Government hospital staff
-
బాబుకు వెయ్యి.. పాపకు రూ.800.. కాన్పుకు రూ.4వేలు! అన్నిటికీ రేటు ఫిక్స్
నల్లగొండ పట్టణ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన రాములమ్మ (పేరుమార్చాం) తన కోడలిని కాన్పు కోసం వారం క్రితం ఎంసీహెచ్‌కు తీసుకొచ్చింది. వచ్చీరాగానే ఆపరేషన్ థియేటర్‌కు వీల్‌చైర్‌లో తీసుకెళ్లేటప్పుడు రూ.200 అడగడంతో సరేలే అని ఇచ్చింది. ఆపరేషన్ పూర్తయ్యాక ఆడపిల్ల పుట్టిందని తీసుకొచ్చి చూపించినందుకు రూ.800 వసూలు చేశారు. చీరె మార్చినందుకు రూ.200, వార్డుకు తీసుకొచ్చినందుకు రూ.300 అడగడంతో వెంటనే ఇచ్చేసింది. వారం రోజులు ఆస్పత్రిలోని వార్డులో ఉండడంతో వార్డు ఊడ్చిన వాళ్లకు రోజూ వంద చొప్పున రూ.800, మందులకు రూ.700, డిశ్చార్జ్ సమయంలో వార్డులో అందరికీ కలిపి రూ.700 సమర్పించుకుంది. ఇంటికొచ్చే సరికి మొత్తం రూ.3,700 ఇవ్వాల్సి వచ్చిందని వాపోయింది. ఇదీ ఎంసీహెచ్‌లో వసూళ్ల పర్వానికి ఉదాహరణ. నల్లగొండ టౌన్ : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో కాన్పుల వార్డులో పనిచేస్తున్న సిబ్బంది కాసులకు కక్కుర్తి పడుతున్నారు. కాన్పులకు వచ్చినవారి నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి దండుకుంటున్నారు. వసూలు చేసిన డబ్బులు ఆ వార్డులోని సిబ్బంది సమానంగా పంచుకుంటున్నారు. కాసుల పంట పండిస్తున్న కాన్పుల వార్డులో డ్యూటీ కోసం సిబ్బంది పోటీ పడుతున్నారు. స్టాఫ్ నర్సు దగ్గరి నుంచి వార్డుబాయ్, ఆయా, ఇతర సహాయ సిబ్బంది అక్కడ డ్యూటీ వేసుకోవడానికి పైరవీలు చేస్తున్నారంటే ఏ స్థాయిలో వసూళ్ల పర్వం కొనసాగుతుందో స్పష్టమవుతుంది. ఈ వసూళ్లకు భయపడి పేదలు ఆస్పత్రిలోని కాన్పుల వార్డులో చేరడానికి జంకుతున్నారు. ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు హెచ్చరించినా సిబ్బందిలో మార్పు రావడం లేదు. ఇంటికి వేళ్లే వరకు రూ.4 వేలు ఖర్చు మాతా శిశు మరణాల శాతాన్ని తగ్గించడానికి ప్రతి గర్భణి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేసుకునేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం వైద ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పుల కోసం వచ్చే గర్భిణులకు ఉచితంగా వైద్య సేవలను అందించడంతో పాటు పౌష్టికాహారాన్ని, ఉచిత మందులను అందించి వెళ్లేటప్పుడు బాట ఖర్చులను అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా అనేక మంది కాన్పులు కోసం జీజీహెచ్‌కు వస్తున్నారు. కానీ ఇక్కడి సిబ్బంది ప్రభుత్వ లక్ష్యాన్ని తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తున్నారు. వార్డులో గర్భిణి అడ్మిట్ అయిన దగ్గరి నుంచి వసూళ్ల పర్వం మొదలవుతోంది. సిబ్బంది అడిగినంత ఇవ్వకపోతే వారినుంచి ఈసడింపులు, వేధింపులను భరించాల్సి వస్తోందని వాపోతున్నారు. పేరుకే ప్రభుత్వ ఆస్పత్రి కానీ కాన్పు జరిగి ఇంటికి వెళ్లే వరకు సుమారు. రూ.4 వేల వరకు ఖర్చవుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వసూళ్ల పర్వాన్ని అరికట్టాలని కోరుతున్నారు. ఈ విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లచ్చూని వివరణ కోరడానికి ఫోన్లో ప్రయత్నించగా లిఫ్ట్ చేయలేదు. మందులూ బయటి