
నా భర్త ఓటమికి అవే కారణం
వాటిలో అత్యధిక ఓట్లు బీజేపీకే
నటి స్వరా భాస్కర్ ఆరోపణలు
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈవీఎంల పనితీరు వివాదాస్పదంగా మారుతోంది. అణుశక్తినగర్ అసెంబ్లీ స్థానం ఫలితంపై తీవ్ర అనుమానాలున్నాయని ఎన్సీపీ (ఎస్‌పీ) అభ్యర్థి ఫహాద్ అహ్మద్ పేర్కొన్నారు. ఎన్సీపీ (అజిత్) అభ్యర్థి సనా మాలిక్ చేతిలో కేవలం 3,378 ఓట్ల తేడాతో ఓటమి చవిచూసిన అనంతరం శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘99 శాతం చార్జింగ్ ఉన్న ఈవీఎంలన్నింట్లోనూ సనా మాలిక్ ఆధిక్యం కనబరిచారు. తక్కువ చార్జింగ్ ఉన్న ఈవీఎంల్లోనేమో సనా వెనకబడ్డారు. ఇదెలా సాధ్యం?’’అని ప్రశ్నించారు.
అహ్మద్ అనుమానాలను ఆయన భార్య, సినీ నటి స్వరాభాస్కర్ కూడా బలపరిచారు. ‘‘17 రౌండ్ల దాకా నా భర్తే ఆధిక్యంలో ఉన్నారు. కానీ చివరి మూడు రౌండ్లలో లెక్కించిన ఈవీఎంలన్నీ 99 శాతం బ్యాటరీ చార్జింగ్ ఉన్నవే! వాటన్నింట్లోనూ సనా మాలికే ఆధిపత్యం సాధించడంతో ఫలితమే తారుమారైంది’’అని చెప్పుకొచ్చారు. ‘‘రోజంతా ఓటింగ్ ప్రక్రియ కొనసాగాక ఈవీఎం యంత్రాల్లో చార్జింగ్ తగ్గాలి. చాలా ఈవీఎంల్లో అలాగే తగ్గింది కూడా. కానీ కొన్ని ఈవీఎంల్లోనే, ప్రత్యేకించి చివరి మూడు రౌండ్లలో లెక్కించిన వాటిలోనే ఫుల్ చార్జింగ్ ఉంది. ఇదెలా సాధ్యం?’’అని ఆమె ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment