ఉప్పలపాడు వద్ద బోల్తాపడిన కూలీల లారీ (ఇన్‌సెట్‌లో) గాయపడిన మహిళ
సాక్షి, మాచర్ల / వెల్దుర్తి : కడుపులో ఆకలి మంటలు చల్లార్చుకునేందుకు పస్తుల రెక్కలు కట్టుకుని పనులు వెతుక్కుంటూ జిల్లాలు దాటి వెళ్లారు. తెలంగాణలోని మేడ్చల్ జిల్లాలో కొద్ది రోజులు కండలు కరిగించి నాలుగు డబ్బులు దాచుకుని ఆదివారం స్వగ్రామాలైన ప్రకాశం జిల్లాలోని వెంకటరెడ్డిపల్లె, గంగారం ప్రయాణం కట్టారు.
మరి కొద్ది గంటల్లో తమ వారిని చూస్తామనే ఆనందంలో ఉండగా.. ఒక్కసారిగా వారు ప్రయాణిస్తున్న లారీ వెల్దుర్తి మండలం ఉప్పలపాడు వద్ద బోల్తా కొట్టింది. 29 మంది ప్రయాణికుల్లో పది మంది తీవ్రంగా, మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు.
వెల్దుర్తి మండలం ఉప్పలపాడు మూల మలుపు వద్ద ఆదివారం సాయంత్రం లారీ బోల్తా కొట్డడంతో 29 మంది వలస కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగాఉండటంతో మెరుగైన వైద్యంకోసం గుంటూరుకు సిఫార్సుచేయగా వారిలో కొందరు నరసరావుపేటలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.
వైద్యశాలకు వచ్చిన ఆరుగురిలో ఇద్దరికి ఎముకలు విరిగి తీవ్రగాయాలు కాగా, మరో నలుగురికి ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిసింది. మిగిలిన 19 మంది మాచర్ల ప్రభుత్వ వైద్యశాలలోనే చికిత్స పొందుతున్నారు. వీరంతా ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం వెంకటరెడ్డిపల్లె, గంగారం గ్రామాలకు చెందిన వారు.
మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలంలోని విదిలాబాద్‌కు కూలి పనుల నిమిత్తం వలస వెళ్లారు. పనులు ముగించుకొని ఆదివారం స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment