లారీ ఢీకొని వ్యక్తి మృతి
Published Fri, Sep 6 2013 4:49 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
విజయవాడ, న్యూస్‌లైన్: లోన్ కట్టడానికి బ్యాంక్‌కు బయలుదేరిన వ్యక్తి లారీ ఢీకొనడంతో మృత్యువాత పడిన ఘటన కృష్ణలంక పీఎస్ పరిధిలోని సీతమ్మవారి పాదాల సెంటర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళగిరి కురగల్లు గ్రామానికి చెందిన గుమ్మ అంకమరావు(45) వ్యవసాయం చేస్తుంటాడు. అతనికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. పెద్దమ్మాయికి పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. బందరురోడ్డులోని ఓ బ్యాంక్‌లో కొంతకాలం క్రితం ద్విచక్రవాహనం కొనుగోలు కోసం బ్యాంక్ లోన్ తీసుకున్నారు.
వాయిదా పద్ధతిలో లోన్ కడుతున్నారు. గురువారం గ్రామం నుంచి ఆటోలో బ్యాంక్‌కు బయలుదేరారు. సీతమ్మవారి పాదాల సెంటర్‌లోని ప్రత్యేక శనైశ్చరస్వామి దేవస్థానం దగ్గర ఆటో దిగారు. అక్కడ నుంచి మరో ఆటో ఎక్కడానికి రోడ్డుపై నిలబడ్డారు. ఇంతలో బస్టాండ్ వైపునుంచి హైదరాబాద్ వైపు వెళ్లే లారీ వేగంగా వచ్చి అతన్ని ఢీకొట్టింది. ఆ వాహనం వెనుక చక్రాల కింద పడటంతో అతని నడుము భాగం నుజ్జునుజ్జుయింది. ఘటనా స్థలంలోనే అతను మృతి చెందాడు.
ఆ ప్రాంతంలో ఉన్న క్షౌరవృత్తిదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతని దగ్గర ఉన్న బ్యాంక్ పాస్ బుక్ ద్వారా కురగల్లువాసని గ్రహించారు. ఆ స్టేషన్‌కు సంబంధించిన కానిస్టేబుల్‌కు కురుగల్లులో తెలిసిన వారు ఉండటంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించి, పోలీసులు కేసు నమోదు చేశారు.
Advertisement