నుంచే.. మాతాశిశు ఆరోగ్య కేంద్రంలోని కాన్పుల కోసం వచ్చే వారికి బయటి నుంచే కొన్ని మందులు కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రక్త పరీక్షల దగ్గరినుంచి కాన్పు జరిగే వరకు సిరంజీలు, సెలెన్ బాటిళ్లు, ఇతర మందులు బయట కొనుగోలు చేయిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే మందులు అందుబాటులో లేవని సమాధానం చెపుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితిలో మందులు అందుబాటులో లేనప్పుడే.. బయటికి రాస్తున్నామని వైద్యులు పేర్కొంటున్నారు. 550 పడకల స్థాయి మెడికల్ కళాశాల అనుబంధంగా పనిచేస్తున్న జనరల్ ఆస్పత్రిలో మందుల కొరతను లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. మందులు బయట కొనమని రాసిచ్చారు మందులు అందుబాటులో లేవని చెప్పి బయట కొనుక్కొని తీసుకురమ్మని చెప్పారు. చేసేది లేక బయట డబ్బులు పెట్టి మందులు కొన్నాను. పేరుకే ప్రభుత్వ ఆస్పత్రి కానీ మందులు కూడా ఇవ్వడం లేదు. బయటికి రాస్తున్నారు. – మంగమ్మ , బోడంగిపర్తి -
మారిన మందు.. బాలుడికి అస్వస్థత
పుత్తూరు రూరల్: స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ఆదివారం ఉదయం జరిగిన ఘటన డాక్టర్లకు చెమటలు పట్టించింది. స్థానిక గేటు పుత్తూరులోని శెంగుంధర్ వీధికి చెందిన రాజ్‌కుమార్.. జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఐదేళ్ల తన కుమారుడు రోహిత్‌ను స్థానిక ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్లకు చూపించాడు. పరీక్షించిన డాక్టర్ సిరప్ రాసిచ్చాడు. తర్వాత చీటీ చూపించి మందు తీసుకెళ్లి 5 ఎంఎల్ తాగించాడు. కొద్ది సేపటికి రోహిత్ కడుపులో మంటగా ఉందని చెప్పడంతో, సిరప్‌ను పరిశీలించి అది ల్యాన్‌డన్ లోషన్‌గా గుర్తించాడు. వెంటనే రోహిత్‌ను ఆస్పత్రికి తీసుకొచ్చాడు. డాక్టర్ శంకర్‌నారాయణ పరీక్షించి కడుపులోని మందును వామ్టింగ్ చేయించడంతో పాటు తగిన చికిత్స అందించడంతో నిమిషాల్లోనే కోలుకొన్నాడు. మందు మారడానికి కారణాన్ని అన్వేషించగా.. ఫార్మసిస్ట్ సెలవులో ఉండటంతో సెక్యూరిటీ గార్డ్ (అవుట్ సోర్సింగ్)గా పనిచేస్తున్న వసంత్ మందును మార్చి ఇచ్చాడని గుర్తించారు. ఆ తర్వాత అతన్ని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జరినా సెక్యూరిటీ గార్డ్ వసంత్‌ను తొలగించారు. రోహిత్‌ను మెరుగైన పరీక్షల నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. మందు మార్చి ఇచ్చిన వసంత్ అనే వ్యక్తి తప్పిదం వల్ల మా బాబు ఇబ్బంది పడ్డాడు గానీ ఇందులో డాక్టర్ల తప్పిదమేమీ లేదని బాలుడి తండ్రి రాజ్‌కుమార్ చెప్పారు. విచారణ జరిపిన ఇన్చార్జి డీసీహెచ్ఎస్ పుత్తూరు రూరల్ః పుత్తూరు ప్రభుత్వ మందు మార్పు–బాలుడి అస్వస్థతపై తిరుపతి డీసీహెచ్ఎస్ వేదసాయి విచారణ చేశారు. ఆదివారం రాత్రి ఆమె పుత్తూరు ఆసుపత్రికి వచ్చి జరిగిన సంఘటపై పూర్తి వివరాలు సేకరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తిరుపతి రుయాలో చికిత్స పొందుతున్న రోహిత్ ఆరోగ్య పరిస్థితి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. సిరప్‌ను ఇచ్చిన అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ గార్డ్ వసంత్‌ను విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. జరిగిన మొత్తం సంఘటనపై సంజాయిషీ ఇవ్వాల్సిందిగా సూపరింటెండెంట్ డాక్టర్ జరినాకు మెమో ఇచ్చినట్లు తెలిపారు. -
మహిళా రోగిపై అసభ్యకర ప్రవర్తన
సాక్షి, చీపురుపల్లి(విజయనగరం) : అసలే ఆమె మూగ.. ఆ పైన ఆరోగ్యం బాగో లేకపోవడంతో స్థానిక ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేరింది. అక్కడ వైద్యం తీసుకుంటున్న తరుణంలో ఆస్పత్రి పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతలు చూసుకోవాల్సిన శానిటరీ సూపర్వైజర్ కన్ను వార్డులో ఒంటరిగా ఉన్న ఆమెపై పడింది. దీంతో మూగ మహిళపై అసభ్యకర ప్రవర్తనకు దిగాడు. ఇంతలో పక్క వార్డులో ఉన్న మరో మహిళ వచ్చి గోల చేయడంతో అక్కడి నుంచి పలాయనం చిత్తగించాడు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు శానిటరీ సూపర్వైజర్పై చీపురుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిపై 364, 509 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సీఐ సీహెచ్ రాజులునాయుడు , ఎస్సై ఐ.దుర్గాప్రసాద్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. డలంలోని పేరిపి గ్రామానికి చెందిన ఓ మూగ మహిళా రోగి వాంతులు, విరేచనాలతో బాధపడుతూ ఈ నెల 30న చీపురుపల్లి సీహెచ్‌సీలో చేరారు. దీంతో సిబ్బంది ఆమెకు వైద్యం అందిస్తున్నారు. అయితే మంగళవారం రాత్రి పై అంతస్తు వార్డులో ఉన్న మహిళా మూగ రోగి తల్లి మందులు తెచ్చుకునేందుకు ఫార్మసీకు వెళ్లింది. ఆ సమయంలో ఆ వార్డులోకి ప్రవేశించిన శానిటరీ సూపర్వైజర్ రామచంద్రరరావు అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో మహిళా రోగిపై అసభ్యకర ప్రవర్తనకు దిగాడు. దీంతో పక్కవార్డులో ఉన్న పోలమ్మ అనే మహిళ వచ్చి గోల చేసేసరికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అక్కడకు చేరుకున్న మూగ మహిళా రోగి తల్లి ఉప్పాడ ఎల్లమ్మకు మిగిలిన రోగులు వివరించారు. దీంతో బుధవారం ఉదయం ఎల్లమ్మ తన కుమార్తెకు జరిగిన అన్యాయం వివరిస్తూ శానిటరీ సూపర్వైజర్ రామచంద్రరావుపై చీపురుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్ఐ దుర్గాప్రసాద్ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి అక్కడ బాధితురాలు నుంచి పలు వివరాలు రాబట్టి, మిగిలిన రోగులతో విచారణ జరిపిన అనంతరం 364, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
కాన్పు చేయలేక పీహెచ్సీ నుంచి గర్భిణి గెంటివేత
వెల్దుర్తి(తూప్రాన్): ప్రసవం కోసం వచ్చిన ఓ గిరిజన మహిళకు వైద్యం చేయడానికి ఇబ్బందిగా ఉందంటూ అర్ధరాత్రి దాటాక పీహెచ్సీ సిబ్బంది చేతులెత్తేశారు. దీంతో చేసేదేమీలేక గర్భిణిని తోడుగా వచ్చిన ఇద్దరు మహిళలు తమ భుజాలపై ఆమెను మోసుకుని బస్టాండ్ వైపు తీసుకెళ్లారు. అదే సమయంలో గణేష్ శోభాయాత్ర నిర్వహిస్తున్న స్థానిక యువకులు గమనించి గర్భిణిని మొదట స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం 108కు సమాచారం అందించి మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సభ్యసమాజం తలదించునేలా జరిగిన ఈ ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మండలంలోని ఉప్పులింగాపూర్ పంచాయతీ పరిధిలోని గిరిజనతండాకు చెందిన లాలావత్ జ్యోతిని కుటుంబ సభ్యులు కాన్పుకోసం ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో వెల్దుర్తిలోని ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రికి తీసుకువచ్చారు. రాత్రి పురిటి నొప్పులు అధికమవడంతో స్టాఫ్‌నర్స్ కవిత కాన్పు చేయడానికి ప్రయత్నించింది. రాత్రి 12 గంటల వరకూ ప్రసవం కాకపోవడంతో ఇక్కడి నుండి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సిబ్బంది, గర్భిణి కుటుంబీకులకు తెలిపారు. అయితే అం త రాత్రి సమయంలో ఎక్కడికి Ððవెళ్లాలని, మీరే ఎలాగైనా కాన్పు చేయండని వేడుకున్నా బలవంతంగా బయటకు పంపించారంటూ బాధిత మహిళ కుటుంబసభ్యులు తెలిపారు. విచారణ చేపట్టిన అధికారులు.. గర్భిణిని బయటకు గెంటివేసిన ఘటనపై జిల్లా వైద్యాధికారులు స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి నివేదిక అందించాలన్న జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు ఆదేశాల మేరకు నార్సింగి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు, వెల్దుర్తి ఆస్పత్రి ఇన్చార్జి మురళీధర్ సోమ వారం వెల్దుర్తి పీహెచ్‌సీని సందర్శించారు. ఘటనకు సంబంధించి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గర్భిణులను అత్యవసర పరిస్థితుల్లో వేరే ఆస్పత్రికి తరలించే బాధ్యత సిబ్బందిపైనే ఉంటుందని ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు కూడా పీహెచ్సీ వైద్యుడు రాకపోవడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, 108 వాహనంలో మెదక్ ఆస్పత్రిలో సోమవారం ఉదయం 3 గంటల సమయంలో ప్రసవం అయింది. ప్రస్తుతం తల్లి, శిశువు ఆరోగ్యంగా ఉన్నారు. -
నాలుగురోజులుగా ప్రసవ వేదన
జమ్మికుంట(హుజూరాబాద్): ప్రసవం కోసం వచ్చిన గర్భిణికి నాలుగు రోజులుగా నరకం చూపించారు జమ్మికుంట సర్కార్ దవాఖానా వైద్యులు. సాధారణ ప్రసవం కోసం అంటూ చెప్పి ఇబ్బందులకు గురిచేశారు. అంతేకాకుండా రక్తపరీక్షలు చేసి బ్లడ్ గ్రూప్ తప్పుగా రిపోర్టు ఇచ్చారు. అనుమానం వచ్చి ప్రైవేట్ డయాగ్నోసిస్‌లో మళ్లీ పరీక్షలు చేస్తే అసలు విషయం తెలిసింది. దీంతో గర్భిణి భర్త వైద్యుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. జమ్మికుంట మండలం పెద్దంపల్లికి చెందిన మోతె సుధాకర్–సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు. సుజాత గర్భం దాల్చడంతో జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రతి నెల వైద్యసేవలు పొందుతున్నారు. ప్రసవానికి ఈనెల 22న జమ్మికుంట ప్రభుత్వాస్పత్రిలో చేరింది. సుజాతను పరీక్షించిన అనంతరం రక్తం తక్కువగా ఉందంటూ సూచించారు. ఆస్పత్రి ల్యాబ్‌లో రక్తపరీక్షలు చేసి ‘ఓ పాజిటివ్’ గ్రూప్‌గా రిపోర్టు ఇచ్చారు. ఆమె భర్త సుధాకర్ రిపోర్టుతో హన్మకొండలోని రెడ్‌క్రాస్ బ్లడ్‌బ్యాంక్‌కు వెళ్లాడు. రిపోర్టు చూసిన ల్యాబ్ నిర్వాహకులు వెంట తీసుకెళ్లిన శాంపిల్బ్లడ్తో పరీక్షలు చేయగా గ్రూప్వేరేగా వచ్చింది. మళ్లీ పరీక్ష చేయించుకొని రమ్మనడంతో అనుమానం వచ్చిన సుధాకర్ జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లో రక్త పరీక్ష నిర్వహించాడు. అక్కడ అసలు విషయం బయటపడింది. సుజాత బ్లడ్ గ్రూపు ‘బీ పాజిటివ్’ అని తేలింది. అంతేకాకుండా నాలుగు రోజులుగా సాధారణ ప్రసవం అవుతుందంటూ చెప్పిన వైద్యులు తీర ఆదివారం హన్మకొండకు తీసుకెళ్లాలని సూచించారు. ఆగ్రహించిన సుధాకర్ తన భార్యకు ఇక్కడే ప్రసవం చేయాలని, పరిస్థితి విషమించాక తీసుకెళ్లాలంటే ఎట్లా..? అని ప్రశ్నించాడు. ఈ విషయం తెలుసుకున్న యువజన కాంగ్రెస్ నాయకులు సాయిని రవి ఆస్పత్రికి చేరుకొని వైద్యులను సస్పెండ్ చేయాలంటూ ధర్నాకు దిగారు. మంత్రి ఈటల రాజేందర్ స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గర్భిణిని అంబులెన్స్‌లో హన్మకొండకు తరలించారు. -
ప్రసవం కోసం వచ్చిన గర్భిణీ బయటకు గెంటివేత
కరీంనగర్: మన రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒక ఆస్పత్రిలో రోగుల కేస్ షీట్లు మారిపోతుంటే, మరో ఆస్పత్రిలో గర్భిణీలను బయటకు గెంటివేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి ఈ నెల 15 రాత్రి 10 గంటల సమయంలో 108 అంబులెన్స్‌లలో కామారెడ్డి పట్టణానికి చెందిన సీహెచ్ రాధ అనే గర్భిణిని తీసుకు వచ్చారు. భిక్నూర్ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామ పరిధిలోని, అయ్యవారి పల్లి గ్రామానికి చెందిన వరాల్ల రేణుక పురిటి నొప్పులతో వచ్చింది. వీరిని చూసిన వెంటనే నర్సులు ఇక్కడ మత్తు మందు డాక్టర్ లేరు, నిజామాబాద్ ఆస్పత్రికి రాసిస్తాం అక్కడికి వెళ్లండని చెప్పారు. గర్భిణుల భర్తలు సతీష్, బాల్‌రాజు, బంధువులు కలిసి నర్సులను గట్టిగా నిలదీశారు. దాంతో వారందరిని బయటకు గెంటి వేశారు. చేసేదేమి లేక రాధను బంధువులు ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. రేణుకు మా త్రం అక్కడి నుంచి వెళ్లక పోవడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చుకున్నారు. రెండు రోజుల క్రితం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకే పేరు కలిగిన ఇద్దరు మహిళా రోగుల కేస్‌షీట్లు మారిపోయాయి. గోకవరానికి చెందిన మాదిరెడ్డి సత్యవతి అనే మహిళ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరింది. వేట్లపాలేనికి చెందిన మాదాసు సత్యవతి మూడురోజుల కిందట జ్వరంతో బాధపడుతూ చేరింది. వైద్య పరీక్షల సమయంలో సిబ్బంది మాదిరెడ్డి సత్యవతి కేస్‌షీట్‌ను మాదాసు సత్యవతికి ఇచ్చారు. ఈ విషయాన్ని గుర్తించని రాత్రి డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్ ఒకరికి చేయాల్సిన ఇంజెక్షన్ మరొకరికి చేశారు. ఫలితంగా వైద్యం వికటించి మాదాసు సత్యవతి మరణించిందని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈరోజు కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ప్రభుత్వాస్పత్రి సిబ్బంది ఓ గర్భిణీని బయటకు గెంటివేసింది. ప్రసవం కోసం ఒక గర్భిణీని బంధువులు ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆమెను ఆస్పత్రి సిబ్బంది బయటకు గెంటివేయడంతో బంధువులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఆస్పత్రులలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా పట్టించుకునే నాధుడు లేకపోవడం వల్ల, దురుసుగా ప్రవర్తించినవారిపై చర్యలు తీసుకునేవారు లేనందున రోజురోజుకు సిబ్బంది అరాచక చర్యలు పెగిరిపోతున్నాయని రోగులు, బంధువులు వాపోతున్నారు.