Gorakhpur Hospital Tragedy
-
ఆ మంత్రి రాజీనామా చేయాల్సిందే: నటి
ముంబయి : ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతోన్న చిన్నారుల మృతిపై బాలీవుడ్ నటి స్వర భాస్కర్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ యూపీ ఆరోగ్య శాఖమంత్రి సిద్ధార్థ్నాథ్ సింగ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవ్‌దాస్ మెడికల్ కాలేజీలో ఆక్సిజన్ అందక ఇప్పటివరకు 70 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘోరకలిపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షాత్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గం గోరఖ్‌పూర్‌లోని ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' ఫేమ్ స్వర భాస్కర్ ట్విట్టర్ ద్వారా ఈ ఘటనపై స్పందించారు. ఇతరులు చేసిన తప్పులకు చిన్నారులు బలవుతున్నారని ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఆరోగ్యశాఖ మంత్రి సిద్ధార్థ్నాథ్ సింగ్ రాజీనామా చేయాలని ట్వీట్ చేశారు. మరోవైపు బాబా రాఘవ్‌దాస్ కాలేజీ ప్రిన్సిపాల్, సిబ్బందిపై వేటు వేసిన ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్‌కు, ఆరోగ్యశాఖ మంత్రి సిద్ధార్థ్నాథ్ కూడా బాధ్యులని తెలీదా? ఆయనపై చర్యలు తీసుకోరా? ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. -
'ఆ మంత్రిపైన చర్యలు తీసుకోరా?'
త్రివేండ్రమ్: గోరఖ్‌పూర్ చిన్నారుల మరణాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ స్పందించారు. త్రివేండ్రమ్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది బీజేపీ ప్రభుత్వం చేసిన క్షమించరాని నేరమని ఆయన పేర్కొన్నారు. 'దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఘటన ఇది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగానే అంత మంది పసిప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 70 ఏళ్ల స్వతంత్ర భారతావనిని అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లు దీనికి ఏం సమాధానమిస్తారు?, కాలేజీ ప్రిన్సిపాల్ మరియు సిబ్బందిపై వేటు వేసిన ముఖ్యమంత్రికి, ఆరోగ్యశాఖ మంత్రి సిద్ధార్థ్నాథ్ కూడా బాధ్యులని తెలీదా? ఆయనపై చర్యలు తీసుకోరా? అని థరూర్ ప్రశ్నించారు. మరో కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబి ఆజాద్ సిద్ధార్థ్నాథ్ రాజీనామా చేయాల్సిందేనని, యూపీ ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష భేటీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇక బాబా రాఘవ దాస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చిన్నారుల మృత్యుఘోష కొనసాగుతూనే ఉంది. శుక్రవారం వరకు 60గా ఉన్న మృతుల సంఖ్య ఇప్పుడు 70 కి చేరిందని అనధికార సమాచారం. మరోపక్క, ఆదివారం కేంద్ర మంత్రి నడ్డా, సీఎం యోగి ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. -
'అది ఆస్పత్రి కాదు.. ఓ వధశాల'
గోరఖ్‌పూర్: సాధారణంగా వైద్యాలయం(ఆస్పత్రి) అంటే దేవాలయంతో సమానంగా భావిస్తారు.. అక్కడికి వెళ్లిన వారు తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొస్తారని, కొన ప్రాణంతో వెళ్లినా సరే ప్రాణంతో వస్తారని. అలాంటి ఆస్పత్రిని ఇప్పుడు తమ కన్నబిడ్డలను కోల్పోయిన ఉత్తరప్రదేశ్ బాధితులు ఏమంటున్నారో తెలుసా.. 'అది ఆస్పత్రి కాదు.. వధశాల'. వధశాల అంటే మృత్యువుండే చోటు. కేవలం ప్రాణం తీయడానికి అక్కడికి తీసుకెళతారు. ఇప్పుడు తమ బిడ్డల పరిస్థితి కూడా ఆస్పత్రికి కాకుండా ఓ వధశాలకు తీసుకెళ్లినట్లే అయిందని వారంతా కన్నీరుమున్నీరవతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సీఎం యోగి ఆదిత్యనాథ్ బాధ్యత వహించిన ఎంపీ నియోజకవర్గం గోరఖ్‌పూర్‌లోగల బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీలో ఆక్సిజన్ అందకపోవడంతో దాదాపు 60మందికి పైగా చిన్నారులు చనిపోయిన విషయం తెలిసిందే. ఇది పెద్ద సంచనలంగా మారింది. బాధిత కుటుంబాలను ఆయా మీడియాలు సంప్రదిస్తుండగా వారి ఆవేదనను పై విధంగా వెళ్లగక్కారు. బాధితుల్లో ఒకరైన శ్రీ కిషన్ గుప్తా అనే వ్యక్తి మాట్లాడుతూ.. 'నాలుగు రోజుల నా బిడ్డ అనారోగ్యంగా ఉందని గురువారం ఉదయం పెద్ద ఆస్పత్రి కదా అని చేర్పించాను. వైద్యులు అత్యవసర విభాగంలో చేర్చారు. అయితే, తన కుమారుడికి అవసరమైన వెంటలేటర్ సౌకర్యం అక్కడ లేదు. నాలుగైదు గంటలు నేనే శ్రమపడ్డాను. ఆక్సిజన్ లేని కారణంగా వెంటిలేటర్ అందించలేమని వైద్యులు చెప్పారు. చివరికి నా బిడ్డ చనిపోయాడు. అది అసలు ఆస్పత్రి కాదు.. అంతకుమించిన వధశాల. నా బిడ్డ మాత్రమే చనిపోవడం కాదు.. నా పక్కనే చనిపోయిన ఇద్దరు బిడ్డలను వారి తల్లిదండ్రులు రోధిస్తూ తీసుకెళుతుంటే ఈ కళ్లతో చూసి తట్టుకోలేకపోయాను' అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. -
చిన్నారుల మృతిపై మంత్రి వివరణ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ బీఆర్డీ ఆస్పత్రిలో చిన్నారులు ప్రాణాలుకోల్పోవడానికి ఆక్సిజన్ లేకపోవడం కారణం కాదని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సిద్దార్థ నాథ్ సింగ్ అన్నారు. ఇలా ఎందుకు జరిగిందో సీరియస్‌గా దర్యాప్తునకు ఆదేశించినట్లు చెప్పారు. ఈ విషయాన్ని తాము చాలా సున్నితమైనదిగా పరిగణిస్తున్నామని, దాదాపు 3గంటలపాటు సమావేశమై తగిన నిర్ణయాలన్ని తీసుకున్నట్లు తెలిపారు. చాలా అర్ధమంతమైన చర్చలు జరిగాయని, ప్రజా సమస్యల విషయంలో ప్రభుత్వం వేగంగా ముందుకు కదులుతుందన్నారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, సున్నితమైనదని చెప్పారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ తక్కువగా ఉందనే విషయం ఎవరూ ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ వచ్చినప్పుడు చెప్పలేదని, కనీసం ఆ ఆలోచన కూడా చేయలేదన్నారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ సంక్షోభం గురించి ప్రభుత్వానికి చెప్పాల్సిన బాధ్యత ఆస్పత్రితేదనని, ఇంత ముఖ్యమైన విషయాన్ని ఎందుకు ఆస్పత్రి వర్గాలు బయటకు చెప్పలేదోనని అనుమానం వ్యక్తం చేశారు. అందుకే ఈ కేసుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయించనున్నట్లు చెప్పారు. ఆక్సిజన్ అందని కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని బీడీఎస్ ఆస్పత్రిలో దాదాపు 60మందికి పైగా చిన్నారులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన సీఎం యోగి ఎంపీగా బాధ్యతలు వహిస్తున్న గోరఖ్‌పూర్‌లోనే చోటు చేసుకుంది. దీనిపై తీవ్ర దుమారం రేగింది. ఈ ఘటనను ఒక ఊచకోతగా నోబెల్ అవార్డు విజేత కైలాష్ సత్యార్థి అభివర్ణించారు. మరోపక్క, ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ కూడా తీవ్రంగా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాలను మోదీ స్వయంగా పరిశీలిస్తున్నారని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్నారని వివరించింది.