ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ :
బోగస్ మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లుల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. నకిలీ బిల్లులు సమర్పించి ప్రభుత్వ నిధులు కాజేసిన ఉపాధ్యాయులపై కొరడా ఝళిపించేందుకు విద్యశాఖ సిద్ధమైంది. అక్రమంగా బిల్లులు పొందిన ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పాఠశాల విద్యశాఖ కమిషనరేట్ నుంచి జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశాలు అందాయి. రెండు రోజుల్లో క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.
అక్రమాలు ఇలా..
2010లో జిల్లాలోని ఉపాధ్యాయులు నకిలీ మెడికల్ బిల్లులు సమర్పించి నిధులు స్వాహా చేశారు. ఈ వ్యవహారం బయటకి పొక్కడంతో విద్యాశాఖ విచారణ చేపట్టి మొదటి విడత 62 మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత రెండో విడత ఎనిమిది మంది సస్పెండ్ అయ్యారు. దీంతో అక్రమాలకు పాల్పడ్డ మిగతా ఉపాధ్యాయులు ఆందోళనకు గురై మెడికల్ బిల్లులు ప్రభుత్వ ఖజానాకు జమచేశారు. కొందరిపై ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఈ వ్యవహారాన్ని ఆరు నెలల క్రితం ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి అప్పగించింది. ఫిబ్రవరిలో విచారణ ప్రారంభించిన విజిలెన్స్ అధికారులు విచారణ అనంతరం ప్రభుత్వానికి అక్రమంగా బిల్లులు పొందిన ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పాఠశాల విద్యశాఖ కమిషనర్‌కు విన్నవించింది. దీంతో పాఠశాల విద్యాశాఖ జిల్లా విద్యాశాఖ అధికారులకు కేసులు నమోదు చేయాలని ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
92 మంది ఉపాధ్యాయులపై కేసులు!
జిల్లాలో అక్రమంగా మెడికల్ బిల్లులు పొందిన 92 మంది ఉపాధ్యాయులు, గతంలో పనిచేసిన ముథోల్, జైనూర్, నార్నూర్, నిర్మల్ ఎంఈవోలపై కేసులు నమోదు చేయాలని ఆయా మండలాల పోలీస్‌స్టేషన్‌లకు ఉత్తర్వులు జారీ చేసేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. మొత్తం రూ.1.80 కోట్లు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినట్లు కేసు నమోదు చేయనున్నారు. అరెస్టు అయిన 48 గం టల తర్వాత ఆ ఉపాధ్యాయులను విద్యాశాఖ స స్పెండ్ చేయనుంది. పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల సంఖ్య 74/సి/1934, జిల్లా విద్యాశాఖ బి2/ 4890/2010 తేదిః 22.09.2013 విడుదల చేసినట్లు సమాచారం. ఒక్కో ఉపాధ్యాయుడు రూ.66 వేలు, మరికొందరు రూ. 95 వేలు, ఇంకొందరు రూ.1.50 లక్షల వరకు అక్రమంగా పొందారు. ఈ విషయం అక్రమాలకు పాల్పడిన టీచర్లకు తెలియడంతో వారిలో ఆందోళన మొదలైంది. కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
‘బోగస్’ పంతుళ్లపై కొరడా
Published Tue, Sep 24 2013 3:01 AM | Last Updated on Wed, Apr 3 2019 5:52 PM
Advertisement
Advertisement