‘చరిత్రహీనులం కారాదు’
ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి మూడేళ్లు కావస్తున్నది. అందుకు ఎన్నో చారిత్రక కారణాలను అంతా చూశారు. కానీ విభజనానంతర రాష్ట్రాల పునర్నిర్మాణంలో చారిత్రక సంపద నిర్వహించే పాత్రను కూడా చూడాలి. ఇక్కడే పాలకుల నిబద్ధత మీద ప్రశ్నలు తలెత్తుతున్నాయని అంటున్నారు ప్రఖ్యాత చరిత్రకారుడు ఆచార్య వకుళాభరణం రామకృష్ణ. గతం నాస్తి కాదు, ఆస్తి. చరిత్ర మీద ప్రేమ అంటే, చారిత్రక సంపద పరిరక్షణ గురించి తపన పడడమంటే గత వైభవపు మేనియాయే దానికి మూలం కాదు. భవిష్యత్తుకు భరోసా ఇవ్వగలిగిన ఎన్నో అంశాలు చరిత్ర నుంచే లభిస్తాయి. గతంలో ఉన్నవి పాలక వంశాల వివరాలే కాదు, కొన్ని శతాబ్దాలు సాగిన పరిపాలన తీరుతెన్నులు కూడా. చరిత్ర అంటే సామాజిక, సాంస్కృతిక గమనం ఒక్కటే కాదు. గతంలో మొదలై సాగుతున్న ఆర్థిక పురోభివృద్ధి క్రమం కూడా. ఇంతటి ప్రాధాన్యం ఉన్నప్పటికీ విభజన తరువాత చారిత్రక సంపదను విభజించుకోవడం దగ్గర తెలుగు రాష్ట్రాలు చూపుతున్న అలక్ష్యం అవాంఛనీయమని ఆచార్య రామకృష్ణ చెబుతున్నారు. చారిత్రక సంపద విలువ, దీనిని విభజించడానికి జరిగిన కృషి, సంపద విభజన అనివార్యతల గురించి ఆయన ఈ ఇంటర్వ్యూలో వివరించారు.
విభజనానంతరం తెలుగు రాష్ట్రాలు ఆస్తులు, అప్పులు, పరిపాలనా విభాగాలను విభజించుకునే క్రమంలో చారిత్రక సంపద పంపకాలకు ఇవ్వవలసినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నది వాస్తవం. ఇది పునర్నిర్మాణంలో చారిత్రక సంపద పాత్రను గుర్తించలేకనా?
రాష్ట్ర విభజన జరిగి అప్పుడే మూడేళ్లు. నీళ్లు, కొలువులు, ఆస్తులు, అప్పులు, పరిపాలనా విభాగాలు, భవంతులు అన్నీ పంచుతున్నారు. ఇది అనివార్యం. ఈ క్రమంలోనే చారిత్రక సంపదను కూడా విభజించుకోవలసి ఉంది. మనం గతంతో సంభాషిస్తూనే ఉంటాం అంటాడు ఈహెచ్ కార్. మనమంతా గతానికి బందీలమే. నిజానికి చరిత్ర, వారసత్వ సంపద పట్ల అభిరుచీ, ఆసక్తీ లేని నేతలు దాదాపు ఉండరు. వాటిని సంరక్షించుకోవాలన్న తపన ఎవరికైనా సహజమే. ఎందుకంటే.. చరిత్ర, పురావస్తు శాఖలంటే గత వైభవానికి అవశేషాలు మాత్రమే కావు. భవిష్యత్తుకు భరోసా ఇవ్వగలిగిన సమాచారం కూడా అక్కడే లభ్యమవుతుంది. పాలనా సంబంధమైన దస్త్రాలు, శాసనసభల చర్చలు, జిల్లాల సమాచారం, భూముల వివరాలు, దేవళాలు, దేవమాన్యాలు, జనాభా లెక్కలు, ఓటర్ల జాబితాలు, సర్వేల నివేదికలు, చెరువులు, అడవులు, జలవనరుల సమాచారం కూడా ఇందులో భాగమని గమనించాలి. ముఖ్యంగా వైద్యరంగం నడక, ఆరోగ్యం, విద్య, పాఠశాలల పరిణామక్రమాన్ని చూడాలంటే గత రికార్డులే శరణ్యం. ఈ వాస్తవాన్ని ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది.
ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రులు విడిపోయారు. ఇలాంటి పంపకాలకు సంబంధించి అప్పటి అనుభవాలు ఎలాంటివి?
1953లో ఆంధ్ర రాష్ట్రం విడవడిన తరువాత మద్రాస్ నుంచి కూడా ఇలాంటి సమాచారాన్ని పంచుకున్నాం. పుస్తకాలే ముప్పయ్ నుంచి నలభయ్ వేలు వచ్చాయి. కానీ ఈ ప్రయాణంలో కొన్ని వేలు గల్లంతయ్యాయి. గతంలో ఇక్కడ అచ్చయిన ప్రతి పుస్తకం ఒకటి రెండు ప్రతులు అక్కడకు చేరేవి. నిజానికి ఇంకా కొంత చారిత్రక సంపద మద్రాస్‌లోనే ఉండిపోయింది. ఇంకా చిత్రం, లండన్ మ్యూజియంలో కూడా అమరావతి శిల్పాలు ఉండిపోయాయి. వాటి కోసం అక్కడ ఒక విభాగమే ఉంది. అంత సంపదన్నమాట. ఇందులో మధ్య యుగాల చరిత్ర రచనకు కావలసిన ఆధారాలుంటాయి. శాసనాలు, నాణేలు, తాళపత్ర గ్రంథాలు వంటివి.
ఇప్పుడు రెండు రాష్ట్రాలు తక్షణం పంపకాలు చేసుకోవలసిన మేధో సంబంధమైన, చారిత్రక, సాంస్కృతిక విభాగాలు, వ్యవస్థలు ఎన్ని ఉన్నాయి?
ప్రధానం నాలుగు– స్టేట్ ఆర్కైవ్స్ (రాష్ట్ర అభిలేఖాగారం –ప్రాచీన పత్రాల కేంద్రం), రాష్ట్ర పురావస్తు శాఖ (ఆర్కియాలజీ విభాగం), ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్స్ లైబ్రరీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. ఇవన్నీ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి.
ఆ నాలుగు సంస్థలలోని చారిత్రక, పురావస్తు, సాహిత్య, సాంస్కృతిక సంపద గురించి...
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కైవ్స్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ దేశంలోనే ఓ ప్రతిష్టాత్మక సంస్థ. ఐదు కోట్ల రికార్డులు ఇక్కడ భద్రపరిచారు. 1896లో మొదలైంది. 1406 నుంచి, అంటే బహమని, అదిల్షా, కుతుబ్‌షా, మొగలుల కాలం నుంచి ఇటీవల వరకు అక్కడ రికార్డులు ఉన్నాయి. ఔరంగజేబు దక్కనులో పదిహేనేళ్లున్నాడు. ఆ మొత్తం వివరాలు ఇక్కడే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అవతరణ తరువాత, 1957 మే ఒకటో తేదీన ఆంధ్రప్రదేశ్ రికార్డ్స్ ఆఫీసు కూడా విలీనమైంది. కొందరు వ్యక్తుల సొంత గ్రంథాలయాలు కూడా చేరాయి.
వెలకట్టలేని చారిత్రక సంపదకు కాణాచి రాష్ట్ర పురావస్తు శాఖ/ పురావస్తు ప్రదర్శన శాలల శాఖ. పురాతన చరిత్ర రచనకు ఆధారం ఈ విభాగమే. ఇందులో రోమన్ల బంగారు నాణేలు, మన పాలకుల బంగారు, వెండి, రాగి నాణేలు గోతాముల కొద్దీ ఉన్నాయి. ఎన్నో శిల్పాలు, పంచలోహ విగ్రహాలు, పురాతన కళాఖండాలు, శాసనాలు కూడా ఆ శాఖ దగ్గరే ఉన్నాయి. విలువైన ఆస్తులున్నాయి. వీటి జాబితాలు చూస్తే తెలుస్తుంది, ఈ శాఖ ఘనత. చారిత్రక స్థలాల దగ్గర తవ్వకాలు, చారిత్రక కట్టడాల రక్షణ ఈ శాఖలోనిదే. ఇంతటి ప్రాధాన్యం ఉన్న వ్యవస్థ కాబట్టే 1861లో ఆర్కియలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. ఆ పని చేసినది ఒక పరాయి, వలస ప్రభుత్వమని గుర్తుంచుకోవాలి. ఆ సంస్థ దక్షిణ ప్రాంత విభాగం ఇక్కడ పనిచేసింది. ప్రస్తుతం మన ఆర్కియాలజీ విభాగానికి చాలా గొప్ప గ్రంథాలయం ఉంది.
ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఈ విభాగం గురించి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద పునరాలోచించడం అవసరం. పురావస్తు శాఖను పర్యాటక రంగంలో విలీనం చేశారు. ఇది మంచి నిర్ణయం అనిపించుకోదు. దీని మీద చరిత్రకారులు, పురావస్తు శాస్త్రజ్ఞులు వినతిపత్రం సమర్పించినా సమాధానం రాకపోవడం దురదృష్టకరం. మరొకటి– ఆంధ్రప్రదేశ్ ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్స్ లైబ్రరీ. దీనిని 1967లో స్థాపించారు. తాళపత్ర గ్రంథాలతో పాటు, అచ్చు గ్రంథాలు వేలాదిగా ఉన్నాయి. తెలుగు, సంస్కృతం, ఉర్దూ, అరబిక్, పర్షియన్, కన్నడ, హిందీ, ఒరియా, మరాఠీ, పిస్టి, సింధీలతో పాటు ఇంకొన్ని భాషల గ్రంథాలు కూడా ఉన్నాయి. వేదాలు, ఉపనిషత్తులు, ఆగమాలు, వ్యాకరణం, వైద్యం, తాంత్రిక విద్యలు, యునాని, ఖగోళం, ఎన్నో నిఘంటువులు దొరుకుతాయి.
ఇక, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని డిసెంబర్ 2, 1985లో స్థాపించారు. పెద్ద ధ్యేయంతో ఇది జరిగింది. వరంగల్, రాజమండ్రి, శ్రీశైలంలలో దీని విభాగాలు ఏర్పాటు చేశారు. ఈ విశ్వవిద్యాలయం గ్రంథాలయంలో లక్ష పుస్తకాలున్నాయి. అందులో 55 వేలు తెలుగు గ్రంథాలు. నలభయ్ వేల వరకు ఆంగ్ల గ్రంథాలున్నాయి. అపురూపమైనవన్నీను. పాత పత్రికలకు సంబంధించిన పదివేల సంపుటాలు ఉన్నాయి.
వీటి సేకరణ ఎలా జరిగింది?
ప్రభుత్వ నిధులు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి చేరాయి. అన్ని మార్గాల నుంచి సమకూడాయి. ఉదాహరణకి తెలుగు విశ్వవిద్యాలయం గ్రంథాలయానికి మల్లంపల్లి సోమశేఖరశర్మ, రాయప్రోలు సుబ్బారావు, తూమాటి దొణప్ప, కొసరాజు రాఘవయ్య, పీఎస్ఆర్ అప్పారావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ, పీవీ పరబ్రహ్మశాస్త్రి వంటివారి సొంత గ్రంథాలయాల నుంచి కూడా పుస్తకాలు వచ్చాయి. గొప్ప నది ఉపనదులను కలుపుకుంటూ విస్తరించినట్టు ఈ జ్ఞానం కొన్ని దశాబ్దాల నుంచి విస్తరించింది.
పంపకానికి సంబంధించి ఇంతవరకు జరిగిన చర్యలు ఏమిటి?
పదో షెడ్యూలు ప్రకారం విభజించవలసిన వాటిలో ఈ నాలుగు కూడా ఉన్నాయి. రెండు ప్రాంతాలకు సంబంధించిన నిపుణులతో రెండు కమిటీలను స్టేట్ ఆర్కైవ్స్ నియమించింది. ఆంధ్రప్రాంత నిపుణుల కమిటీలో డాక్టర్ జరీనా పర్వీన్ (ఆర్కైవ్స్ డైరెక్టర్), ప్రొ. ఏఆర్ రామచంద్రారెడ్డి, ప్రొ. కేవీ నారాయణరావులతో పాటు ఆరుగురు ఆర్కైవ్స్ అధికారులు కూడా సభ్యులుగా ఉన్నారు. తెలంగాణ ప్రాంత నిపుణుల కమిటీలో శ్రీపాద సుబ్రహ్మణ్యం, ప్రొ. వై. వైకుంఠం, ప్రొ. బి. రామబ్రహ్మం, ప్రొ. ముస్తాఫా షరీఫ్, ప్రొ. ఎ. రాములు, ప్రముఖ పత్రికా రచయిత పొత్తూరి వెంకటేశ్వరరావు సభ్యులు. నేను ఈ రెండు కమిటీలలోనూ ఉన్నాను.
ఏపీ, తెలంగాణల మధ్య విభజించదగిన రికార్డులను గుర్తించడం, డిజిటలైజేషన్, మైక్రోఫిల్మింగ్, ప్రచురణలు, కొన్ని ఇతర అంశాల గురించి సలహాలు ఇవ్వడమే వీటి పని. 2015లోనే ఈ కమిటీలు సమావేశాలు జరిపి సిఫారసులు ఇచ్చాయి. పనిని సకాలంలో పూర్తి చేసిన మా కమిటీల సిఫారసులకూ స్పందనలేదు. పురావస్తు శాఖ విభజన కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఆ పనిని పూర్తి చేయలేకపోయింది. ఈ శాఖ విషయంలో ఇలా జగడం బాధాకరం.
