కేరళలో కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షం కాంగ్రెస్-ఎం షాకిచ్చింది.
కేరళలో కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షం కాంగ్రెస్-ఎం షాకిచ్చింది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రతిపక్ష యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) నుంచి తప్పుకొంటున్నట్టు కాంగ్రెస్-ఎం ప్రకటించింది. యూడీఎఫ్ నుంచి తప్పుకోవడమే కాకుండా హస్తంతో దోస్తీని కూడా తెగదెంపులు చేసుకుంటున్నట్టు కాంగ్రెస్-ఎం అధినేత కేఎం మణి ప్రకటించారు. యూడీఎఫ్ నుంచి తాము వైదొలగడానికి కేరళ కాంగ్రెస్ నేతల అటిట్యూడ్ (ధోరణి)యే కారణమని ఆయన పేర్కొన్నారు.
కొంతకాలంగా కాంగ్రెస్ నేతలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, వారి తీరు కారణంగానే తాము వేరవుతున్నట్టు చెప్పారు. అయితే, అధికార వామపక్ష కూటమి ఎల్డీఎఫ్‌లోనూ తాము చేరబోమని, స్వతంత్రంగా కొనసాగుతామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ మిత్రపక్షంగా, యూడీఎఫ్ భాగస్వామిగా కాంగ్రెస్ ఎం పార్టీ మూడు దశాబ్దాలపాటు కొనసాగింది. కాంగ్రెస్ ఎం తమతో దోస్తీకి కటీఫ్ చెప్పడంపై కాంగ్రెస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది.