
హృదయం: మృతుడికో లేఖ
మీసాలు మొలిచి, ఆరోగ్యంగా ఉన్న యువకుడు ఎవరైనా యుద్ధానికి వెళ్లకుండా ఉండిపోతే, వింతగా చూసిన కాలమది. ఒక్క ఇంగ్లండ్‌లోనే కాదు, యూరప్ ఖండమంతటా ఇదే ధోరణి కనిపించింది. అందుకే మార్టిన్ అనివార్యంగా యుద్ధరంగానికి వెళ్లిపోయాడు. యుద్ధభూమిలో ఒలికిన ప్రతి రక్తపు బిందువుకు ఓ కథ ఉంటుంది. ఇంకెక్కడో జారిన కన్నీటి బిందువులో ఆ కథ నిక్షిప్తమై ఉంటుంది. విలియం మార్టిన్, ఎమిలీ చిట్టిక్స్ కథ ఇందుకు ఉదాహరణ. మొదటి ప్రపంచ యుద్ధంలో చిందిన ఓ నెత్తుటి బిందువు మార్టిన్. ఎమిలీ కనుకొనలలోని బాష్పకణం ఆ జ్ఞాపకాన్ని కొన్ని దశాబ్దాల పాటు బాధగా, భద్రంగా దాచుకుంది.
‘వృద్ధులు యుద్ధం ప్రకటిస్తారు. అందులో యువకులు మరణిస్తారు’ అన్నది పాశ్చాత్యుల నానుడి. గ్రేట్‌వార్ అని పిలిచే మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయిన పది లక్షల మందిలో నూనూగు మీసాల యువకులే ఎక్కువ. చరిత్రకారులు ఈ మహా యుద్ధానికి సంబంధించిన అనేక అంశాలను చెప్పారు. ఇంకా చెప్పవలసి ఉంది- యుద్ధంతో అర్ధంతరంగా ముగిసిపోయిన ప్రేమగాథల గురించి కూడా.
విలియం మార్టిన్ ఇంగ్లండ్ తరఫున డెవన్‌షైర్ రెజిమెంట్‌లో చేరిన ప్రైవేటు సైనికుడు. యుద్ధమంత్రి కిష్నర్ పిలుపును అందుకుని అనేక మంది స్వచ్ఛందంగా యుద్ధం చేయడానికి వెళ్లారు. వాళ్లే ప్రైవేటు సైనికులు. ఎమిలీ చిట్టిక్స్ అనే ఒక యువతిని మార్టిన్ మొదటిసారి యుద్ధ సమయంలోనే 1916 ఆగస్టులో కలుసుకున్నాడు. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారం మేరకే పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. ఆ సంవత్సరం అక్టోబర్‌లో ఆ వేడుక జరుపుకోవాలని నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇంతలోనే మార్టిన్ యుద్ధంలో పాల్గొనడానికి ఫ్రాన్స్ వెళ్లవలసి వచ్చింది. మీసాలు మొలిచి, ఆరోగ్యంగా ఉన్న యువకుడు ఎవరైనా యుద్ధానికి వెళ్లకుండా ఉండిపోతే, వింతగా చూసిన కాలమది. ఒక్క ఇంగ్లండ్‌లోనే కాదు, యూరప్ ఖండమంతటా ఇదే ధోరణి కనిపించింది. అందుకే మార్టిన్ అనివార్యంగా యుద్ధరంగానికి వెళ్లిపోయాడు.
మార్టిన్ యుద్ధం కోసం ఫ్రాన్స్, బెల్జియం మధ్య ఉన్న పశ్చిమ యుద్ధరంగానికి వెళ్లాడు. యుద్ధరంగం నుంచి తమ తమ కుటుంబ సభ్యులకి సైనికులు ఉత్తరాలు రాసేవారు. ఇవే కొన్ని లక్షలు ఉన్నాయి. ఇంపీరియల్ వార్ మ్యూజియం వీటిలో చాలా వాటిని ఇప్పటికీ భద్రపరిచి ఉంచింది. భార్యలకు రాసిన ఉత్తరాలు కొన్నయితే, ప్రేయసులకు రాసుకున్న ఉత్తరాలు కొన్ని. మార్టిన్, ఎమిలీ మధ్య కూడా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. ఎమిలీ, మార్టిన్ మధ్య ఎలాంటి ప్రేమ ఉండేదో ఆ ఉత్తరాలు చెబుతాయి. యుద్ధం కలిగించే భయం, యుద్ధవార్తలు రేపిన కలవరం, యుద్ధం తరువాత రాబోయే కల్యాణ ఘడియల మీద ఆశ ఆ లేఖల నిండా కనిపిస్తాయి.
‘నా ప్రియమైన ఎమిలీ!
నీ కోసం ఈ కొన్ని వాక్యాలు రాస్తున్నాను. నేను ప్రస్తుతానికి సురక్షితమైన చోటే, క్షేమంగా ఉన్నాను. నా ఎమిలీ! నీవూ క్షేమమని తలుస్తాను. నీవు రాసిన ఉత్తరం ఇప్పుడే అందుకున్నాను. అది ఎంత సంతోషం నింపిందో తెలుసా! ఈ లేఖ ఎంత తొందరగా వచ్చేసిందో! నాకు చేరడానికి ఐదు రోజులే పట్టింది. నీవు అక్కడ, నేను ఇక్కడ... నిజానికి ఈ ఎడబాటు ఎక్కువ కాలం ఉండదు. హృదయ పూర్వక ప్రేమతో, ముద్దులతో నీ మధుర ప్రేమ మూర్తి విల్’ (విలియం). అని ఫ్రాన్స్ నుంచి, 24 మార్చి, 1917న రాశాడు.
ఈ లేఖకి ఎమిలీ మార్చి 29, 1917న జవాబు రాసింది. క్షేమ సమచారాలు అయ్యాక ఆమె ఈ వాక్యాలు రాసింది.
‘నీవు తరుచు ఉత్తరాలు రాయగలిగే స్థితిలో లేవని నేను అర్థం చేసుకోగలను. ఇకపై నీవు రాసే ఉత్తరాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూడవలసి ఉంటుందని కూడా తెలుసు.....కానీ నీ దగ్గర నుంచి ఉత్తరం వస్తే అదే నాకు గొప్ప సాంత్వన... నీ ప్రేమకు నోచుకున్న చిన్న అమ్మాయి (అప్పటికి ఎమిలీ వయసు ఇరవై). కానీ ఈ ఉత్తరానికి ఎంతకాల ం ఎదురు చూసినా జవాబు రాలేదు. మళ్లీ ఒక ఉత్తరం రాసిందామె. నెలలు గడచిపోతున్నా జవాబు రాలేదు. ఆ నిరీక్షణలోనే ఐదు ఉత్తరాలు రాసి పోస్టు చేసింది. ఎందుకో మరి మార్చిలో అందుకున్న లేఖ తరువాత ఎమిలీ ఎర్ర సిరాతో ఉత్తరాలు రాయడం మొదలు పెట్టింది.
ఒకరోజు హఠాత్తుగా ఐదు ఉత్తరాలు వచ్చాయి. అయితే అవన్నీ తాను మార్టిన్‌కు రాసినవే. తిరిగి వచ్చేశాయి. అందులో చివరి ఉత్తరం మీద ఒక వివరణ- ‘మార్టిన్ యుద్ధంలో చనిపోయాడు’. ఫ్రాన్స్ నుంచి మార్టిన్ మార్చి 24న ఉత్తరం రాసిన మూడో రోజునే యుద్ధంలో స్నైపర్ గన్‌కు బలయ్యాడు. మార్టిన్ యుద్ధంలో చనిపోయినా, అతడిని ఎక్కడ సమాధి చేసినదీ తెలియలేదు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఇదొక విషాదం. చాలామందికి తమ కుటుంబ సభ్యుల మరణ వివరాలు కూడా సకాలంలో అందలేదు. మార్టిన్ మరణవార్త ఎమిలీని కలచివేసింది. ఆమె మరో వివాహం చేసుకోలేదు. 1974 వరకు మార్టిన్ జ్ఞాపకాలతోనే ఉండిపోయింది. ఆ సంవత్సరం ఆమె మరణించిన తరువాత ఆమె కాగితాలు వెతికితే మార్టిన్ రాసినవీ, తిరిగొచ్చిన లేఖలూ దొరికాయి. ఈ ఉత్తరాలతో మరో చిన్న ఉత్తరం కూడా ఉంది. తనను ఖననం చేసే సమయంలో ఆ ఉత్తరాలన్నీ తన శవ పేటికలో వేయవలసిందని ఆమె తుది కోరిక కోరింది. కుటుంబ సభ్యులు అలాగే చేశారు. కాలం మీద యుద్ధం మిగిల్చే విషాద ఛాయ ఎంత దీర్ఘమో!
- గోపరాజు నారాయణరావు