prajagarjana sabha
-
మోదీ మార్క్ శంఖారావం!
(మహబూబ్‌నగర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో పాలమూరులో ప్రధాని నరేంద్ర మోదీ తనదైన శైలిలో బీజేపీ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. అటు అధికారిక కార్యక్రమాలతో అభివృద్ధి మంత్రం పఠిస్తూనే.. ఇటు బహిరంగ సభ వేదికగా బీఆర్ఎస్పై విమర్శలతో రాజకీయ ప్రసంగం చేసి.. ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. చాలాకాలం నుంచి ఉన్న డిమాండ్లను తీరుస్తూ పసుపుబోర్డు, గిరిజన వర్సిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం ద్వారా.. తెలంగాణకు బీజేపీ మేలు చేస్తోంది అన్నట్టుగా సంకేతాలు పంపారు. తెలంగాణప్రజలు మార్పు కోరుకుంటున్నారంటూనే.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించాలని, తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు తీరుస్తామని చెప్పారు. మహిళా బిల్లును ఆమోదించడం, హైవేల నిర్మాణంతో ప్రయోజనాలు, కేంద్ర ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పడం ద్వారా ఆయా వర్గాలకు మేలు చేస్తున్నట్టుగా వివరించే ప్రయత్నం చేశారు. సభ సాంతం.. మోదీ నామస్మరణతో.. అధికారిక కార్యక్రమం, ఊరేగింపు, సభా వేదికపై ప్రసంగం సమయంలో సభా ప్రాంగణమంతా మో దీ.. మోదీ.. అంటూ నినాదాలతో హోరెత్తిపోయింది. అభిమానులు, పార్టీ కార్యకర్తలు అరుపులు, కేకలతోపాటు చప్పట్లు కొడుతూ కనిపించారు. ఇది చూసిన మోదీ.. ‘మీ ప్రేమాభిమానాలు, ఆదరణకు నేను ధన్యుడిని అయ్యాను. ఇంత ప్రేమను చూసి ముగ్దుడిని అయ్యాను. మీరు, మేము కలసి తెలంగాణను అభివృద్ధిపథంలోకి తీసుకెళదాం. ఈ సభ విజయవంతం కావడం, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని మద్దతు తెలపడాన్ని వరుణదేవుడు కూడా హర్షాన్ని వెలిబుచ్చి వర్షాన్ని కురిపించాడు. (ప్రసంగం సాగుతున్నపుడు వర్షం పడుతుండటాన్ని ప్రస్తావిస్తూ..). తెలంగాణ ప్రజలను కలసిన నా జీవితం ధన్యమైంది..’’అని పేర్కొన్నారు. సభలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగిస్తూ.. గిరిజన వర్సిటీ, పసుపు బోర్డు ప్రకటన నేపథ్యంలో అంతా లేచి మోదీకి గౌరవసూచకంగా చప్పట్లు కొట్టాలని కోరారు. దీనితో వేదికపై ఆసీనులైన నేతలు, సభికులు లేచి ‘మోదీ నాయకత్వం వరి్ధల్లాలి’అంటూ నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా మోదీ రెండు చేతులు జోడించి, వంగి సభికులకు సమస్కారం చేశారు. సభలో ప్రసంగిస్తున్న సమయంలో ఓ చిన్నారి జోష్ చూసి మోదీ సంతోషం వ్యక్తం చేశారు. చి న్నారికి తన ఆశీస్సులు అందిస్తున్నట్టు చెప్పారు. పది నిమిషాల్లో మనసు విప్పుతా..! తొలుత అధికారిక కార్యక్రమ వేదికపై సుమారు 12 నిమిషాలు ప్రసంగించిన మోదీ అభివృద్ధి అంశాలనే ప్రస్తావించారు. చివరిలో మాత్రం.. ‘‘ఇప్పుడు అధికారిక కార్యక్రమంలో ఉన్నాను. కొన్ని అంశాలపై నన్ను నేను నియంత్రించుకున్నాను. ఓ పది నిమిషాల్లో మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటున్నా.. అక్కడ మనసు విప్పి మాట్లాడుతా.. నేను మీకు మాటిస్తున్నా.. నేను ఏం మాట్లాడినా తెలంగాణ ప్రజల గుండెచప్పుడుగా మాట్లాడుతా..’’అని పేర్కొనడం గమనార్హం. ఓపెన్ టాప్ జీప్‌లో ఊరేగిస్తూ.. పూలు చల్లుతూ.. తొలుత ఒక వేదికపై అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి మాట్లాడిన ప్రధాని మోదీ.. తర్వాత కాస్త దూరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు ఓపెన్ టాప్ జీపులో వెళ్లారు. బంజారా మహిళల నృత్యాలతో, పూలు చల్లుతూ బీజేపీ కార్యకర్తలు, ప్రజలు మోదీకి ఆవ్వనం పలికారు. ఈ సమయంలో ఓ యువతి మోదీ చిత్రపటాన్ని ఆయనకు అందజేయగా.. మోదీ దానిని తీసుకుని, తన ఆటోగ్రాఫ్ చేసి తిరిగి ఆ యువతికి అందించారు. సభా వేదికపైకి చేరుకునే వరకు మోదీ రెండు చేతులతో విజయ సంకేతాలు (వీ చిహ్నాలు) చూపుతూ, అభివాదం చేస్తూ సాగారు. ఓపెన్ టాప్ జీప్‌లో ఊరేగిస్తూ.. పూలు చల్లుతూ.. తొలుత ఒక వేదికపై అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి మాట్లాడిన ప్రధాని మోదీ.. తర్వాత కాస్త దూరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక వద్దకు ఓపెన్ టాప్ జీపులో వెళ్లారు. బంజారా మహిళల నృత్యాలతో, పూలు చల్లుతూ బీజేపీ కార్యకర్తలు, ప్రజలు మోదీకి ఆవ్వనం పలికారు. ఈ సమయంలో ఓ యువతి మోదీ చిత్రపటాన్ని ఆయనకు అందజేయగా.. మోదీ దానిని తీసుకుని, తన ఆటోగ్రాఫ్ చేసి తిరిగి ఆ యువతికి అందించారు. సభా వేదికపైకి చేరుకునే వరకు మోదీ రెండు చేతులతో విజయ సంకేతాలు (వీ చిహ్నాలు) చూపుతూ, అభివాదం చేస్తూ సాగారు. -
కరప్షన్, కమీషన్ వారి సిద్దాంతాలు.. పాలమూరులో మోదీ ఫైర్
సాక్షి, పాలమూరు: తెలంగాణ బీజేపీ పాలమూరులో ప్రజా గర్జన సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ, పాలమూరు ప్రజలను ఉద్దేశించి ప్రసగించారు. పాలమూరు ప్రజలందరికీ నమస్కారములు, మరోసారి నా కుటుంబ సభ్యులారా అంటూ ప్రధాని మోదీ ప్రసంగాన్ని ప్రారంభించారు. పాలమూరు సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రభుత్వం కారు స్టీరింగ్ ఎవరి చేతిలో ఉందో మీకు తెలుసు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో అందరికీ తెలుసు. తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయి. కరప్షన్, కమీషన్ ఈ రెండు పార్టీల సిద్ధాంతం. కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఈరోజు రాత్రి నిద్రపట్టదు. ఈ ప్రజాస్వామ వ్యవస్థను కుటుంబవ్యవస్థగా మార్చేశారు. పెద్ద పోస్టుల్లో కుటుంబ సభ్యులుంటారు.. తమ అవసరాల కోసమే కొందరు బయటి వ్యక్తులు ఉంటారు. పార్టీ అధ్యక్షుడి నుంచి అన్ని పదవుల్లోనూ కుటుంబ సభ్యులే ఉంటారు. తెలంగాణలో రోజురోజుకు బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోంది. మోదీ హామీ ఇస్తే నెరవేరుతుందనే నమ్మకం తెలంగాణ ప్రజల్లో ఉంది. కలిసికట్టుగా తెలంగాణను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్దాం. బీజేపీ మాత్రం సామాన్యుల కోసం ఆలోచిస్తుంది. తెలంగాణకు బీజేపీ ప్రభుత్వం కావాలి.. పాలమూరు ప్రజలకు అభివాదం చేస్తున్నాను. ఇవాళ స్వచ్చతా కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. నేడు తెలంగాణలో రూ.13,500 కోట్ల విలువైన పనులను ప్రారంభించుకున్నాం. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాను. తెలంగాణ రాష్ట్రం బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటోంది. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. చెప్పింది చేసే ప్రభుత్వమే తెలంగాణకు కావాలి. తెలంగాణ అవినీతి రహిత పాలన కావాలి. పారదర్శక ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. నాలుగేళ్ల కాలంలో ప్రజలు బీజేపీని బలోపేతం చేశారు. అబద్ధాలు, వాగ్ధానాలు కాదు.. క్షేత్రస్థాయిలో పనులు తెలంగాణకు కావాలి. రాష్ట్ర ప్రజల బ్రతుకులు బాగుపడేందుకు బీజేపీ కట్టుబడి ఉంది. తెలంగాణకు ఎంతో చేశాం.. తెలంగాణకు 9 ఏళ్లలో లక్ష కోట్ల నిధులిచ్చాం. 2014కు ముందు కేవలం 2,500 కి.మీ నేషనల్ హైవేలున్నాయి. మా ప్రభుత్వం వచ్చాక తెలంగాణలో తొమ్మిదేళ్లలో 2,500 కి.మీల జాతీయ రహదారులు నిర్మించాం. పేదలకు గ్యాస్, ఇళ్లు ఉచితంగా ఇస్తున్నాం. ప్రతీ గ్రామం, పల్లు నుంచి పట్టణాలకు వచ్చేందుకు రోడ్లు వేశాం. 2014కు ముందు కాంగ్రెస్ హయాంలో రూ.3400 కోట్లతో ధాన్యాన్ని కొనుగోలు చేశాం. రైతుల పథకాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం దోచుకుంటోంది. సాగునీటి కాలువల పేరుతో తెలంగాణ ప్రభుత్వం గొప్పలకు పోతోంది. కానీ.. ఆ కాలువల్లో అసలు నీరు ఉండదు. కేసీఆర్ సర్కార్‌పై ఫైర్.. తెలంగాణ ప్రభుత్వం రైతులను మభ్యపెడుతోంది. అన్నదాతను మేము ఎప్పుడూ గౌరవిస్తాం. రైతుల కష్టానికి తగిన ప్రతిఫలం అందిస్తున్నాం. రైతుల కోసం రామగుండ ఫెర్టిలైజర్ ఫ్యాక్టరీని తెరిపించాం. రుణమాఫీ పేరుతలో తెలంగాణ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు. పసుపు రైతుల సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉంది. పసుపు బోర్డు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. పసుపు బోర్డుతో ఎంతో మేలు జరుగుతుంది. పసుపు ఎగుమతి గతంలో పోలిస్తే రెట్టింపు అయ్యింది. తెలంగాణలో మా ప్రభుత్వం లేకపోయినా.. ఇక్కడి రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. రాణిరుద్రమ దేవి వంటి ధీరవనితలు పుట్టిన గడ్డ తెలంగాణ. చారిత్రాత్మక మహిళా బిల్లును ఆమోదించుకున్నాం. దేశాభివృద్ధికి మహిళా శక్తి కావాలి. మహిళా శక్తికి నా హృదయపూర్వక అభినందనలు. ఢిల్లీలో ఓ సోదరుడు ఉన్నాడనే నమ్మకాన్ని తెలంగాణ సోదరీమణులకు కల్పించేందుకు ప్రయత్నం. మహిళల జీవితాన్ని మెరుగుపర్చేందుకు ఎన్నో చర్యలు చేపట్టాం’ అని కామెంట్స్ చేశారు. -
ఫాసిస్ట్ పాలన తెచ్చేందుకు బీజేపీ పావులు కదుపుతోంది
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్)/గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): దేశాన్ని మతాల పరంగా విడదీసి ఫాసిస్ట్ పాలన తెచ్చేందుకు బీజేపీ ప్రభుత్వం పావులు కదుపుతోందని, ఈ ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు దేశ ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ముని మనుమడు డాక్టర్ రాజారత్నం అశోక్ అంబేడ్కర్ పిలుపునిచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్‌ఆర్‌పీలను వ్యతిరేకిస్తూ విజయవాడ మాకినేని బసవపున్నయ్య మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం ప్రజా గర్జన సభ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అశోక్ అంబేడ్కర్ మాట్లాడుతూ.. మోదీ, అమిత్‌షా తాతలు దిగొచ్చినా సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్ఆర్పీ బిల్లులను ప్రవేశపెట్టలేరన్నారు. సిటిజన్‌షిప్ కోసం ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్లేవీ చెల్లవని చెబుతున్న ప్రభుత్వం 2019 ఎన్నికల్లో ఓటర్ కార్డు లేకపోయినా ఆయా కార్డులతో ఓటు వేయొచ్చని ఎలా చెప్పిందని ప్రశ్నించారు. ఆ కార్డులు చెల్లకపోతే వాటితో ఎన్నికైన మీరెలా చెల్లుతారని ప్రశ్నించారు. ప్రముఖ సనాతన ధర్మబోధకులు స్వామి అగ్నివేష్ మాట్లాడుతూ.. వందల ఏళ్లుగా మన దేశంలో లౌకికతత్వమనే సంస్కృతి పరిఢవిల్లుతోందని, బీజేపీ ప్రభుత్వం ఆ సంస్కృతిని ధ్వంసం చేసి విద్వేషాలు, రక్తపాతాలు సృష్టించేందుకు కుట్రపన్నుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత రెహ్మాన్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి, టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జమాత్ ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ రఫీఖ్, సీపీఎం, సీపీఐ నేతలు మధు, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్ పాలనపై ప్రశంసలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనపై డాక్టర్ రాజారత్నం అశోక్ అంబేడ్కర్ ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో అంబేడ్కర్ ఆశయాల సాధన దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. విజయవాడ గాంధీనగర్‌లో సమతా సైనిక్‌దళ్ రాష్ట్ర కార్యాలయాన్ని శుక్రవారం అశోక్ అంబేడ్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం, మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నామన్నారు. ఇంగ్లిష్ అంతర్జాతీయ భాష అని, మనం అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే ఇంగ్లిష్ ఎంతో అవసరమన్నారు. రాష్ట్రంలో బుద్ధిస్ట్ సొసైటీకి భూమిని కేటాయిస్తే ప్రపంచ స్థాయి బుద్ధిస్ట్ యూనివర్సిటీని నెలకొల్పుతామని అశోక్ అంబేడ్కర్ చెప్పారు. ప్రపంచ శ్రేణి వర్సిటీల సహకారంతో సొంత నిధులతో వర్సిటీని నిర్మిస్తామని తెలిపారు. వర్సిటీ ఏర్పాటుకు 25 ఎకరాలు అవసరమని, దీన్ని సొసైటీకి కేటాయించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. -
టీఆర్ఎస్ పతనం ఆరంభం
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజం గరిడేపల్లి: రాష్ట్రంలో టీఆర్ఎస్ పతనం ఆరంభమైందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గరిడేపల్లి ప్రజాగర్జన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తోందని చెప్పారు. కమీషన్లకు కక్కుర్తిపడి మిషన్ భగీరథ, కాకతీయ పథకాలు చేపడుతున్నారని ధ్వజమెత్తారు. వచ్చే ఖరీఫ్ నుంచి ఎకరానికి నాలుగు వేల రూపాయలు అందిస్తామని చెబుతున్న కేసీఆర్‌కు ఇన్నాళ్లుగా రైతులపై ఈ ప్రేమ ఎటుపోయిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో 3 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలేదన్నారు. ఏఐసీసీ అధినేత సోనియా దయతో ఏర్పడిన తెలంగాణను తన కుటుంబ స్వార్థం కోసం వాడుకుంటున్న కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలే గుణపాఠం చెప్పాలన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీ , సమభావన సంఘాలకు ఎన్ని లక్షలకైనా వడ్డీ లేని రుణాలు, నిరుద్యోగులకు నెలకు రూ. 3వేల నిరుద్యోగ భృతి, లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వెంటనే చేస్తామని హామీ ఇచ్చారు. సాగర్ ఎడమ కాల్వను ఎండబెట్టిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. రూ. 500 కోట్లతో హైదరాబాద్‌లో ఇల్లు నిర్మించుకున్న కేసీఆర్.. పేదలకు ఇందిరమ్మ బిల్లులు కూడా చెల్లించలేని దౌర్భాగ్యస్థితిలో ఉన్నాడన్నారు. -
అసమ్మతే గర్జించింది!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లా టీడీపీలోని అసమ్మతి సెగ అధినేత చంద్రబాబునే తాకింది. జావగారిపోతున్న పార్టీకి జవసత్వాలు అందించేందుకు శ్రీకాకుళంలో నిర్వహించిన ప్రజాగర్జనలో అసమ్మతి ధ్వజమెత్తింది. ప్రజాగర్జన సభ అనంతరం బుధవారం అర్ధరాత్రి చంద్రబాబు జిల్లా టీడీపీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు దిశానిర్దేశం చేసేందుకు ఉద్దేశించిన ఈ సమావేశంలో టీడీపీ తమ్ముళ్లు చంద్రబాబుకు చుక్కలు చూపించారు. మాజీ మంత్రి గౌతు శివాజీ కింజరాపు కుటుంబ పెత్తనంపై నిప్పులు చెరిగారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మరోవైపు తమ అభీష్టంతో పని లేకుండా శత్రుచర్లను పార్టీలో చేర్చుకోవడంపై అచ్చెన్న తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ పరిణామాలతో కంగుతిన్న చంద్రబాబు సమావేశాన్ని కేవలం అరగంటలోనే ముగించేశారు. అంతా కింజరాపు ఇష్టమేనా? సమీక్ష సమావేశం నిర్వహించిన ప్రైవేటు హోటల్ వద్దకు చంద్రబాబు చేరుకోవడానికి ముందే మాజీ మంత్రి గౌతు శివాజీ ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రజాగర్జన ప్రాంగణం వద్దకు వెళ్లకుండా తన వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడాన్ని ఆయన ప్రశ్నించారు. సభకు వస్తున్న నేతలకు జిల్లా పార్టీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ స్వాగతం చెప్పకపోవడాన్ని తప్పుబట్టారు. ‘నీకు కింజరాపు కుటుంబం ఉంటే చాలా?.. మేమెవరం వద్దా?.. అచ్చెన్నాయుడు, రామ్మోహన్, నువ్వూ వేదిక ఎక్కిపోతే చాలా?.. పార్టీ అంటేనే మీరేనా?.. మీరే ఎన్నికలు చేసుకోండి.. మేమెందుకు?.. ఎలా గెలుస్తారో చూస్తాం’ అని ఆగ్రహంతో ఊగిపోయారు. శివాజీని సముదాయించడానికి పార్టీ నేతలు ఎంతగా ప్రయత్నించినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఈ సమావేశమే కాదు జిల్లా పార్టీ నిర్వహణ అంతా కింజరాపు కుటుంబం ఇష్టప్రకారమే చేస్తున్నారని విమర్శించారు. ‘నా(పలాస) నియోజకవర్గంలో కూడా అచ్చెన్నాయుడు, రామ్మోహన్ ఇష్టానుసారం జోక్యం చేసుకుంటున్నారు. నాకు వ్యతిరేకంగా ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారు.జిల్లా పార్టీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ వారికి వంత పాడుతున్నారు. ఇలా అయితే ఎన్నికల్లో నేను చేయాల్సింది చేస్తాను’ అని కుండబద్దలు కొట్టారు. సౌమ్యుడిగా పేరుపొందిన శివాజీ ఇంత ఆగ్రహంతో రగలిపోవడంతో టీడీపీ కార్యకర్తలు హడలిపోయారు. దీంతో హోటల్ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సీనియర్ల కినుక ప్రజాగర్జన సభ సందర్భంగా చంద్రబాబు తమను కనీసం పట్టించుకోకపోవడంపై సీనియర్లు కినుక వహించారు. చంద్రబాబు తన ప్రసంగంలో రామ్మోహన్ పేరును మాత్రమే ఒకటికి రెండుసార్లు ప్రస్తావించారు. 30 ఏళ్లుగా పార్టీలో ఉంటూ మంత్రులుగా చేసిన కళా వెంకట్రావు, ప్రతిభా భారతి, గౌతు శివాజీ తదితరులను ఏమాత్రం పట్టించుకోలేదు.అసలు వారు పార్టీలో ఉన్నారన్నట్లుగానే గుర్తించ లేదు. దాంతో ఆ ముగ్గురు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అధికారంలో ఉన్నన్నాళ్లూ ఇదే తీరుగా వ్యవహరించడంతోనే జిల్లాలో పార్టీ తుడుచుకుపెట్టుకుపోయిందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికీ చంద్రాబాబు తీరు మారకపోవడం పట్ల వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘శత్రుచర్ల’ను ఎలా చేర్చుకుంటారు? ఇక చంద్రబాబుపై కింజరాపు కుటుంబం నుంచి కూడా అసమ్మతి వెల్లువెత్తింది. తాము ఎంత వద్దని చెబుతున్నా మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజును పార్టీలో చేర్చుకోవడం పట్ల అచ్చెన్నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాగర్జన వేదికపైనే ఆయన చంద్రబాబుతో ఈ విషయంపై కాస్త కటువుగా మాట్లాడారు. అనంతరం సమీక్ష సమావేశంలో కూడా నిలదీయాలని భావించారు. చంద్రబాబు సమీక్ష సమావేశానికి రావడానికి ముందు అచ్చెన్న పార్టీ నేతలతో మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. శత్రుచర్లను చేర్చుకోవడం వల్ల పాతపట్నం నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న కాపు సామాజికవర్గాన్ని పార్టీ దూరం చేసుకుందన్నారు. ఇంత చేసి పార్టీలో చేర్చుకున్న శత్రుచర్ల సమీక్ష సమావేశానికి గైర్హాజరు కావడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. పార్టీ కోసం ఓపిగ్గా కూర్చోలేని నేతలను చేర్చుకుని ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. దీనిపై సమీక్ష సమావేశంలో నిలదీస్తానన్నారు. ఈ విషయాన్ని కొందరు చంద్రబాబుకు చేరవేశారు. దాంతో పరిస్థితి చేయిదాటుతోందని గ్రహించిన ఆయన సమావేశాన్ని తూతూ మంత్రంగా ముగించారు. కేవలం కళా వెంకట్రావు, రామ్మోహన్ నాయుడు, గుండ లక్ష్మీదేవిలతోనే మాట్లాడించారు. తాను మాట్లాడతానని అచ్చెన్నాయుడు అడుగుతున్నా వినిపించుకోకుండా సమావేశాన్ని ముగించేశారు. ఈ పరిణామాలు జిల్లా టీడీపీలో భగ్గుమంటున్న అసమ్మతికి దర్పణం పడుతున్నాయి. మునుముందు పరిస్థితి మరింత తీవ్రమవుతుందన్న దానికి సంకేతంగా నిలుస్తున్నాయి. -
బోర్ బాబూ.. బోర్!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పార్టీకి ప్రజాదరణ పెద్దగా లేదు.. అధినేతకు ప్రజాకర్షక ఇమేజ్ అంతకంటే లేదు. కానీ లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్లు.. కనికట్టు చేయాలి. ఓటర్లను మాయ చేసి మభ్య పెట్టి.. ఓట్లు దండుకోవాలి. అదిగో.. ఆ ప్రయత్నమే శ్రీకాకుళంలో బుధవారం జరిగిన ప్రజగర్జనలో శ్రుతి మించింది. చంద్రబాబుకు ప్రజాకర్షణ ముసుగు తొడిగే యత్నం కాస్త బెడిసికొట్టి.. ఎబ్బెట్టుగా కనిపించింది. విసుగెత్తించే ఆటపాటలు.. ఏమాత్రం ఆసక్తి రేపని బాబు ప్రసంగం వేదికపై ఉన్న వారిని నిస్పృహకు గురి చేయగా.. వేదిక ముందున్న జనం వెనుక భాగం నుంచి చల్లగా జారుకునేలా చేశాయి. పాటలతో పాట్లు.. ఫీట్లు చంద్రబాబుకు ప్రజాకర్షణ శక్తి లేదని టీడీపీ ఎట్టకేలకు గుర్తించింది. ఎన్నికల వేళ ఆయనకు ప్రజాకర్షణ ముసుగు తొడిగేందుకు సినీఫక్కీలో విఫలయత్నం చేసింది. ప్రజగర్జన సభ ప్రారంభానికి ముందు కళా బృందాలతో సాంసృ్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు వచ్చిన తర్వాతే ఆ బృందాల ఏర్పాటు వెనుక అసలు విషయం తెలిసింది. ఆయన సభావేదికకు చేరుకోవడానికి ముందు పార్టీ నేత గద్దె బాబూరావు అసలు డెరైక్షన్ మొదలు పెట్టారు. ‘బాబుగారి ప్రసంగానికి ముందు ఓ పాట వినిపిస్తాం.. ఆ పాట వస్తున్నంత సేపు ఆయన ఓ జెండా పట్టుకుని గాలిలో ఊపుతారు. మీరు కూడా అలాగే చేయండి’ అని సభికులను కోరారు. అన్నట్లుగానే పాట వేసి.. బాబు చేతికి పార్టీ జెండా ఇచ్చి గాలిలో ఊపమన్నారు. ఆయన ఆ జెండాతో కాసేపు పాట్లు పడుతుండగా.. వేదికపై ఉన్న తమ్ముళ్లు ఆయన పక్కన చేరారు. లేని ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకొని చప్పట్లు కొడుతూ సన్నివేశాన్ని రక్తి కట్టించడానికి పడరానిపాట్లు పడ్డారు.తొమ్మిదేళ్లు సీఎంగా చేసిన ఓ నేతకు లేని ఇమేజ్ కల్పిండానికి చేసిన ఈ ప్రయత్నం ఆయన స్థాయికి తగ్గట్లుగా లేదన్న విమర్శలు వినిపించాయి. ఇదంతా డ్యాన్సు ట్రూప్ ప్రదర్శనలా సాగిందనే వ్యాఖ్యానాలు వినిపించాయి. నిరాసక్తంగా ప్రసంగం ఇక చంద్రబాబు ఎప్పటిమాదిరిగానే నిరాసక్తమైన ప్రసంగంతో టీడీపీ తమ్ముళ్లకు బోర్ కొట్టించారు. ఏం చెప్పదలచుకున్నారన్న స్పష్టత లేకుండా ఎక్కడెక్కడికో వెళ్లిపోయారు. దేనిపైనా సాధికారికంగా మాట్లాడలేకపోయారు. ఒక అంశం నుంచి మరో అంశంలోకి మారినప్పుడు ముందు విషయం మరచిపోయినట్లు ప్రవర్తించడంతో సమన్వయం కుదరక ప్రసంగం అతుకుల బొంతలా సాగింది. కాంగ్రెస్ నేతలను చేర్చుకోవడంపై పార్టీ నేతల్లో రేగిన అసంతృప్తిని చల్లార్చేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. పార్టీ బలంగా లేనందునే కాంగ్రెస్ నేతలను చేర్చుకుంటున్నామని ఆయనే అంగీకరించడం గమనార్హం. ఇక సభకు భారీగా డబ్బు వెదజల్లి మరీ జనసమీకరణ చేసిన నేతలకు చంద్రబాబు దెబ్బకొట్టారనే చెప్పాలి. నిర్వాహకులు తరలించిన జనం చంద్రబాబు ప్రసంగం ప్రారంభించగానే సభాప్రాంగణం నుంచి జారుకోవడం ప్రారంభించారు. దాదాపు గంటకుపైగా సాగిన ఆయన ప్రసంగంలో ఏమాత్రం కొత్తదనం, స్పష్టత లేకపోవడంతో అందరూ నిరుత్సాహపడ్డారు. వేదిక మీద ఉన్న నేతలు కూడా చంద్రబాబు నిరాసక్తమైన ప్రసంగంతో విసుగుచెందినట్లు కనిపించారు. ఆయన ప్రసంగిస్తుంటే వారు సహచర నేతలతో మాట్లాడుకోవడం కనిపించింది.ఇక సభాప్రాంగణంలో ఉన్న ప్రజలు మాత్రం బాబు ప్రసంగం ధాటికి తట్టుకోలేక మధ్యలోనే ఇంటిదారి పట్టారు. వెరసి హైదరాబాద్ నుంచి వచ్చిన పార్టీ ప్రత్యేక ప్రతినిధుల కనుసన్నల్లో భారీగా డబ్బు వెదజల్లి టీడీపీ నిర్వహించిన ప్రజాగర్జన ప్రతిధ్వనించలేదనే చెప్పాలి.