అసమ్మతే గర్జించింది! | bead dissent in TDP | Sakshi
Sakshi News home page

అసమ్మతే గర్జించింది!

Published Fri, Mar 28 2014 3:24 AM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM

అసమ్మతే గర్జించింది! - Sakshi

అసమ్మతే గర్జించింది!

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా టీడీపీలోని అసమ్మతి సెగ అధినేత చంద్రబాబునే తాకింది. జావగారిపోతున్న పార్టీకి జవసత్వాలు అందించేందుకు శ్రీకాకుళంలో నిర్వహించిన ప్రజాగర్జనలో అసమ్మతి ధ్వజమెత్తింది. ప్రజాగర్జన సభ అనంతరం బుధవారం అర్ధరాత్రి చంద్రబాబు జిల్లా టీడీపీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు దిశానిర్దేశం చేసేందుకు ఉద్దేశించిన ఈ సమావేశంలో టీడీపీ తమ్ముళ్లు చంద్రబాబుకు చుక్కలు చూపించారు.
 
మాజీ మంత్రి గౌతు శివాజీ కింజరాపు కుటుంబ పెత్తనంపై నిప్పులు చెరిగారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మరోవైపు తమ అభీష్టంతో పని లేకుండా శత్రుచర్లను పార్టీలో చేర్చుకోవడంపై అచ్చెన్న తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ పరిణామాలతో కంగుతిన్న చంద్రబాబు సమావేశాన్ని కేవలం అరగంటలోనే ముగించేశారు.
 
అంతా కింజరాపు ఇష్టమేనా?
సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రైవేటు హోటల్ వద్దకు చంద్రబాబు చేరుకోవడానికి ముందే మాజీ మంత్రి గౌతు శివాజీ ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రజాగర్జన ప్రాంగణం వద్దకు వెళ్లకుండా తన వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడాన్ని ఆయన ప్రశ్నించారు.  సభకు వస్తున్న నేతలకు జిల్లా పార్టీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ స్వాగతం చెప్పకపోవడాన్ని తప్పుబట్టారు.
 
‘నీకు కింజరాపు కుటుంబం ఉంటే చాలా?.. మేమెవరం వద్దా?.. అచ్చెన్నాయుడు, రామ్మోహన్, నువ్వూ వేదిక ఎక్కిపోతే చాలా?.. పార్టీ అంటేనే మీరేనా?.. మీరే ఎన్నికలు చేసుకోండి.. మేమెందుకు?.. ఎలా గెలుస్తారో చూస్తాం’ అని ఆగ్రహంతో ఊగిపోయారు. శివాజీని సముదాయించడానికి పార్టీ నేతలు ఎంతగా ప్రయత్నించినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఈ సమావేశమే కాదు జిల్లా పార్టీ నిర్వహణ అంతా కింజరాపు కుటుంబం ఇష్టప్రకారమే చేస్తున్నారని విమర్శించారు.

‘నా(పలాస) నియోజకవర్గంలో కూడా అచ్చెన్నాయుడు, రామ్మోహన్ ఇష్టానుసారం జోక్యం చేసుకుంటున్నారు. నాకు వ్యతిరేకంగా ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారు.జిల్లా పార్టీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ వారికి వంత పాడుతున్నారు. ఇలా అయితే ఎన్నికల్లో నేను చేయాల్సింది చేస్తాను’ అని కుండబద్దలు కొట్టారు. సౌమ్యుడిగా పేరుపొందిన శివాజీ ఇంత ఆగ్రహంతో రగలిపోవడంతో టీడీపీ కార్యకర్తలు హడలిపోయారు. దీంతో హోటల్ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
 
సీనియర్ల కినుక
ప్రజాగర్జన సభ సందర్భంగా చంద్రబాబు తమను కనీసం పట్టించుకోకపోవడంపై సీనియర్లు కినుక వహించారు. చంద్రబాబు తన ప్రసంగంలో రామ్మోహన్ పేరును మాత్రమే ఒకటికి రెండుసార్లు ప్రస్తావించారు. 30 ఏళ్లుగా పార్టీలో ఉంటూ మంత్రులుగా చేసిన కళా వెంకట్రావు, ప్రతిభా భారతి, గౌతు శివాజీ తదితరులను ఏమాత్రం పట్టించుకోలేదు.అసలు వారు పార్టీలో ఉన్నారన్నట్లుగానే గుర్తించ లేదు. దాంతో ఆ ముగ్గురు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అధికారంలో ఉన్నన్నాళ్లూ ఇదే తీరుగా వ్యవహరించడంతోనే జిల్లాలో పార్టీ తుడుచుకుపెట్టుకుపోయిందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికీ చంద్రాబాబు తీరు మారకపోవడం పట్ల వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
 
 ‘శత్రుచర్ల’ను ఎలా చేర్చుకుంటారు?
ఇక చంద్రబాబుపై కింజరాపు కుటుంబం నుంచి కూడా అసమ్మతి వెల్లువెత్తింది.  తాము ఎంత వద్దని చెబుతున్నా మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజును పార్టీలో చేర్చుకోవడం పట్ల అచ్చెన్నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాగర్జన వేదికపైనే ఆయన చంద్రబాబుతో ఈ విషయంపై కాస్త కటువుగా మాట్లాడారు. అనంతరం సమీక్ష సమావేశంలో కూడా నిలదీయాలని భావించారు. చంద్రబాబు సమీక్ష సమావేశానికి రావడానికి ముందు అచ్చెన్న పార్టీ నేతలతో మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. శత్రుచర్లను చేర్చుకోవడం వల్ల పాతపట్నం నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న కాపు సామాజికవర్గాన్ని పార్టీ దూరం చేసుకుందన్నారు.
 
ఇంత చేసి పార్టీలో చేర్చుకున్న శత్రుచర్ల సమీక్ష సమావేశానికి గైర్హాజరు కావడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. పార్టీ కోసం ఓపిగ్గా కూర్చోలేని నేతలను చేర్చుకుని ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. దీనిపై సమీక్ష సమావేశంలో నిలదీస్తానన్నారు.  ఈ విషయాన్ని కొందరు చంద్రబాబుకు చేరవేశారు. దాంతో పరిస్థితి చేయిదాటుతోందని గ్రహించిన ఆయన సమావేశాన్ని తూతూ మంత్రంగా ముగించారు.
 
కేవలం కళా వెంకట్రావు, రామ్మోహన్ నాయుడు, గుండ లక్ష్మీదేవిలతోనే మాట్లాడించారు. తాను మాట్లాడతానని అచ్చెన్నాయుడు అడుగుతున్నా వినిపించుకోకుండా సమావేశాన్ని ముగించేశారు. ఈ పరిణామాలు జిల్లా టీడీపీలో భగ్గుమంటున్న అసమ్మతికి దర్పణం పడుతున్నాయి. మునుముందు పరిస్థితి మరింత తీవ్రమవుతుందన్న దానికి సంకేతంగా నిలుస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement