ప్రసవం కోసం వచ్చిన గర్భిణీ బయటకు గెంటివేత
కరీంనగర్: మన రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒక ఆస్పత్రిలో రోగుల కేస్ షీట్లు మారిపోతుంటే, మరో ఆస్పత్రిలో గర్భిణీలను బయటకు గెంటివేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి ఈ నెల 15 రాత్రి 10 గంటల సమయంలో 108 అంబులెన్స్‌లలో కామారెడ్డి పట్టణానికి చెందిన సీహెచ్ రాధ అనే గర్భిణిని తీసుకు వచ్చారు. భిక్‌నూర్ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామ పరిధిలోని, అయ్యవారి పల్లి గ్రామానికి చెందిన వరాల్ల రేణుక పురిటి నొప్పులతో వచ్చింది. వీరిని చూసిన వెంటనే నర్సులు ఇక్కడ మత్తు మందు డాక్టర్ లేరు, నిజామాబాద్ ఆస్పత్రికి రాసిస్తాం అక్కడికి వెళ్లండని చెప్పారు. గర్భిణుల భర్తలు సతీష్, బాల్‌రాజు, బంధువులు కలిసి నర్సులను గట్టిగా నిలదీశారు. దాంతో వారందరిని బయటకు గెంటి వేశారు. చేసేదేమి లేక రాధను బంధువులు ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. రేణుకు మా త్రం అక్కడి నుంచి వెళ్లక పోవడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చుకున్నారు.
రెండు రోజుల క్రితం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకే పేరు కలిగిన ఇద్దరు మహిళా రోగుల కేస్‌షీట్లు మారిపోయాయి. గోకవరానికి చెందిన మాదిరెడ్డి సత్యవతి అనే మహిళ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరింది. వేట్లపాలేనికి చెందిన మాదాసు సత్యవతి మూడురోజుల కిందట జ్వరంతో బాధపడుతూ చేరింది. వైద్య పరీక్షల సమయంలో సిబ్బంది మాదిరెడ్డి సత్యవతి కేస్‌షీట్‌ను మాదాసు సత్యవతికి ఇచ్చారు. ఈ విషయాన్ని గుర్తించని రాత్రి డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్ ఒకరికి చేయాల్సిన ఇంజెక్షన్ మరొకరికి చేశారు. ఫలితంగా వైద్యం వికటించి మాదాసు సత్యవతి మరణించిందని బంధువులు ఆరోపిస్తున్నారు.
ఈరోజు కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ప్రభుత్వాస్పత్రి సిబ్బంది ఓ గర్భిణీని బయటకు గెంటివేసింది. ప్రసవం కోసం ఒక గర్భిణీని బంధువులు ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆమెను ఆస్పత్రి సిబ్బంది బయటకు గెంటివేయడంతో బంధువులు ఆందోళనకు దిగారు.
ప్రభుత్వ ఆస్పత్రులలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా పట్టించుకునే నాధుడు లేకపోవడం వల్ల, దురుసుగా ప్రవర్తించినవారిపై చర్యలు తీసుకునేవారు లేనందున రోజురోజుకు సిబ్బంది అరాచక చర్యలు పెగిరిపోతున్నాయని రోగులు, బంధువులు వాపోతున్నారు.