
'ఆ మంత్రిపైన చర్యలు తీసుకోరా?'
త్రివేండ్రమ్: గోరఖ్‌పూర్ చిన్నారుల మరణాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ స్పందించారు. త్రివేండ్రమ్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది బీజేపీ ప్రభుత్వం చేసిన క్షమించరాని నేరమని ఆయన పేర్కొన్నారు. 'దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఘటన ఇది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగానే అంత మంది పసిప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 70 ఏళ్ల స్వతంత్ర భారతావనిని అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లు దీనికి ఏం సమాధానమిస్తారు?, కాలేజీ ప్రిన్సిపాల్ మరియు సిబ్బందిపై వేటు వేసిన ముఖ్యమంత్రికి, ఆరోగ్యశాఖ మంత్రి సిద్ధార్థ్‌నాథ్ కూడా బాధ్యులని తెలీదా? ఆయనపై చర్యలు తీసుకోరా? అని థరూర్ ప్రశ్నించారు.
మరో కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబి ఆజాద్ సిద్ధార్థ్‌నాథ్ రాజీనామా చేయాల్సిందేనని, యూపీ ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష భేటీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇక బాబా రాఘవ దాస్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చిన్నారుల మృత్యుఘోష కొనసాగుతూనే ఉంది. శుక్రవారం వరకు 60గా ఉన్న మృతుల సంఖ్య ఇప్పుడు 70 కి చేరిందని అనధికార సమాచారం. మరోపక్క, ఆదివారం కేంద్ర మంత్రి నడ్డా, సీఎం యోగి ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు.