
బోర్ బాబూ.. బోర్!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పార్టీకి ప్రజాదరణ పెద్దగా లేదు.. అధినేతకు ప్రజాకర్షక ఇమేజ్ అంతకంటే లేదు. కానీ లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్లు.. కనికట్టు చేయాలి. ఓటర్లను మాయ చేసి మభ్య పెట్టి.. ఓట్లు దండుకోవాలి. అదిగో.. ఆ ప్రయత్నమే శ్రీకాకుళంలో బుధవారం జరిగిన ప్రజగర్జనలో శ్రుతి మించింది.
చంద్రబాబుకు ప్రజాకర్షణ ముసుగు తొడిగే యత్నం కాస్త బెడిసికొట్టి.. ఎబ్బెట్టుగా కనిపించింది. విసుగెత్తించే ఆటపాటలు.. ఏమాత్రం ఆసక్తి రేపని బాబు ప్రసంగం వేదికపై ఉన్న వారిని నిస్పృహకు గురి చేయగా.. వేదిక ముందున్న జనం వెనుక భాగం నుంచి చల్లగా జారుకునేలా చేశాయి.
పాటలతో పాట్లు.. ఫీట్లు
చంద్రబాబుకు ప్రజాకర్షణ శక్తి లేదని టీడీపీ ఎట్టకేలకు గుర్తించింది. ఎన్నికల వేళ ఆయనకు ప్రజాకర్షణ ముసుగు తొడిగేందుకు సినీఫక్కీలో విఫలయత్నం చేసింది. ప్రజగర్జన సభ ప్రారంభానికి ముందు కళా బృందాలతో సాంసృ్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
చంద్రబాబు వచ్చిన తర్వాతే ఆ బృందాల ఏర్పాటు వెనుక అసలు విషయం తెలిసింది. ఆయన సభావేదికకు చేరుకోవడానికి ముందు పార్టీ నేత గద్దె బాబూరావు అసలు డెరైక్షన్ మొదలు పెట్టారు. ‘బాబుగారి ప్రసంగానికి ముందు ఓ పాట వినిపిస్తాం.. ఆ పాట వస్తున్నంత సేపు ఆయన ఓ జెండా పట్టుకుని గాలిలో ఊపుతారు. మీరు కూడా అలాగే చేయండి’ అని సభికులను కోరారు.
అన్నట్లుగానే పాట వేసి.. బాబు చేతికి పార్టీ జెండా ఇచ్చి గాలిలో ఊపమన్నారు. ఆయన ఆ జెండాతో కాసేపు పాట్లు పడుతుండగా.. వేదికపై ఉన్న తమ్ముళ్లు ఆయన పక్కన చేరారు. లేని ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకొని చప్పట్లు కొడుతూ సన్నివేశాన్ని రక్తి కట్టించడానికి పడరానిపాట్లు పడ్డారు.తొమ్మిదేళ్లు సీఎంగా చేసిన ఓ నేతకు లేని ఇమేజ్ కల్పిండానికి చేసిన ఈ ప్రయత్నం ఆయన స్థాయికి తగ్గట్లుగా లేదన్న విమర్శలు వినిపించాయి. ఇదంతా డ్యాన్సు ట్రూప్ ప్రదర్శనలా సాగిందనే వ్యాఖ్యానాలు వినిపించాయి.
నిరాసక్తంగా ప్రసంగం
ఇక చంద్రబాబు ఎప్పటిమాదిరిగానే నిరాసక్తమైన ప్రసంగంతో టీడీపీ తమ్ముళ్లకు బోర్ కొట్టించారు. ఏం చెప్పదలచుకున్నారన్న స్పష్టత లేకుండా ఎక్కడెక్కడికో వెళ్లిపోయారు. దేనిపైనా సాధికారికంగా మాట్లాడలేకపోయారు. ఒక అంశం నుంచి మరో అంశంలోకి మారినప్పుడు ముందు విషయం మరచిపోయినట్లు ప్రవర్తించడంతో సమన్వయం కుదరక ప్రసంగం అతుకుల బొంతలా సాగింది.
కాంగ్రెస్ నేతలను చేర్చుకోవడంపై పార్టీ నేతల్లో రేగిన అసంతృప్తిని చల్లార్చేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. పార్టీ బలంగా లేనందునే కాంగ్రెస్ నేతలను చేర్చుకుంటున్నామని ఆయనే అంగీకరించడం గమనార్హం. ఇక సభకు భారీగా డబ్బు వెదజల్లి మరీ జనసమీకరణ చేసిన నేతలకు చంద్రబాబు దెబ్బకొట్టారనే చెప్పాలి.
నిర్వాహకులు తరలించిన జనం చంద్రబాబు ప్రసంగం ప్రారంభించగానే సభాప్రాంగణం నుంచి జారుకోవడం ప్రారంభించారు. దాదాపు గంటకుపైగా సాగిన ఆయన ప్రసంగంలో ఏమాత్రం కొత్తదనం, స్పష్టత లేకపోవడంతో అందరూ నిరుత్సాహపడ్డారు. వేదిక మీద ఉన్న నేతలు కూడా చంద్రబాబు నిరాసక్తమైన ప్రసంగంతో విసుగుచెందినట్లు కనిపించారు.
ఆయన ప్రసంగిస్తుంటే వారు సహచర నేతలతో మాట్లాడుకోవడం కనిపించింది.ఇక సభాప్రాంగణంలో ఉన్న ప్రజలు మాత్రం బాబు ప్రసంగం ధాటికి తట్టుకోలేక మధ్యలోనే ఇంటిదారి పట్టారు. వెరసి హైదరాబాద్ నుంచి వచ్చిన పార్టీ ప్రత్యేక ప్రతినిధుల కనుసన్నల్లో భారీగా డబ్బు వెదజల్లి టీడీపీ నిర్వహించిన ప్రజాగర్జన ప్రతిధ్వనించలేదనే చెప్పాలి.