ఘోర రోడ్డుప్రమాదం: గుంటూరులో విషాదం
సాక్షి, చెన్నై : తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. బస్సు, లారీ ఢీకొన్న దుర్ఘటనలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, మృతులు గుంటూరు జిల్లా వాసులుగా గుర్తించారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. తమిళనాడులోని తిరునెల్వేలిలో సిమెంట్ లోడ్‌తో అతివేగంగా వెళ్తున్న లారీ ఒక్కసారిగా ఆగి ఉన్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడిక్కడే చనిపోయారు.
బస్సులో ప్రయాణిస్తున్న మరికొందరు ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. మృతులంతా గుంటూరు జిల్లా పొన్నురు మండలం కొల్లూరు వాసులుగా గుర్తించారు. తిరునెల్వేలి నుంచి బస్సు కన్యాకుమారికి వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. సత్వరమే స్పందించి ప్రమాద బాధితులకు పూర్తిస్థాయిలో సహాయక చర్యలు కొనసాగించాలని అధికారులను తమిళనాడు సీఎం పళనిస్వామి ఆదేశించారు.
ప్రమాద ఘటనపై తమిళనాడు అధికారులతో గుంటూరు జిల్లా కలెక్టర్ సంప్రదింపులు చేస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఎంత మంది ఉన్నారన్నదానిపై స్పష్టతలేదు. మృతులను దేసు వెంకటరామారావు(70), కన్నెగంటి రామయ్య(65), కంకిపాటి రత్న మాణిక్య(56), గొడవర్తి నాగవర్ధిని(43), సత్యం(40) లుగా గుర్తించారు.