Governament hospitals
-
‘ఈ తిండి తింటే కొత్త జబ్బులు వస్తాయి’
న్యూఢిల్లీ: 2018 నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ప్రధాన మీడియాతో పాటు సోషల్‌మీడియా కూడా కీలక పాత్ర పోషించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుత లాక్డౌన్ కాలంలో కూడా పార్టీలన్ని సోషల్ మీడియా వేదికగా విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో గురువారం ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ) సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేసింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో క్వారంటైన్ కేంద్రాల్లో భోజనం సరిగా లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) పార్టీ జాతీయ ప్రతినిధి మంజిందర్ ఎస్ సిర్సా ఢిల్లీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా రోగులకు పెడుతున్న భోజనానికి సంబంధించి ఓ వీడియోను తన ట్విట్టర్లో షేర్ చేశారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ట్యాగ్ చేస్తూ ‘కరోనా పేషెంట్లు ఇలాంటి భోజనం తింటే.. వారికి ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది’ అని ట్వీట్ చేశారు సిర్సా.(‘40 రోటీలు, 10 ప్లేట్ల భోజనం.. మా వల్ల కాదు’) मुख्यमंत्री @ArvindKejriwal जी... दिल्ली के अस्पतालों में कोरोना के मरीज़ों को बहुत बुरा खाना मिल रहा है...जिसे खाकर मरीज़ और बीमार हो रहे हैं अगर दिल्ली सरकार चाहे तो गुरुद्वारा श्री बंगला साहिब कोरोना मरीज़ों को पौष्टिक, साफ़ सुथरा और भरपूर खाना देने के लिये तैयार है 🙏🏻 pic.twitter.com/JZdEWeqAcm — Manjinder S Sirsa (@mssirsa) May 27, 2020 దీనిపై స్పందిస్తూ ఆప్ కింది ఫోటోలను ట్వీట్ చేసింది. ‘ఢిల్లీ గవర్నమెంట్ ఆస్పత్రుల్లో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కరోనా పేషంట్లకు అందిస్తున్న భోజనం.. కేంద్రం ప్రభుత్వం నడుపుతున్న ఆస్పత్రుల్లో రోగులకు పెడుతున్న ఆహారం’ అంటూ ఓ ఫోటోను ట్విట్టర్లో షేర్ చేసింది. కేంద్ర ప్రభుత్వం కరోనా పేషెంట్లకు భోజనంలో ఎండిపోయిన చపాతీలను అందించగా.. కేజ్రీవాల్ గవర్నమెంట్ మాత్రం అన్నం, కూర, ఫ్రై, చారుతో పాటు కీర, క్యారెట్, గుడ్డు కూడా అందిస్తుంది. అంతేకాక సిర్సా చెబుతున్న ప్రభుత్వ ఆస్పత్రిని కేంద్రం ప్రభుత్వం నడుపుతున్నట్లు ఆప్ వెల్లడించింది. ఢిల్లీ ప్రభుత్వం కిందకు వచ్చే ప్రభుత్వ ఆస్పత్రుల్లో చాలా మంచి భోజనం అందిస్తున్నామని ఆప్ పేర్కొంది. ఇది చూసిన జనాలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు.. కేజ్రీవాల్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. Quality of food : Central Govt Delhi Govt Hospital Hospital pic.twitter.com/c42ucAeW2Q — AAP (@AamAadmiParty) May 28, 2020 -
ఆర్జనపై మక్కువ.. సేవలు తక్కువ
నంద్యాల ఎస్బీఐ కాలనీకి చెందిన పవన్‌కుమార్ అనే పదేళ్ల బాలుడు నెల రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. వారం క్రితం అతన్ని చికిత్స కోసం తండ్రి శంకర్ నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు పరీక్షలు నిర్వహించి.. కడుపులో పేగుకు ఇన్ఫెక్షన్ సోకిందని నిర్ధారించారు. రెండు రోజులు చికిత్స అందించిన తర్వాత ఆపరేషన్ తప్పనిసరిగా చేయాలని తండ్రికి చెప్పారు. అయితే.. ఆపరేషన్ చేయాల్సిన వైద్యురాలు ఇక్కడ కుదరదని, బయటకు వెళ్లి చేయించుకోవాలని సూచించారు. దీంతో శంకర్ బయట వడ్డీకి అప్పు తెచ్చి, ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కుమారుడికి ఆపరేషన్ చేయించాడు. సాక్షి, బొమ్మలసత్రం(కర్నూలు) : ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఒకవైపు ప్రభుత్వం చెబుతున్నా.. మరోవైపు కొందరు వైద్యుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. సొంత ప్రాక్టీసుపైనే మొగ్గు చూపుతూ..ప్రభుత్వాసుపత్రిలో సేవలను గాలికొదిలేస్తున్నారు. ముఖ్యంగా నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న కొందరు వైద్యులు ప్రైవేటు క్లినిక్‌ల పేరుతో కార్పొరేట్ స్థాయి ఆసుపత్రులను నడుపుతున్నారు. వారు ఏళ్ల తరబడి ఇక్కడే పాతుకుపోయారు. ఒకవేళ బదిలీ చేసినా..వారికున్న పలుకుబడితో తిరిగి ఇక్కడికే వస్తున్నారు. అలా కుదరకపోతే ఉన్నతాధికారులకు మేనేజ్ చేసుకుని డిప్యుటేషన్ పేరుతో తిరిగి రావడం పరిపాటిగా మారింది. పాత వైద్యుల స్థానాలు ఖాళీ కాకపోవడంతో కొత్తవారికి అవకాశం లేకుండా పోతోంది. పేదలకు నిజంగా సేవ చేయాలనుకునే వైద్యులు.. ఇక్కడి సీనియర్ల తీరును చూసి వెనక్కి వెళ్లిపోతున్నారు. శస్త్రచికిత్స చేయాలంటే సొంత క్లినిక్‌కు వెళ్లాల్సిందే.. నంద్యాల ప్రభుత్వాసుపత్రికి ప్రతి రోజూ 1,200 నుంచి 1,400 మంది అవుట్ పేషెంట్లు వస్తున్నారు. వారిలో 300 నుంచి 400 మంది ఇన్పేషెంట్లుగా చేరుతున్నారు. వారిలో ప్రతి రోజూ దాదాపు 40 మంది రోగులకు ఏదో ఒక శస్త్రచికిత్స అవసరమవుతోంది. అయితే.. పది మందికి కూడా వైద్యులు శస్త్రచికిత్సలు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. అత్యవసరంగా ఆపరేషన్ చేయాలంటే సొంత క్లినిక్‌కు రావాలని నిర్మొహమాటంగా చెబుతున్నారు. ఓపీకే పరిమితం నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో సర్జరీలు నిర్వహించాల్సిన వైద్యులలో కొందరు ఓపీ సేవలకే పరిమితమవుతున్నారు. మరికొందరు ఓపీ సేవలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఉదయం మొక్కుబడిగా కొంత సమయం రోగులకు కేటాయించి.. తర్వాత అక్కడి నుంచి నేరుగా సొంత క్లినిక్‌లకు వెళ్లిపోతున్నారు. ప్రభుత్వాసుపత్రిలో ముగ్గురు జనరల్ సర్జన్లు, ముగ్గురు ఆర్థోపెడిక్ సర్జన్లు, ముగ్గురు కంటి వైద్యనిపుణులు, ఒకరు ఈఎన్టీ స్పెషలిస్ట్ పనిచేస్తున్నారు. గతంలో జనరల్ సర్జరీలు నెలకు 50 దాకా నిర్వహించేవారు. ప్రస్తుతం వాటి సంఖ్య 30కి పడిపోయింది. ఆర్థోకు సంబంధించి గతంలో 12 నుంచి 15 వరకు శస్త్రచికిత్సలు జరిగేవి. ప్రస్తుతం 5 నుంచి 8 మాత్రమే జరుగుతున్నాయి. సిజేరియన్ ఆపరేషన్లు గతంలో 250 నుంచి 300 దాకా నిర్వహించేవారు. ప్రస్తుతం 200కు మించడం లేదు. మిగిలిన కేసులను సొంత క్లినిక్‌లకు తరలించుకుపోతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఒక కంటి వైద్య విభాగంలో మాత్రమే ప్రతి నెలా 80 నుంచి 100 ఆపరేషన్లు క్రమంగా నిర్వహిస్తున్నారు. కార్పొరేట్ తరహా ఆసుపత్రులు నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న కొందరు వైద్యులకు కార్పొరేట్ తరహా ఆసుపత్రులు ఉన్నాయి. సొంత క్లినిక్‌లకు వచ్చే రోగులకు వైద్యం అందించడానికే వారికి సమయం చాలడం లేదు. ఇక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు సేవలు ఏ మేరకు అందిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాసుపత్రిలో జనరల్ సర్జన్‌గా పనిచేస్తున్న ఓ వైద్యురాలు పట్టణంలోని పద్మావతినగర్‌లో ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. అలాగే ఓ ప్రసూతి వైద్య నిపుణురాలు కూడా అదే ప్రాంతంలో క్లినిక్ నడుపుతున్నారు. ఓ చిన్నపిల్లల వైద్యుడు స్థానిక రెవెన్యూ క్వార్టర్స్‌లో, ఇదే విభాగానికి చెందిన వైద్యురాలు ప్రభుత్వాసుపత్రి ఎదురుగానే ప్రైవేటు ప్రాక్టీసు చేస్తుండడం గమనార్హం. వీరితో పాటు మరికొందరు కూడా ఇదే బాటలో ఉన్నారు. శస్త్రచికిత్సలు తగ్గిన మాట వాస్తవమే నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు రోగులకు శస్త్రచికిత్సలు నిర్వహించటంలో నిర్లక్ష్యం వహిస్తున్న మాట వాస్తవమే. వారిని హెచ్చరించాల్సిందిగా ఇది వరకే సూపరింటెండెంట్ విజయ్‌కుమార్‌ను ఆదేశించా. ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యులు కార్పొరేట్ స్థాయి ఆసుపత్రులు నిర్వహిస్తుంటే.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వాసుపత్రికి వస్తున్న రోగులను సొంత క్లినిక్‌లకు తరలించినట్లు విచారణలో తేలితే కఠిన చర్యలు తప్పవు. –రామకృష్ణారావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త (డీఎస్‌హెచ్‌ఎస్) -
ప్రభుత్వాసుపత్రుల్లో సాయంత్రం ఓపీ సేవలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వాసుపత్రుల్లో సాయంత్రం ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలను విస్తరించాలని వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తోంది. అవసరమైతే నిమ్స్ తరహాలో సాయంత్రం వచ్చే రోగుల నుంచి నామమాత్రంగా ఫీజు వసూలు చేసే అంశాన్నీ పరిశీలిస్తోంది. ఫలితంగా రోగులకు వైద్య సేవలు విస్తరించడంతో పాటు, వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసుపై దృష్టిపెట్టకుండా నివారించొచ్చని భావిస్తోంది. అంతేకాదు సాయంత్రం ఓపీ సేవలు విస్తరిస్తే అనేకమంది రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించకుండా ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తారని సర్కారు భావిస్తోంది. ఏరియా, జిల్లా, బోధన ఆసుపత్రులన్నింటిలోనూ ఓపీ సేవలను సాయంత్రం విస్తరించే అంశంపై ఇటీవల వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రెండు షిఫ్ట్‌ల విధానం.. ఉన్న వనరులతోనే ప్రభుత్వ ఆసుపత్రు లను అత్యంత మెరుగ్గా నడపాలని సర్కారు యోచిస్తోంది. ప్రస్తుతం నిమ్స్‌లో మధ్యాహ్నం వరకు ఓపీ ఉంటుంది. సాయంత్రం మళ్లీ ఓపీ నిర్వహిస్తారు. ఉదయం ఓపీ ఉచితం. సాయంత్రం మాత్రం కన్సల్టెంటు ఫీజు కింద ప్రతి రోగి నుంచి రూ.500 వసూలు చేస్తారు. అందులో సగం అంటే రూ.250 డాక్టర్‌కు ఇస్తారు. అయితే మిగిలిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ మధ్యాహ్నమే ముగుస్తుంది. అందుకే సాయంత్రం ఓపీ సర్వీసులు ప్రారంభించాలని యోచిస్తున్నారు. వాస్తవానికి ఉద్యోగుల కోసం సాయంత్రం ఓపీ తెరవాలని గతంలోనే నిర్ణయించారు. కానీ అది అమలు కావట్లేదని అధికారులు అంటున్నారు. ఇప్పుడు ఇతరులకూ సాయంత్రం వైద్య సేవలు అందించేలా, నామమాత్రపు ఫీజు వసూలు చేసేలా చేయాలని భావిస్తున్నారు. అయితే సాయంత్రం ఓపీ పద్ధతిని కొందరు వైద్యులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే సాయంత్రం ప్రైవేటు ప్రాక్టీసు ఉన్న వైద్యులకు షిఫ్ట్ విధానం ఇబ్బందిగా మారనుంది. -
కిట్‌కట !
పాలమూరు: ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయడంతో పాటు సర్కార్ దవాఖానాల్లో ప్రసవాలు పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. అయితే, అసెంబ్లీ ఎన్నికల కోడ్ కారణమో ఇతరత్రా ఏమైనా సమస్యలు ఉన్నాయో తెలియదు కానీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించే మహిళలకు కేసీఆర్ కిట్ అండం లేదు. తల్లీ, బిడ్డకు ఉపయోగపడే రూ.2వేలకు పైగా విలువైన వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్ పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టడంతో పాటు అమ్మ ఒడి పథకంలో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రులకు పరీక్షలు, ప్రసవాల కోసం వచ్చే గర్భిణులకు నగదు ప్రోత్సాహకం అందజేస్తున్నారు. ఈ పథకం ఇన్నాళ్లు సాఫీగానే సాగగా అసెంబ్లీ ఎన్నికల కోడ్ సమయంలో కేసీఆర్ చిత్రం ముద్రించిన కిట్ ఇవ్వొద్దన్న ఎన్నికల కమిషన్ ఆదేశాలు వచ్చాయి. దీంతో అయితే, కేసీఆర్ చిత్రం లేకుండా కిట్ మాత్రం అందజేశారు. అలా ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో సాఫీగా అందిన కిట్ గత నెల రోజులుగా అందడం లేదు. గత నెల 29వ తేదీ నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రవసవించిన బాలింతలకు కేసీఆర్ కిట్లు ఇవ్వడం లేదు. ప్రసవించిన సమయంలో ఇవ్వకుండా తర్వాత రావాలని సిబ్బంది చెబుతుండడంతో దూరప్రాంతాల నుంచి రావాల్సిన వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఆస్పత్రులు, పీహెచ్‌సీలు మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రితో పాటు నారాయణపేట ఏరియా ఆస్పత్రి, జడ్చర్ల, మక్తల్, కోస్గి, కోయిల్‌కొండల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉండగా.. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 28ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాలు ఉన్నాయి. అయితే, వైద్యసేవలందించడంలో మా త్రం జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి కీలకపాత్ర పోషిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు చెందిన గర్భిణులు కూడా ప్రసవం కోసం ఇక్కడకు వస్తున్నారు. దీంతో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో జనరల్ ఆస్పత్రిలో కేసీఆర్ కిట్ ఇవ్వకపోవడంతో బాలింతలు ఆందోళన చెందుతున్నారు. వివరాలు నమోదు కేసీఆర్ కిట్లు లేకపోవడంతో బాలింతల వివరాలను సంబంధిత సిబ్బంది సేకరిస్తున్నారు. ఆస్పత్రి నుంచి ప్రతి రోజు డిశ్చార్జ్ అవుతున్న బాలింతల ఫొటోలు, ఫోన్ నెంబర్లు, తల్లి ఆధార్ కార్డు, చిరునామా తీసుకొని కిట్లు వచ్చిన తర్వాత సమాచారం ఇస్తామని చెబుతున్నారు. దాదాపు 25 రోజులుగా కిట్ల పంపిణీ లేకపోవడం వల్ల చాలా మంది బాలింతలు, వారి బంధువులు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అయితే, వచ్చిన ప్రతీసారి ఇంకా కిట్ రాలేదని సిబ్బంది చెబుతుండడంతో వారు నిరాశగా తిరుగుముఖం పడుతున్నారు. నగదు జమ ఏదీ? అమ్మ ఒడి పథకంలో భాగంగా నగదు సాయాన్ని అందచేసేందుకు గ్రామాల్లో మూడు నుంచి ఐదు నెలల గర్భంతో ఉన్న మహిళలను ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. అర్హుల ఎంపిక బాధ్యతను అంగన్వాడీ, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలకు అప్పగించారు. తమ పరిధిలోని ప్రాంతాల్లో గర్భిణులను గుర్తించి వారి పేర్లు, బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్ ఇతర వివరాలు నమోదు చేయాలి. ఇందుకోసం అందజేసిన ట్యాబ్‌ల ద్వారా ఏఎన్సీ కార్డుతో గర్భిణుల వివరాలను నమోదు చేస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించాలి. ఆ తర్వాత ప్రభుత్వం అర్హులను ఎంపిక చేసి నిధులు మంజూరు చేస్తోంది. ఈ ఆర్థిక సాయాన్ని పొందడానికి ప్రతీ గర్భిణి తనకు స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో పేరు నమోదు చేసుకుని కనీసం రెండుసార్లు వైద్య పరీక్షలు చేయించుకుంటే రూ.3వేలు బ్యాంకులో జమ చేస్తారు. రెండో విడతగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన తర్వాత ఆడ బిడ్డ పుడితే రూ.5వేలు, మగ బిడ్డ పుడితే రూ.4వేలు ఇస్తారు. ఇక మూడో విడతగా బిడ్డ పుట్టినప్పటి నుంచి మూడున్నర నెలల కాలంలో ఇప్పించాల్సిన టీకాలు సక్రమంగా ఇప్పించిన తర్వాత రూ.3వేలు జమ చేస్తారు. అయితే క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బంది గర్భిణులను గుర్తించడంలో అలసత్వం చేస్తున్నారు. ఫలితంగా సర్కారు ఆస్పత్రుల్లో కాన్పు చేయించుకున్నా ప్రభుత్వం ఇచ్చే నగదు అందడం లేదు. ఇటీవల కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో గర్భిణులను నమోదు 28శాతం లేదని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కనీసం 50శాతమైనా ఉండాలని ఆదేశించడం సిబ్బంది పనితీరుకు అద్దం పడుతోంది. -
రక్తనిధి నిల్!.. గర్భిణుల అవస్థలు
సాక్షి, పాలమూరు: ప్రమాదం జరిగిన క్షతగాత్రుడికి రక్తం అవసరమైతే రక్తనిధి కేంద్రం వైపు పరుగులు తీస్తాం. రక్తహీనత ఉన్న గర్భిణి ప్రసవానికి ఆస్పత్రిలో చేరితే రక్తం ఎక్కిస్తాం. ఇక తలసేమియా, సర్జరీలు, డయాలసిస్ బాధిత రోగులకు రక్తం తప్పనిసరి. అత్యవసర సమయంలో బయట నుంచి రక్తం తెప్పించి ఎక్కించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో జిల్లా జనరల్ ఆస్పత్రిలోని బ్లడ్‌బ్యాంకులో సరిపడా నిల్వలు లేని ప్రమాదకర స్థితి నెలకొంది. ప్రస్తుతం ఎన్నికల సీజన్ వల్ల ప్రతి ఒక్క రూ ఎన్నికల బిజీలో ఉండటంతో రక్తదాన శిబిరా లు పెట్టకపోవడంతో పాటు స్వచ్ఛందంగా ఇచ్చే దాతలు రావడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే అత్యవసరంగా రక్తం కావాల్సిన అభాగ్యులకు ర క్తం అందించలేని దయనీయ స్థితి ఏర్పడుతుంది. ప్రైవేట్ ఆస్పత్రులకు తరలింపు ఇటీవల తిమ్మసానిపల్లికి చెందిన లక్ష్మీ ప్రసవానికి జనరల్ ఆస్పత్రికి వస్తే.. బ్లడ్ బ్యాంకులో రక్తం లేదని వైద్యులు ఆమెను ప్రసవానికి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఇలా నిత్యం ఒకటి, రెండు కేసులు రక్తం నిల్వలు లేకపోవ డం వల్ల రెఫర్ చే యడం బాధకరం. లెబర్ రూంలో ఉద యం 9గంటల నుం చి మధ్యాహ్నం 12 గంటలకు రెగ్యులర్ సీనియర్ వైద్యులు ఉండటం వల్ల పెద్దగా ఇబ్బంది రావడం లేదు. కానీ మ ధ్యాహ్నం తర్వాత ప్రసవానికి వచ్చిన గర్భిణులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. రాత్రివేళ అసలు వై ద్యులే లేరని సాకు చూపించి జూనియర్ వైద్యులు కేసులను అధిక సంఖ్యలో హైదరాబాద్‌కు రెఫర్ చేస్తున్నారు. దీనికితోడు రక్త నిల్వలు లేకపోవడం వల్ల రెఫర్ కేసులు పెరుగుతున్నాయి. బ్లడ్ బ్యాంకులో నిల్వ లేకనే.. మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలో ప్రస్తుతం గైనిక్ విభాగంలో నిత్యం 40కి పైగా అడ్మిషన్లు అవుతుండగా, 27వరకు ప్రసవాలు అవుతున్నాయి. దీంట్లో 17నార్మల్ ఉంటే, 10వరకు ఆపరేషన్లు చేస్తున్నారు. నిత్యం 7నుంచి 10మంది గర్భిణులు రక్తహీనత సమస్యతో ప్రసవానికి వస్తున్నారు. కొందరిని రక్తం లేదని ప్రైవేట్ ఆస్పత్రులకు పంపుతున్నారు. దీంతో పాటు పలు రకాలుగా రోడ్డు ప్రమాదాలలో గాయపడుతూ ఆస్పత్రికి వస్తున్న వారు 20నుంచి 40మంది క్షతగాత్రులు ఉంటారు. వీరిలో దాదాపు 10మంది వరకు రక్తం అవసరం పడుతుంది. కానీ ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంకులో కావాల్సిన నిల్వలు లేకపోవడం వల్ల సమస్య ఏర్పడుతుంది. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం వల్ల బాధితుల కుటుంబ సభ్యులే బయటి బ్లడ్ బ్యాంకుల్లో నగదు చెల్లించి రక్తం తీసుకొస్తున్నారు. శిబిరాల నిర్వహణ లేదు ఎన్నికల నేపథ్యంలో అధిక సంఖ్యలో శిబిరాల నిర్వహణ లేదు. కేవలం బ్లడ్ బ్యాంకు వారు నిర్వహించే శిబిరాలతో నడిపిస్తున్నాం. రోగుల వెంబడి వచ్చే కుటుంబ సభ్యులు రక్తం ఇస్తే బాగుంటుంది. కానీ వారు భయపడి రక్తం ఇవ్వడం లేదు. త్వరలో మెడికల్ కళాశాల విద్యార్థులతో కలిసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తాం. బయటి నుంచి కూడా అధికంగా జనరల్ ఆస్పత్రి బ్లడ్ బ్యాంకుకు రక్త నిల్వలు ఇవ్వాలి. కానీ ఇవ్వడం లేదు. – డాక్టర్ రామకిషన్, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ -
లారీ బోల్తా.. 29 మందికి గాయాలు
సాక్షి, మాచర్ల / వెల్దుర్తి : కడుపులో ఆకలి మంటలు చల్లార్చుకునేందుకు పస్తుల రెక్కలు కట్టుకుని పనులు వెతుక్కుంటూ జిల్లాలు దాటి వెళ్లారు. తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో కొద్ది రోజులు కండలు కరిగించి నాలుగు డబ్బులు దాచుకుని ఆదివారం స్వగ్రామాలైన ప్రకాశం జిల్లాలోని వెంకటరెడ్డిపల్లె, గంగారం ప్రయాణం కట్టారు. మరి కొద్ది గంటల్లో తమ వారిని చూస్తామనే ఆనందంలో ఉండగా.. ఒక్కసారిగా వారు ప్రయాణిస్తున్న లారీ వెల్దుర్తి మండలం ఉప్పలపాడు వద్ద బోల్తా కొట్టింది. 29 మంది ప్రయాణికుల్లో పది మంది తీవ్రంగా, మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. వెల్దుర్తి మండలం ఉప్పలపాడు మూల మలుపు వద్ద ఆదివారం సాయంత్రం లారీ బోల్తా కొట్డడంతో 29 మంది వలస కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగాఉండటంతో మెరుగైన వైద్యంకోసం గుంటూరుకు సిఫార్సుచేయగా వారిలో కొందరు నరసరావుపేటలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వైద్యశాలకు వచ్చిన ఆరుగురిలో ఇద్దరికి ఎముకలు విరిగి తీవ్రగాయాలు కాగా, మరో నలుగురికి ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిసింది. మిగిలిన 19 మంది మాచర్ల ప్రభుత్వ వైద్యశాలలోనే చికిత్స పొందుతున్నారు. వీరంతా ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం వెంకటరెడ్డిపల్లె, గంగారం గ్రామాలకు చెందిన వారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలోని విదిలాబాద్‌కు కూలి పనుల నిమిత్తం వలస వెళ్లారు. పనులు ముగించుకొని ఆదివారం స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. -
9,000 మందికో వైద్యుడు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను ప్రభుత్వ వైద్యుల కొరత వేధిస్తోంది. వైద్యారోగ్య రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా సిబ్బంది నియామకంపై దృష్టి సారించకపోవడంతో వైద్యుల కొరత తీరడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లెక్కల ప్రకారం ప్రతి 1,000 మందికి ఓ ప్రభుత్వ వైద్యుడు ఉండాలి. కానీ తెలంగాణలో 9,343 మందికి ఓ వైద్యుడు ఉన్నాడు. మొత్తంగా రాష్ట్రంలో 4,123 మందే సర్కారు వైద్యులున్నారు. వీరుగాకుండా 201 మంది దంత వైద్యులున్నారు. అంటే ప్రతి 1.91 లక్షల మందికి ఓ దంత వైద్యుడన్నమాట. కేంద్రం ఇటీవల విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య మానవ వనరుల నివేదిక–2018 ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. వైద్యుల విషయంలో ఈశాన్య రాష్ట్రాలతో పోల్చినా రాష్ట్రం వెనుకబడి ఉన్నట్లు నివేదిక పేర్కొంది. సిక్కింలో ప్రతి 2,437 మందికి, మిజోరంలో 2,358 మందికి ఓ వైద్యుడున్నట్లు వెల్లడించింది. తమిళనాడుతో పోలిస్తే మాత్రం తెలంగాణ ముందుంది. అక్కడ 9,544 మందికి ఓ వైద్యుడున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోనైతే 10,189 మందికి ఓ వైద్యుడున్నాడు. బిహార్ రాష్ట్రం అత్యంత వెనుకబడి ఉంది. అక్కడ 28,391 మందికి ఓ ప్రభుత్వ వైద్యుడున్నాడు. అదే అమెరికాలో ప్రతి 200 మందికి ఓ వైద్యుడు ఉన్నాడు. నియామకాల్లేవు.. కొత్త పోస్టుల్లేవు రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇటీవల కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టాక ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు 13 శాతం పెరిగాయి. 2016 జూన్ నుంచి 2017 మే మధ్య 2,21,530 ప్రసవాలు జరగ్గా.. ‘కిట్’ప్రవేశపెట్టాక తొలి ఏడాదిలో 3,07,497 ప్రసవాలు జరిగాయి. మరోవైపు డయాలసిస్ యూనిట్లు కూడా నెలకొల్పుతున్నారు. ఆస్పత్రులను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. త్వరలో ‘కంటి వెలుగు’కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఓవైపు ఇలాంటి కీలక కార్యక్రమాలు చేపడుతున్నా మరోవైపు వైద్య సిబ్బంది ఖాళీల భర్తీ కానీ, కొత్త పోస్టుల మంజూరుగానీ జరగడం లేదు. రెండ్రోజుల క్రితం ఏరియా, సామాజిక, జిల్లా ఆస్పత్రుల కోసం 919 మంది స్పెషలిస్టు వైద్యుల భర్తీ జరిగింది. కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరిస్థితి మెరుగుపడాల్సి ఉంది. 5 వేల పోస్టులు ఖాళీ కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 1,318 మంజూరు వైద్యుల పోస్టులుండగా 294 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో (సీహెచ్‌సీ) 226 మంజూరు వైద్య పోస్టులుంటే 197 మందే ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సీహెచ్‌సీల్లో 1,666 స్టాఫ్ నర్సులకుగాను కేవలం 1453 మందే ఉన్నారు. సీహెచ్‌సీల్లో 71 రేడియోగ్రాఫర్స్‌కు 28 మందే పని చేస్తున్నారు. పీహెచ్సీ, సీహెచ్‌సీల్లో 928 ఫార్మసిస్టులకు 691 మంది ఉండగా.. వాటిల్లో 765 లేబరేటరీ టెక్నీషియన్ల పోస్టులకు 566 మంది పని చేస్తున్నారు. సిబ్బంది కొరత తీర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా అవి పూర్తిస్థాయిలో ఆచరణలోకి రాలేకపోతున్నాయని ఆరోపణలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 వేల ఖాళీలున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల 1,000 వరకు పోస్టులు భర్తీ చేయడంతో ఖాళీల సంఖ్య 5 వేలకు తగ్గింది. 12 శాతం మందే సర్కారుకు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసేందుకు వైద్యులు ఆసక్తి చూపించడం లేదన్న ఆరోపణలున్నాయి. కేవలం 12 శాతం మందే ప్రభుత్వ ఆస్పత్రుల్లోకి వస్తున్నారు. ప్రభుత్వ వైద్య రంగంలో తక్కువ వేతనం, మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం, తక్కువ పోస్టులే ఇందుకు కారణమని కేంద్రం విశ్లేషించింది. దేశంలో అనేక రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో తక్కువ వేతనాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు. కేరళలో బోధనేతర అసిస్టెంట్ సర్జన్‌కు రూ.లక్ష, సివిల్ సర్జన్‌కు రూ. 1.80 లక్షలు వేతనాలిస్తుంటే.. తమిళనాడులో అదే కేటగిరీకి రూ. 90 వేలు, రూ. లక్షన్నర చొప్పున ఇస్తున్నారు. తెలంగాణలో మాత్రం రూ. 65 వేలు, రూ. లక్ష ఇస్తున్నారు. బోధనాసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చత్తీస్‌గఢ్‌లో వైద్యుల బేసిక్ శాలరీలో 25 శాతం గ్రామీణ అలవెన్సు ఇస్తుంటే తెలంగాణలో రూ. 2 వేలు ఇస్తున్నారు. పోస్టుమార్టం అలవెన్సు పంజాబ్‌లో ఒక్కో కేసుకు రూ. 1,000.. కేరళ, తమిళనాడుల్లో రూ. 600 చొప్పున ఇస్తుండగా రాష్ట్రంలో ఒక్క పైసా ఇవ్వడం లేదు. ఇక 29 రాష్ట్రాల్లో 26 రాష్ట్రాలు నిర్ణీత సమయంలోనే పదోన్నతులు ఇస్తున్నాయి. తెలంగాణ, పశ్చిమబెంగాల్, అస్సాంలలో అలా జరగడం లేదు. మరోవైపు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడానికి కూడా వైద్యులు విముఖత చూపిస్తున్నారు. –––––––––––––––––––––––––––––––––––– వివిధ రాష్ట్రాల్లో ఒక్కో ప్రభుత్వ వైద్యుడికి జనాభా ––––––––––––––––––––––––––––––––––––– రాష్ట్రం జనాభా ––––––––––––––––––––––––––––––––––– 1) తెలంగాణ 9,343 2) ఆంధ్రప్రదేశ్ 10,189 3) అరుణాచల్‌ప్రదేశ్ 2,417 4) అస్సాం 5,395 5) బీహార్ 28,391 6)చత్తీస్‌గఢ్ 15,916 7) గోవా 3,883 8) గుజరాత్ 11,475 9) హరియాణా 10,189 10) జమ్మూ కశ్మీర్ 3,060 11) కర్ణాటక 13,556 12) కేరళ 6,810 13) మహారాష్ట్ర 16,996 14) మణిపూర్ 2,358 15) పంజాబ్ 9,817 16) రాజస్థాన్ 10,976 17) తమిళనాడు 9,544 18) త్రిపుర 3,038 19) ఉత్తరప్రదేశ్ 19,962 20) పశ్చిమబెంగాల్ 10,411 -
ప్రభుత్వాస్పత్రుల్లో పెరిగిన ప్రసవాలు
థియేటర్ల ఏర్పాటుతో మెరుగైన సేవలు సత్ఫలితాలిస్తున్న జననీ సురక్ష యోజన పెరుగుతున్న ఆపరేషన్లు ఈ ఏడాది జిల్లాలో మొత్తం ప్రసవాలు 5561 ప్రసూతి ఆపరేషన్లు 2891 కరీంనగర్ హెల్త్ : జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసూతి ఆపరేషన్ల సంఖ్య పెరుగుతోంది. సాధారణ ప్రసవాలతో సమానంగా ఆపరేషన్ ప్రసవాలు జరుగుతున్నాయి. దాదాపు అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు చేస్తుండడంతో సాధారణ, ఆపరేషన్ ప్రసవాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. ఆపరేషన్ థియేటర్ సౌకర్యం కల్పించడంతో ఆపరేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాతాశిశు మరణాలు తగ్గించేందుకు కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన జననీ సురక్ష యోజన ద్వారా వైద్య ఆరోగ్య శాఖ వైద్య సేవలు అందిస్తోంది. ఈ పథకం ద్వారా తల్లీశిశువును పూర్తి ఆరోగ్యంగా ఇంటికి చేర్చాలనే లక్ష్యంతో పనిచేస్తుండడం సత్ఫలితమిస్తోంది. ఆస్పత్రుల ఆధునీకీకరణతో.. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆధునీకీకరించడంతో మరింత సత్ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో ప్రసవాలతోపాటు ఆపరేషన్లు కూడా చేసేలా సౌకర్యాలు కల్పిస్తే శిశుమరణాలు కూడా తావులేకుండా ఉంటుంది. ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రితోపాటు వైద్య విధానపరిషత్ ఆధ్వర్యంలో నడిచే ఏరియా ఆస్పత్రులతోపాటు ఎనిమిది సీహె చ్‌సీల్లో మాత్రమే ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఇతర పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్సెంటర్లలో సౌకర్యాలు లేవు. జిల్లాలో ప్రధానాస్పత్రితోపాటు గోదావరిఖని, సిరిసిల్ల, జగిత్యాలలో ఏరియా ఆస్పత్రులు ఉండగా.. డీపీహెచ్ ఆధ్వర్యంలో నడిచే హుజూరాబాద్, జమ్మికుంట, సుల్తానాబాద్, కోరుట్ల కమ్యూనిటీ హెల్త్సెంటర్లు, వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో నడిచే మెట్పల్లి, మంథని, మహదేవపూర్, పెద్దపల్లి కమ్యూనిటీ హెల్త్సెంటర్లలో మాత్రమే ప్రసూతి ఆపరేషన్‌కు థియేటర్ సౌకర్యం ఉంది. జిల్లాలో మొత్తం 71ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా 28 పీహెచ్‌సీలు 24 గంటలపాటు సేవలు అందిస్తున్నాయి. తాజాగా జిల్లాలోని అర్బన్ హెల్త్‌సెంటర్లతోపాటు అన్ని ప్రభుత్వ ఆరోగ్యకేంద్రాల్లో ప్రసవాలు నిర్వహించడానికి వీలుగా నిర్మాణాలు చేపట్టింది. 24 గంటల పీహెచ్‌సీల్లో లేబర్రూమ్తోపాటు ఆపరేషన్ థియేటర్ సౌకర్యం కల్పించి గైనకాలజిస్టును ఏర్పాటుచేస్తే మరింత మెరుగైన ప్రసూతి సేవలందే అవకాశాలున్నాయి. వీటిలో థియేటర్ ఏర్పాటుచేయడంతో ప్రస్తుతం ఉన్న ఆస్పత్రులపై భారం తగ్గి మాతాశిశు మరణాలు తగ్గుతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. జిల్లాలో ప్రసూతి ఆపరేషన్లు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2016–17 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు మొత్తం ప్రసవాలు 5561 జరగగా, సాధారణ ప్రసవాలు 2,670, ఆపరేషన్ ప్రసవాలు 2,891 జరిగాయి. ఏప్రిల్‌లో 555 ఆపరేషన్లు, మేలో 526, జూన్‌లో 582, జూలైలో 581, ఆగస్టులో 647 ఆపరేషన్లు జరిగాయి. 2014–15లో 6856 ఆపరేషన్లు, 2015–16లో 7261 ఆపరేషన్లు జరిగాయి. ఏటా ఈ సంఖ్య సాధారణ ప్రసవాలకు దాదాపుగా సమానంగా ఉంటోంది. థియేటర్లు, గైనకాలజిస్టులను ఏర్పాటు చేస్తే ఆపరేషన్ ప్రసవాలు మరింత పెరుగుతాయి.