ఏకే గోపాలన్ (పాత చిత్రం)
తిరువనంతపురం : కేరళలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు చేసిన ఫేస్‌బుక్ పోస్టు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కమ్యూనిస్ట్ దిగ్గజం ఏకే గోపాలన్ వైవాహిక జీవితంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీటీ బలరామ్ తన ఫేస్‌బుక్‌లో ఓ సంచలన పోస్టు చేశారు. దీంతో గోపాలన్ అనుచరులు విధ్వంసకాండకు తెగబడటంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. పలుచోట్ల కర్ఫ్యూ విధించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
శుక్రవారం తన ఫేస్‌బుక్‌లో బలరామ్ ఇలా పోస్టు చేశారు. ‘‘ఏకే గోపాలన్ సుశీలను వివాహం చేసుకున్నారు. పైగా అది ప్రేమ వివాహం. అయితే అప్పటికి సుశీల వయసు 12-13 ఏళ్ల మధ్య ఉంటుంది. దీనికితోడు అప్పటికే ఆయనకు మరో భార్య ఉన్నారు. ఈ లెక్కన్న ఆయన చట్టాన్ని ఉల్లంఘించటంతోపాటు.. మైనర్‌పై వేధింపులకు పాల్పడినట్లే’’.. అంటూ ఓ సుదీర్ఘమైన పోస్టును ఉంచారు. దీంతో బలరామ్‌పై సోషల్ మీడియాలో పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(DYFI) కార్యకర్తలు బలరామ్ కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. మద్యం బాటిళ్లను ఆఫీసుపై విసిరి తగలబెట్టేందుకు యత్నించారు. అయితే పోలీసులు రంగప్రవేశం చేయటంతో ఆ ప్రయత్నం విఫలమైంది. ప్రస్తుతం తీర్థల నియోజకవర్గంలోకి ఆయన ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ‘‘గోపాలన్ గొప్పతనం గురించి మాట్లాడినప్పుడు.. ఆయన చేసిన తప్పులను ఎత్తి చూపటం నేరం ఎలా అవుతుంది?’’ అని బలరామ్ నిరసనకారులను ప్రశ్నిస్తున్నారు. అసహనంతోనే వాళ్లు ఈ దాడులకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ వ్యవహారంపై స్పందించేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖత వ్యక్తం చేయటం లేదు. నిరసనకారులు మాత్రం బలరామ్ క్షమాపణలు చెప్పేదాకా వెనక్కితగ్గబోమని హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment