gopalan
-
కాంగ్రెస్ నేత సంచలన పోస్టు.. ఉద్రిక్తత
తిరువనంతపురం : కేరళలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు చేసిన ఫేస్బుక్ పోస్టు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కమ్యూనిస్ట్ దిగ్గజం ఏకే గోపాలన్ వైవాహిక జీవితంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీటీ బలరామ్ తన ఫేస్బుక్లో ఓ సంచలన పోస్టు చేశారు. దీంతో గోపాలన్ అనుచరులు విధ్వంసకాండకు తెగబడటంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. పలుచోట్ల కర్ఫ్యూ విధించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. శుక్రవారం తన ఫేస్బుక్లో బలరామ్ ఇలా పోస్టు చేశారు. ‘‘ఏకే గోపాలన్ సుశీలను వివాహం చేసుకున్నారు. పైగా అది ప్రేమ వివాహం. అయితే అప్పటికి సుశీల వయసు 12-13 ఏళ్ల మధ్య ఉంటుంది. దీనికితోడు అప్పటికే ఆయనకు మరో భార్య ఉన్నారు. ఈ లెక్కన్న ఆయన చట్టాన్ని ఉల్లంఘించటంతోపాటు.. మైనర్పై వేధింపులకు పాల్పడినట్లే’’.. అంటూ ఓ సుదీర్ఘమైన పోస్టును ఉంచారు. దీంతో బలరామ్పై సోషల్ మీడియాలో పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(DYFI) కార్యకర్తలు బలరామ్ కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. మద్యం బాటిళ్లను ఆఫీసుపై విసిరి తగలబెట్టేందుకు యత్నించారు. అయితే పోలీసులు రంగప్రవేశం చేయటంతో ఆ ప్రయత్నం విఫలమైంది. ప్రస్తుతం తీర్థల నియోజకవర్గంలోకి ఆయన ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ‘‘గోపాలన్ గొప్పతనం గురించి మాట్లాడినప్పుడు.. ఆయన చేసిన తప్పులను ఎత్తి చూపటం నేరం ఎలా అవుతుంది?’’ అని బలరామ్ నిరసనకారులను ప్రశ్నిస్తున్నారు. అసహనంతోనే వాళ్లు ఈ దాడులకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ వ్యవహారంపై స్పందించేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖత వ్యక్తం చేయటం లేదు. నిరసనకారులు మాత్రం బలరామ్ క్షమాపణలు చెప్పేదాకా వెనక్కితగ్గబోమని హెచ్చరిస్తున్నారు. -
కార్టూనిస్టు గోపులు మృతి
చెన్నై: ప్రముఖ కార్టూనిస్టు గోపులు(ఎస్. గోపాలన్) మృతి చెందారు. తమిళనాట గొప్ప చిత్రకారుడిగా, కార్టూనిస్టుగా పేరొందిన ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నెల 27న ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 7.30 గంటలకు కన్నుమూశారు. ఆనంద వికటన్ పత్రికలో కార్టూనిస్టుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన జాతీయ స్థాయిలో కీర్తి సాధించారు. తమిళనాట పలు సీరియళ్లకు కూడా ఆయన పనిచేశారు. 1991లో తమిళనాడు ప్రభుత్వం కలైమామణి బిరుదుతో ఆయన్ను సత్కరించింది.