ప్రధానంగా మీ సలహాలు, సిఫారసులు ఏమిటి?
పంపకాలు సామరస్యంగా జరగాలి. సభ్యులందరి అభిప్రాయం ఇదే. ఉర్దూ, పర్షియన్ భాషా గ్రంథాలు ఆంధ్ర ప్రాంతం వారికి ఎందుకని కొందరన్నారు. కానీ అన్నీ కావాలని ఆంధ్ర ప్రాంతం వారు కోరారు. ఏ జిల్లాలకు సంబంధించినవి ఆయా రాష్ట్రాలకు అప్పగించడం ఒకటి. ఎవరు ఏవి కోరుకున్నా వాటిæనకళ్లు ఇచ్చిపుచ్చుకోవడం మరొకటి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసససభ, శాసన మండలి చర్చల సంకలనాల ప్రతిని ఆంధ్రప్రదేశ్‌కు అందించాలి. 35 ఎంఎం న్యూస్ రీళ్లను తెలం గాణ భద్రపరుచుకోవచ్చు. కోరితే ఆంధ్రకు వాటి నకళ్లు ఇవ్వవచ్చు.భారత ప్రభుత్వ గెజెట్ల నకళ్లను కూడా ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కైఫియత్లను వారికే అప్పగించాలి. వీటికి అయ్యే ఖర్చు కోసం బడ్జెట్లో ప్రభుత్వాలు ప్రత్యేక నిధి కేటాయించాలి. ఇందుకయ్యే ఖర్చు కూడా ఎక్కువేమీ కాదు.
డిజిటలైజేషన్ పని ఎంతవరకు అయింది?
స్టేట్ ఆర్కైవ్స్‌లో తెలుగు విభాగంలో 2,075, సంస్కృత భాషా విభాగంలో 4,230, ఉర్దూ, అరబిక్, పర్షియన్ విభాగంలో 17,017 వ్రాతప్రతులు ఉన్నాయి. మొత్తం 23,322. ఇందులో 15,685 వ్రాతప్రతులను డిజిటలైజ్ చేశారు. మిగిలినవి 7,637. అంటే 15 లక్షల పేజీలను డిజిటలైజ్ చేయాలి. ఈ పనికి మేం ఇచ్చిన అంచనా డబ్బయ్ లక్షల రూపాయలు.
పంపకాల జాప్యంతో ఈ రాష్ట్రాల మీద పడుతున్న తక్షణ ప్రభావం ఏమిటి?
త్వరలోనే ఆ ప్రభావం స్పష్టమవుతుంది. ఇక పంపకాలు ఎలా ఉన్నా, విభజన తరువాత తెలంగాణలో తవ్వకాలు బాగా సాగుతున్నాయి. భాషా సంఘం ఏర్పాటు చేసుకున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు యోజన కూడా మొదలైంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఈ స్థాయి కదలిక లేదు. ఇందుకు విచారిస్తూనే ఒక వాస్తవాన్నీ ఒప్పుకోవాలి. పాత రాష్ట్రమే అయినా, ఆంధ్రప్రదేశ్‌కు కొత్త సమస్యలు ఎక్కువ. అయినా ఈ ముఖ్యమైన పనినీ, పార్శా్వన్నీ సుదీర్ఘకాలం నిర్లక్ష్యం చేయడం వల్ల చాలా కోణాల నుంచి నష్టం తప్పదు. ఇప్పటికే చాలా చారిత్రక ఆధారాలు కాలగర్భంలో కలసిపోయాయి. ఆ సాంస్కృతిక విధ్వంసపు కొనసాగింపు పట్ల మౌనం పాటించడం ఆధునికకాలపు మానవాళి చేయవలసిన పనికాదు. ఆ సాంస్కృతిక, చారిత్రక వారసత్వ విధ్వంసాన్ని ఇలాగే కొనసాగనిస్తే మనమంతా చరిత్రహీనులుగా మిగిలిపోతాం. ఇదొక చారిత్రక కర్తవ్యం. అలాంటి కర్తవ్యాన్ని సకాలంలో నిర్వహించకుంటే భవిష్యత్తు, ముందటి తరాలు కూడా మనల్ని బోనులో నిలబెడతాయి.
ఇంటర్వ్యూ : డాక్టర్ గోపరాజు నారాయణరావు