న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఇంటర్‌నెట్ సేవల దిగ్గజ సంస్థ గూగుల్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. మ్యాపథాన్-2013 పేరుతో గత ఏడాది ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించిన కార్యక్రమంలో చట్ట విరుద్ధంగా వ్యవహరించినట్లు గూగుల్‌పై ఆరోపణలున్నాయి. దేశంలోని సున్నిత, రక్షణపరమైన ప్రాంతాలను ఆ సంస్థ అక్రమంగా మ్యాపింగ్ చేసినట్లు హోంశాఖకు భారత సర్వేయర్ జనరల్ చేసిన ఫిర్యాదు ఆధారంగా.. ఈ విషయంలో ప్రాథమిక దర్యాప్తు(పీఈ)నకు సీబీఐ సిద్ధమైనట్లు సమాచారం. మ్యాపథాన్‌లో భాగంగా ఎవరికి వారు తమ చుట్టుపక్కల ప్రాంతాలను మ్యాపింగ్ చేయాలని దేశ పౌరులకు గూగుల్ పోటీ పెట్టింది. దీనిపై దృష్టిసారించిన సర్వే ఆఫ్ ఇండియా.. ఈ పోటీలో గూగుల్‌కు అందిన సమాచారాన్ని తీసుకుని పరిశీలించింది.
చట్ట విరుద్ధంగా నిషిద్ధ ప్రాంతాలననూ మ్యాపింగ్ చేసినట్లు గుర్తించింది. జాతీయ మ్యాపింగ్ విధానం నిబంధనల ప్రకారం దేశ భౌగోళిక వ్యవస్థను మ్యాపింగ్ చేసే అధికారం తమకే ఉందని, గూగుల్ చట్టాన్ని ఉల్లంఘించిందని కేంద్రానికిి ఫర్యాదు చేసింది.