government treasery
-
‘బోగస్’ పంతుళ్లపై కొరడా
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : బోగస్ మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. నకిలీ బిల్లులు సమర్పించి ప్రభుత్వ నిధులు కాజేసిన ఉపాధ్యాయులపై కొరడా ఝళిపించేందుకు విద్యశాఖ సిద్ధమైంది. అక్రమంగా బిల్లులు పొందిన ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పాఠశాల విద్యశాఖ కమిషనరేట్ నుంచి జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశాలు అందాయి. రెండు రోజుల్లో క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. అక్రమాలు ఇలా.. 2010లో జిల్లాలోని ఉపాధ్యాయులు నకిలీ మెడికల్ బిల్లులు సమర్పించి నిధులు స్వాహా చేశారు. ఈ వ్యవహారం బయటకి పొక్కడంతో విద్యాశాఖ విచారణ చేపట్టి మొదటి విడత 62 మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత రెండో విడత ఎనిమిది మంది సస్పెండ్ అయ్యారు. దీంతో అక్రమాలకు పాల్పడ్డ మిగతా ఉపాధ్యాయులు ఆందోళనకు గురై మెడికల్ బిల్లులు ప్రభుత్వ ఖజానాకు జమచేశారు. కొందరిపై ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఈ వ్యవహారాన్ని ఆరు నెలల క్రితం ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి అప్పగించింది. ఫిబ్రవరిలో విచారణ ప్రారంభించిన విజిలెన్స్ అధికారులు విచారణ అనంతరం ప్రభుత్వానికి అక్రమంగా బిల్లులు పొందిన ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పాఠశాల విద్యశాఖ కమిషనర్‌కు విన్నవించింది. దీంతో పాఠశాల విద్యాశాఖ జిల్లా విద్యాశాఖ అధికారులకు కేసులు నమోదు చేయాలని ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. 92 మంది ఉపాధ్యాయులపై కేసులు! జిల్లాలో అక్రమంగా మెడికల్ బిల్లులు పొందిన 92 మంది ఉపాధ్యాయులు, గతంలో పనిచేసిన ముథోల్, జైనూర్, నార్నూర్, నిర్మల్ ఎంఈవోలపై కేసులు నమోదు చేయాలని ఆయా మండలాల పోలీస్స్టేషన్లకు ఉత్తర్వులు జారీ చేసేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. మొత్తం రూ.1.80 కోట్లు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినట్లు కేసు నమోదు చేయనున్నారు. అరెస్టు అయిన 48 గం టల తర్వాత ఆ ఉపాధ్యాయులను విద్యాశాఖ స స్పెండ్ చేయనుంది. పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల సంఖ్య 74/సి/1934, జిల్లా విద్యాశాఖ బి2/ 4890/2010 తేదిః 22.09.2013 విడుదల చేసినట్లు సమాచారం. ఒక్కో ఉపాధ్యాయుడు రూ.66 వేలు, మరికొందరు రూ. 95 వేలు, ఇంకొందరు రూ.1.50 లక్షల వరకు అక్రమంగా పొందారు. ఈ విషయం అక్రమాలకు పాల్పడిన టీచర్లకు తెలియడంతో వారిలో ఆందోళన మొదలైంది. కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. -
ఇందిరమ్మ ఇల్లు అమ్మబడును
కాగజ్‌నగర్, న్యూస్‌లైన్ : ‘నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తాం..’ ఇదీ ప్రభుత్వ నినాదం.. కానీ, ‘ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించండి లేదా అమ్ముకోవడానికి అనుమతివ్వండి’ అని లబ్ధిదారుడు రోడ్డెక్కాడు..! ఇదేమి చోద్యం అనుకుంటున్నారా.. ఇదీ పచ్చినిజం..! ప్రభుత్వం నిధులు మంజూరు చేయక, అధికారులు డబ్బులు చెల్లించకపోవంతో ఓ లబ్ధిదారులు ఇందిరమ్మ ఇల్లునే అమ్మకానికి పెట్టాడు. ఈ సంఘటన కాగజ్‌నగర్ డివిజన్లో చోటు చేసుకుంది. బెజ్జూర్ మండలం బొంబాయిగూడకు చెందిన పగిడాల భువనేశ్వర్‌కు 2007లో రెండో విడతలతో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అధికారులు రూ.28,500 ఇస్తానని చెప్పారు. ఇంటి నిర్మాణం కోసం అధికారులు 30 బస్తాల సిమెంట్, రూ.11 వేలు ఇంటి నిర్మాణం కోసం అధికారులు మంజూరు చేశారు. మిగతా డబ్బులు ఆరేళ్లు గడిచినా ఇవ్వడం లేదు. ఇంటి నిర్మాణం కోసం ప్రైవేలుగా రూ.30 వేలు అప్పు తీసుకొచ్చాడు. మండలంలోని గృహనిర్మాణ శాఖ అధికారులను అడిగితే రేపుమాపూ అంటు తిప్పించుకుంటున్నారు. ఇల్లు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఇందిరమ్మ ఇల్లును అమ్మకానికి బెట్టాడు. బిల్లులు చెల్లించక పోవడాన్ని నిరసిస్తూ గురువారం కాగజ్‌నగర్‌లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఫ్టెక్సీతో బైఠాయించాడు. దాదాపు అరగంటపాటు రోడ్డుపై బైఠాయిచడంతో కాగజ్‌నగర్ పట్టణ గృహ నిర్మాణ శాఖ ఏ సంజీవ్‌నాయక్ సంఘటన స్థలానికి చేరుకుని బాధితుడిని వివరాలు అడిగి తెలుసుకున్నాడు. గురువారం సెలవుదినం కావడంతో శుక్రవారం కార్యాలయానికి వస్తే రికార్డులు పరిశీలించి పెండింగ్‌లో ఉన్న బిల్లు ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో బైఠాయింపును విరమించాడు. బిల్లులు ఇవ్వం మీ దిక్కున్నచోట చెప్పుకో అంటున్నారు.. - పడిడాల భువనేశ్వర్, బాధితుడు ఇందిరమ్మ ఇంటి బిల్లుల కోసం అధికారుల చుట్టూ తిరిగినా స్పందించడం లేదు. బిల్లులు ఇవ్వం నీ దిక్కున్నచోట చెప్పుకో. గత వర్షాలతో చాలా నష్టపోయాను. ఇంటి కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేదు. అందుకే ఇంటిని అమ్మాలని నిర్ణయించాను. అధికారులు ఇప్పటికైనా బిల్లులు చెల్లించాలి. అన్ని బిల్లులు చెల్లించాం - సజీయోద్దిన్, ఇన్చార్జి హౌసింగ్ ఏఈ, బెజ్జూర్ ఇందిరమ్మ రెండవ విడతలో ఇల్లు మంజూరైన విషయం వాస్తవమే. ఇంటి నిర్మాణానికి చెల్లించాల్సిన బిల్లులన్నీ చెల్లించాం. ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేవు.