్ ఇండియా గూగుల్‌కు సూచించింది. గూగుల్ నిబంధనలను ఉల్లంఘించడాన్ని కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళ్లింది. హోం శాఖ ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేయనుంది.