సాక్షి, విశాఖపట్నం: భారీ సంఖ్యలో అయ్యోర్లకు షోకాజ్ నోటీసులు అందాయి. మూడ్రోజుల్లో సమాధానం చెప్పాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఈ నెల 23న బయోమెట్రిక్ వేయలేదన్న సాకుతో ఏకంగా 477 మంది ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి షోకాజ్ నోటీసులు జారీ చేయడం ఆ శాఖలో కలకలం రేపుతోంది.
జిల్లాలో 3224 ప్రాథమిక, 366 ప్రాథమికోన్నత, 515 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 4105 పాఠశాలలు ప్రభుత్వ, స్థానిక సంస్థల, ఎయిడెడ్ యాజమాన్యాల కింద పని చేస్తున్నాయి. వీటి పరిధిలో 6,21,965 మంది విద్యార్థులు చదువుతుండగా, 14,281 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో ఎస్‌జీటీలు 7261 మంది కాగా, స్కూల్ అసిస్టెంట్లు 7020 మంది ఉన్నారు. విశాఖ సిటీతో పాటు గ్రామీణ జిల్లా పరిధిలోని అన్ని పాఠశాలల్లోనూ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కూడా బయోమెట్రిక్ హాజరు పద్ధతి అమలు చేస్తున్నారు.
నెట్‌వర్క్ సమస్య కారణంగా ఏజెన్సీలోని పాఠశాలల్లో అమలు కావడం లేదు. బయోమెట్రిక్ హాజరు పద్ధతి విద్యార్థులతో పాటుæ ఉపాధ్యాయులకు ప్రాణసంకటంగా మారింది. అటెండెన్స్ వేసేందుకు రోజూ నరకం చూస్తున్నారు. ఎప్పుడు నెట్‌వర్కు పనిచేస్తుందో.. ఎప్పుడు పనిచేయదో తెలియని పరిస్థితి నెలకొంది. ఒక వేళ పనిచేసినా వేలి ముద్రలు పడతాయో లేదో? ఐరిష్ క్యాప్చర్ చేస్తుందో లేదో తెలియని దుస్థితి. ఒకే..అని వచ్చే వరకు ఒకటికి పదిసార్లు అటెండెన్స్ వేయాల్సిందే.
చర్చనీయాంశమైన విద్యాశాఖ తీరు
బయోమెట్రిక్ పడక ఈ నెల 23న విధులకు గైర్హాజరైన ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేరోజు 477 మంది ఉపాధ్యాయులు గైర్హాజరయ్యారని షోకాజ్ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. పాఠశాల విద్య శాఖ కమిషనర్ టెలిఫోన్‌లో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టుగా డీఈవో పేర్కొన్నారు. ఎందుకు గైర్హాజరయ్యారో అందుకు తగిన కారణాలతో మూడ్రోజుల్లో లిఖిత పూర్వకంగా సమాధానం చెప్పాలని ఆ ఉత్తర్వుల్లో ఉపాధ్యాయులను ఆదేశించారు. కనీసం మెమోలు కూడా ఇవ్వకుండా షోకాజ్ నోటీసులు ఇవ్వడమేమిటని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
నిత్యం మొరాయింపు
జిల్లాలో 60 శాతం బయోమెట్రిక్ మిషన్లు రోజూ మొరాయిస్తూనే ఉన్నాయి. ఎక్కువ మిషన్లు సాంకేతిక కారణాలతో పనిచేయడం లేదు. వీటికి మరమ్మతులు చేయిద్దామనుకున్నా సాంకేతిక నిపుణులు అందుబాటులో లేని పరిస్థితి. మిషన్ల నిర్వహణ అధ్వానంగా ఉన్నాయని ఎన్నిసార్లు మొత్తుకున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. మిషన్లు సరఫరా చేసిన కంపెనీలు వీటి వైపు కన్నెత్తి చూడడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. కనీసం స్థానికంగా ఒకరిద్దరు సాంకేతిక నిపుణులు ఉన్నప్పటికీ పని ఒత్తిడితో వారు సకాలంలో వీటిని మరమ్మతులు చేయలేకపోతున్నారు.
నగరమంతటికి మధురవాడలో ఒకే ఒక్క మెకానిక్ ఉన్నారు. ఆయన ఇంట్లో వందలాది మిషన్లు రిపేర్ కోసం ఎదురు చూస్తున్నాయి. పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే వీటిని చక్కదిద్దాల్సిన ఉన్నతాధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. మిషన్లు పూర్తి స్థాయిలో పనిచేయించడం, సాంకేతిక సమస్యలు రాకుండా నెట్‌వర్క్ కల్పించడం వంటి చర్యలు చేపట్టకుండా బయెమెట్రిక్ పడలేదన్న సాకుతో చర్యలకు ఉపక్రమించడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment