వ్యవసాయ పరికరాలకు రాజకీయ గ్రహణం!
రైతులకు ప్రభుత్వ అందిస్తున్న రాయితీ పథకాలకు రాజకీయ గ్రహణం పట్టింది. టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు తమ కార్యకర్తలకే వీటిని ఇవ్వాలని అడ్డుచక్రం వేస్తుండటంతో వ్యవసాయ పరికరాలు కార్యాలయాలు దాటి బయటకు రావడం లేదు. వాటా సొమ్ము చెల్లించి నెలలు గడిచిపోతున్నా.. పంట సీజను దాటిపోతున్నా.. సమయానికి పరికరాలు అందక రైతులు లబోదిబోమంటున్నారు.
పూండి: వాటర్‌షెడ్ పథకం అమలవుతున్న గ్రామాల్లో రైతులకు రాయితీ ధరలపై వ్యవసాయ పరికరాలు పంపిణీని పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ మోకాలడ్డుతున్నారు. ఐడబ్ల్యూఎంపీ పథకం కింద గత కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన పరికరాలను ప్రస్తుత అధికార పార్టీ ఎమ్మెల్యే తమ కార్యకర్తలకు ఇప్పించుకోవడానికే పంపిణీని అడ్డుకుంటున్నారు. దీంతో ఏం చేయాలో అర్థంకాక అధికారులు తమకు అందిన పరికరాలను కార్యాలయంలోనే ఉంచేశారు. గత ఆరు నెలలుగా వీటికి మోక్షం లభించడం లేదు. డబ్బులు కట్టిన రైతుల అవసరాలు తీరడం లేదు.
విషయమేంటంటే..
పలాస నియోజకవర్గంలో వాటర్‌షెడ్ అమలవుతున్న గ్రామాలకు చెందిన 256 మంది రైతులకు రూ. 1.07 కోట్లతో 1256 పనిముట్లు మంజూరయ్యాయి. వీటికిగాను జిల్లా వాటర్‌షెడ్ (ఐడబ్ల్యూఎంపీ) నుంచి రూ. 32.05 లక్షలు, వ్యవసాయశాఖ నుంచి రూ. 46.68 లక్షలు కేటాయించగా.. పరికరాలు కావలసిన రైతులు తమ వాటాగా రూ. 28.54 లక్షలు చెల్లించాలని నిర్దేశించారు. మంజూరైన పరికరాల్లో ఆయిల్ ఇంజన్లు, టార్ఫాలిన్లు, రొటోవేటర్లు, కోత యంత్రాలు, ఫుట్ స్ప్రేయర్లు, పవర్ స్ప్రేయర్లు, హ్యాండ్స్ప్రేయర్లు, నీటి పంపిణీ పైపులు, పవర్ టిల్లర్లు, దమ్ము యంత్రాలు, లెవలింగ్ ప్లేట్లు ఉన్నాయి. ఆరు నెలల క్రితమే పరికరాలన్నీ నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరు, మందస, పలాస మండలాల వ్యవసాయ కార్యాలయాలకు చేరాయి.
రైతులు తమకు అవసరమైన పరికరాల కోసం వాటా సొమ్ము కూడా చెల్లించారు. ఈలోగా సార్వత్రిక ఎన్నికల ప్రకటన వెలువడింది. కోడ్ అమల్లోకి వచ్చింది. దాంతో పరికరాల పంపిణీ నిలిచిపోయింది. అనంతరం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గతంలో మంజూరైన పరికరాలు పంపిణీ చేస్తారని రైతులు ఆశించారు. అయితే వారి ఆశలను వమ్ము చేస్తూ కార్యకర్త నుంచి ఎమ్మెల్యే వరకు వ్యవసాయశాఖపై ఒత్తిళ్లు మొదలయ్యాయి. పాత జాబితాలు రద్దు చేసి తాము సూచించిన వారి పేర్లతో కొత్త జాబితాలు రూపొందించాలని స్థానిక ఎమ్మెల్యే ఆదేశించడంతో వ్యవసాయాధికారులు నివ్వెరపోయారు. అదే జరిగితే రైతుల ఆగ్రహానికి గురికావలసి వస్తుందన్న ఉద్దేశంతో నేతలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.
సమీక్షా సమావేశంలోనూ పరిస్థితి వివరించారు. అయినా ఎమ్మెల్యే వినకపోవడంతో అధికారులు ఇరకాటంలో పడ్డారు. ఇటు డబ్బులు కట్టిన రైతులు రోజూ వచ్చి అడుగుతున్నారు. పరికరాలు సమయానికి అందక తాము నష్టపోతున్నామని, చివరికి అవి తమకు అందకుండా పక్కదారి పడతాయేమోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై పలాస వ్యవసాయశాఖ ఏడీ వెంకటేశ్వరరావును వివరణ కోరగా పంపిణీలో జాప్యం జరిగిందని అంగీకరించారు. ఎమ్మెల్యే శివాజీతో మాట్లాడామని, ఆయన నిర్ణయం మీదే వీటి పంపిణీ ఆధారపడి ఉంటుందని చెప్పారు.
సమయానికి అందలేదు
ఈయన పేరు హనుమంతు ముకుందరావు, ఇతనిది వజ్రపుకొత్తూరు మండలం బెండి గ్రామం. ఆరు నెలల క్రితం 4హెచ్‌పీ ఆయిల్ ఇంజన్ కోసం రూ. 4,700, ఫవర్ స్ప్రేయర్ కోసం రూ. 3,500 వ్యవసాయాధికారులకు చెల్లించారు. పరికరాలు కూడా మంజూరయ్యాయి. అయితే నేటి వరకు పరికారాలు పంపిణీ కాలేదు.నాయకుల ఒత్తిడి వల్లే పంపిణీ చేయలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నందున బెండిగెడ్డ నుంచి నీరు తోడుకునేందుకు పంపుసెట్లు అవసరమని, అయితే సమయానికి అవి అందలేదని వాపోయారు.
రోజూ తిరుగుతున్నా..
ఇతని పేరు దాసరి భీమయ్య. వజ్రపుకొత్తూరు మండలం బెండి గ్రామానికి చెందిన రైతు. దమ్ములో ట్రాక్టర్ లెవలింగ్ బ్లేడు కోసం రూ. 2,700 రైతు వాటాగా చెల్లించాడు. ఖరీఫ్ దమ్ముల సమయంలో తనకెంతో ఉపయోగపడుతుందని భావించారు. పంపిణీ చేయాలని కోరినా ఫలితం లేకపోయింది. ప్రతి రోజు కార్యాలయాల చుట్టూ తిరగడమే మిగిలిందని వాపోతున్నారు. రాజకీయాలతో పంపిణీని అడ్డుకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. సకాలంలో యంత్రాలు పంపిణీ చేయాల్సింది పోయి. అడ్డుకోవడానికి పూనుకోవడం నాయకులకు తగదని అన్నారు.