
ఆ మంత్రి రాజీనామా చేయాల్సిందే: నటి
ముంబయి : ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతోన్న చిన్నారుల మృతిపై బాలీవుడ్ నటి స్వర భాస్కర్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ యూపీ ఆరోగ్య శాఖమంత్రి సిద్ధార్థ్‌నాథ్ సింగ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవ్‌దాస్ మెడికల్ కాలేజీలో ఆక్సిజన్ అందక ఇప్పటివరకు 70 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘోరకలిపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సాక్షాత్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గం గోరఖ్‌పూర్‌లోని ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' ఫేమ్ స్వర భాస్కర్ ట్విట్టర్ ద్వారా ఈ ఘటనపై స్పందించారు. ఇతరులు చేసిన తప్పులకు చిన్నారులు బలవుతున్నారని ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఆరోగ్యశాఖ మంత్రి సిద్ధార్థ్‌నాథ్ సింగ్ రాజీనామా చేయాలని ట్వీట్ చేశారు. మరోవైపు బాబా రాఘవ్‌దాస్ కాలేజీ ప్రిన్సిపాల్, సిబ్బందిపై వేటు వేసిన ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్‌కు, ఆరోగ్యశాఖ మంత్రి సిద్ధార్థ్‌నాథ్ కూడా బాధ్యులని తెలీదా? ఆయనపై చర్యలు తీసుకోరా? ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.