వారిదంతా వాపు!
అదేదో సినిమాలో నటుడు అలీ లోపల గాలి బుడగలు అమర్చుకొని.. తానో కండల వీరుడినని ఫోజులిస్తుంటాడు. ఇప్పుడు అటువంటి సీనే జిల్లా ఎన్నికల రంగాన్ని రక్తికట్టిస్తోంది. ఇంతకాలం తమకు అంత బలం ఉంది.. ఇంత బలం ఉంది అంటూ బీరాలు పలికిన కింజరాపు కుటుంబం బలం గాలి బుడగేనని.. అదంతా బలుపు కాదు వాపేనని తేలిపోయింది. ఇచ్ఛాపురం అసెంబ్లీ సెగ్మెంట్ విషయంలో ఆ కుటుంబం చేసిన యాగీ.. వేసిన కుప్పిగంతులు ఆ గాలి బుడగను ఠప్..మని పేల్చేశాయి. ఒక్క సెగ్మెంట్‌ను బీజేపీకి ఇవ్వడంతోనే మొత్తం లోక్‌సభ నియోజకవర్గంలోనే తన, పార్టీ గెలుపు కష్టమవుతుందని చెప్పడం ద్వారా జిల్లాలో కట్టుకున్న ఇమేజ్ అనే గాలిమేడను రామ్మోహన్ తనే కూల్చేసుకున్నారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కీలకమైన ఎన్నికల క్రీడలో కింజరాపు శిబిరం దాదాపు సెల్ఫ్ గోల్ చేసినంత పని చేసింది. తన చుట్టూ పరుచుకున్న రాజకీయ పరపతి బుడగను ఇచ్ఛాపురం అనే ఒక చిన్న అల్పిన్తో పేల్చేసుకుంది. బీజేపీతో కొట్లాడి మరీ తిరిగి తెచ్చుకున్న ఇచ్ఛాపురం సీటు కింజరాపు కుటుంబం రాజకీయ బలహీనతలను బహిర్గతం చేసింది. ఎంపీ అభ్యర్థి రామ్మోహన్‌ను బట్టే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయని ప్రగల్భాలు పలికిన కింజరాపు కుటుం బం అసలు బలాన్ని ఇచ్ఛాపురం ఉదంతం చెప్పకనే చెప్పింది. తామొక్కరమే ఎంపీ స్థానాన్ని గెలవలేమని వారే పరోక్షంగా అంగీకరించినట్లైంది. ఎమ్మెల్యే అభ్యర్థు ల ద్వారా కొన్ని ఓట్లు సాధించుకోవాలన్న తాపత్రయం కనిపించింది.
అందుకే నానా రాద్ధాంతం చేసి, బీజేపీ అగ్రనేతలను బతిమాలి మరీ బీజేపీకి ఇచ్చిన ఇచ్ఛాపురం సీటు తిరిగి లాక్కున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. దాంతో ఇంతకాలం ఎవర్ని చూసి ప్రజలు పార్టీకి ఓట్లేస్తారని ధీమా గా ఉన్నామో.. అ రామ్మోహన్నాయుడు రాజకీయంగా ఇంత బలహీనుడా.. అని టీడీపీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇచ్ఛాపురం సీటు తమకు తిరిగి దక్కిందన్న ఆనందం కంటే నియోజకవర్గంలో బెందాళం అశోక్‌కు వెన్నాడుతున్న వర్గపోరు, ఎన్నికల ముందే పార్టీ బలహీనతలు బయటపడటం ఆ పార్టీ శ్రేణులను కలవరపరుస్తోంది.
అది గాలి బుడగే!
శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఎంతో బలంగా ఉన్నామని ఇన్నాళ్లు డాంభికాలు పలికిన కింజరాపు కుటుం బం అసలు బండారం బయటపడింది. తన లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఒక అసెంబ్లీ సీటు బీజేపీకి ఇచ్చినా ఎంపీ సీటు కూడా ఓడిపోతామని రామ్మోహన్నాయుడు స్పష్టంగా చెప్పారు. అందుకే ముందు నరసన్నపేటను తరువాత ఇచ్ఛాపురం నియోజకవర్గాన్నీ బీజేపీకి కేటాయించడాన్ని వ్యతిరేకించారు. ఆ విధంగా ఎంపీ అభ్యర్థిగా తాను బలహీనంగా ఉన్నానని చెప్పకనే చెప్పారు. పైకి ఎంత గాంభీర్యంగా ఉన్నప్పటికీ శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిస్థితులు టీడీపీకి ఏమాత్రం అనుకూలంగా లేవనేది సుస్పష్టం. ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల ఓటింగ్ సరళి తో ఇది స్పష్టమైంది.
నరసన్నపేట, పాతపట్నం నియోజకవర్గాల్లో టీడీపీ ఉనికి దాదాపుగా ప్రశ్నార్థకంగా మారింది. థర్మల్ ప్లాంట్ వ్యతిరేక ఉద్యమాలు, సామాజికవర్గ సమీకరణాలు ప్రతికూలంగా ఉండటంతో టెక్కలి, ఇచ్ఛాపురంలలో పూర్తిగా బలహీనపడింది. ఆమదాలవలస, శ్రీకాకుళం స్థానా ల్లో నియోజకవర్గస్థాయి నాయకత్వలోపం వేధిస్తోంది. ప్రధానంగా నియోజకవర్గవ్యాప్తంగా ఎన్నికల మంత్రాంగం నెరపగల సామర్థ్యం లేకపోవడం టీడీపీకి ప్రధాన ప్రతికూల అం శంగా మారింది. ఈ పరిస్థితుల్లో లోక్‌సభ నియోజకవర్గస్థాయిలో రామ్మోహన్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీకి ఒక సీటు కేటాయిస్తే ఎన్నికలకు ముందే ఓటమి ఖాయమైపోతుందని.. ముందే కాడి వదిలేయాల్సి వస్తుందని కింజరాపు కుటుంబం గుర్తించింది. అందుకే కనీసం ఎన్నికల వరకైనా రేసులో ఉండాలంటే బీజేపీకి సీటు ఇవ్వకుండా అడ్డుకోవాలని భావించింది. తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి మరీ సీటును టీడీపీకే కేటాయించేలా చేసింది.
ఇచ్ఛాపురంలో వర్గ విభేదాలు బట్టబయలు
మరోవైపు బీజేపీ వ్యవహారంతో ఇచ్ఛాపురం నియోజకవర్గంలో వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. బెందాళం అశోక్‌కు ఓ వర్గమే మద్దతివ్వగా మరో వర్గం దూరంగా ఉండిపోవడం టీడీపీని కలవరపరుస్తోంది. ఆయనకే టిక్కెట్టు కేటాయించాలని కవిటి మండలానికి చెందిన నేతలే గళం విప్ప డం గమనార్హం. ఇతర మండలాలకు చెందిన నేతలెవరూ పట్టించుకోలేదు. ఇచ్ఛాఫురం పట్టణ పార్టీ అధ్యక్షుడు, ఇతర ముఖ్యులు కూడా ఆయనకు అనుకూలంగా స్పందించలేదు. అదే విధంగా కంచిలి, సోంపేట మండలాల నుంచి ఆయనకు మద్దతు లభించలేదనే విషయాన్ని టీడీపీ ఇప్పుడిప్పుడే గుర్తిస్తోంది. అంటే అశోక్ నాయకత్వానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఆమోదముద్ర లేదని తేటతెల్లమవుతోంది. ఇటీవలి మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో ఆయన నియోజకవర్గవ్యాప్తంగా పార్టీని నడిపించలేకపోయారు. మరోవైపు నియోజకవర్గంలోని ప్రధాన సామాజికవర్గాలు ఆయన నాయకత్వం పట్ల సానుకూలంగా లేరన్నది స్పష్టమవుతోంది.
ఆజ్యం పోస్తున్న శివాజీ
మరోవైపు సీనియర్ నేత గౌతు శివాజీ ఇచ్ఛాపురంలో బెందా ళం పక్కలో బల్లెంలా మారారు. కింజరాపు కుటుంబానికి సన్నిహితుడిగా ఉన్నందున ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు. నియోజకవర్గంలోని తన సొంత మండలం సోంపేట కేం ద్రంగా బెందాళం వ్యతిరేకవర్గాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇచ్ఛాపురం బీజేపీకి ఇవ్వడంపై ఆయన సానుకూలంగా స్పందించారు. బీజేపీ తరపున పోటీచేయాలని భావించిన వడిశ బాలకృష్ణకు సోంపేట మండలంలోని శివాజీ వర్గమం తా మద్దతు కూడా ప్రకటించింది. కానీ చివరి నిముషంలో మళ్లీ టీడీపీకే సీటు దక్కడం... బెందాళం అశోకే అభ్యర్థికావడంతో శివాజీ వర్గం మళ్లీ అసమ్మతి జెండా భుజానికెత్తుకోనుంది.