కృష్ణాజలాల పనులను పూర్తి చేయాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలోని 959 పాఠశాలల్లో శుద్ధిచేసిన కృష్ణజలాల పనులు యుద్ధప్రాతిపదికపై పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎన్.ముక్తేశ్వరరావు కోరారు. కలెక్టర్ సోమవారం అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో బోరు నీటితో మధ్యాహ్న భోజనం వండుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని, వెంటనే ఆకస్మిక తనిఖీలు జరిపి తగు చర్యలు తీసుకుంటామన్నారు.
కుదాభక్షపల్లి గ్రామంలో నీరులేదనే కారణంతో నెల రోజులుగా మధ్యాహ్న భోజనం వండకపోవడంపై సంబంధిత ఎంఈఓకు చార్జీ మెమో జారీ చేయాలని డీఈఓను ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకం అమలుపై పాఠశాలలను తనిఖీ చేయాలని డీఈఓను కోరారు. ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులకు మెడికల్ కిట్లు, ఫిజియోథెరఫి పరికరాలు సరఫరాలో జాప్యం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రత్యేక ఆఫీసర్లందరూ తమ మండలంలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని నూరుశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేయాలని కోరారు. బాలిక సంరక్షణ యోజన పథకం కింద తయారైన బాండ్లు వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సూచించారు.
ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలపై ప్రజల హృదయాలకు హత్తుకుపోయేలా కలెక్టర్ క్యాంపు ఆఫీసు ప్రహరీగోడపై వాల్ రైటింగ్ చేపట్టాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను కోరారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వివిధ శాఖలు శకటాలను ప్రదర్శించాలని, స్టాల్స్ ఏర్పాటు చేసి లబ్ధిదారులకు రుణాలు, ఆస్తులు పంపిణీకై చర్యలు తీసుకోవాలని కోరారు. మెరిట్ సర్టిఫికెట్ల విషయంలో సిబ్బంది సేవలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ శాఖలు రూపొందించిన పథకాలను కలెక్టర్ పరిశీలించి ఎంపిక చేశారు. ఈ సమావేశంలో జేసీ హరిజవహర్‌లాల్, అదనపు జేసీ నీలకంఠం, డ్వామా పీడీ కోటేశ్వర్రావు, డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, డీఆర్ఓ అంజయ్య, జెడ్పీ సీఈఓ వెంకట్రావ్ పాల్గొన్నారు.