’భయో’త్పాతం | Ðfight aginast biometric attendance | Sakshi
Sakshi News home page

’భయో’త్పాతం

Published Fri, Feb 17 2017 11:03 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

’భయో’త్పాతం - Sakshi

’భయో’త్పాతం

ఉద్యోగులను వీధుల చుట్టూ తిప్పుతున్న బయోమెట్రిక్‌
 హాజరు నమోదు కోసం వెళుతూ ఉపాధ్యాయిని దుర్మరణం
 ఇది అధికారిక హత్య అంటున్న ఉపాధ్యాయ సంఘాలు
 ఆందోళన కార్యక్రమాలకు పిలుపు
 నేడు పెరవలిలో ఘటనా స్థలి వద్ద ధర్నా
 20న కలెక్టరేట్‌ ముట్టడి
ఏలూరు సిటీ :
బయో మెట్రిక్‌ హాజరు విధానం ఉపాధ్యాయుల్లో భయోత్పాతం సృష్టిస్తోంది. బయో మెట్రిక్‌ హాజరు నమోదు కోసం వెళ్లిన బి.రత్నకుమారి అనే ఉపాధ్యాయిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన ఉపాధ్యాయ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. పెరవలి మండల పరిషత్‌ పాఠశాలలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా పనిచేస్తున్న రత్నకుమారి గురువారం ఉదయం పాఠశాలలో విధులకు హాజరయ్యారు. అక్కడి బయోమెట్రిక్‌ హాజరు యంత్రం పనిచేయకపోవటంతో నరసాపురం రోడ్డులోని పాఠశాల నుంచి పంచాయతీ కార్యాలయానికి వెళ్ళారు. అక్కడ పంచాయతీ సెక్రటరీ లేకపోవటంతో జెడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్లగా.. ఇంటర్నెట్‌ సక్రమంగా పనిచేయలేదు. దీంతో హాజరు నమోదు కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. అక్కడా యంత్రం సక్రమంగా పనిచేయని కారణంగా తిరిగి జెడ్పీ ఉన్నత పాఠశాలకు నడుచుకుంటూ వెళుతున్న రత్నకుమారిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాల పాలైన ఆమెను తొలుత పెరవలి పీహెచ్‌సీకి.. అక్కడి నుంచి తణుకులోని ఆస్పత్రికి.. మెరుగైన వైద్యం కోసం భీమవరంలోని ఆస్పత్రికి తరలించారు. రత్నకుమారి అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. 55 ఏళ్ల వయసులో మహిళా ఉపాధ్యాయిని బయోమెట్రిక్‌ హాజరు నమోదు కోసం వీధుల వెంట తిరుగుతూ.. ప్రమాదానికి గురై మరణించటం ఉపాధ్యాయులను కలచివేస్తోంది. అధికారులు మౌలిక సౌకర్యాలు కల్పించకుండా.. ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుని ఉపాధ్యాయులను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
 బయో మెట్రిక్‌ కష్టాలు 
జిల్లాలోని ఉపాధ్యాయులకు బయోమెట్రిక్‌ రూపంలో కష్టాలు వచ్చిపడ్డాయి. సర్కారు బడుల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సకాలంలో విధులకు హాజరయ్యేలా చూడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే, అరకొర సౌకర్యాలతో ఈ విధానాన్ని అమలు చేస్తుండటం ఉపాధ్యాయుల పాలిట శాపంలా పరిణమించింది. ఉపాధ్యాయులంతా బయోమెట్రిక్‌ హాజరు వేసే విషయంలో మానసికంగా నలిగిపోతున్నారు. పాఠశాలలో బయోమెట్రిక్‌ యంత్రాలు ఏర్పాటు చేయకపోవటం, యంత్రం ఉన్నా ఇంటర్నెట్‌ కనెక్ట్‌ కాకపోవడం, ఇతర గ్రామాలు, పక్క మండలాలకు సైతం వెళ్లి హాజరు నమోదు చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ విధానంపై జిల్లాలోని ఉపాధ్యాయులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధానం కొనసాగితే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో 3,260 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. సుమారు 15వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరందరి కోసం 428 ఉన్నత పాఠశాలలు, 575 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, 50 మండల రిసోర్స్‌ కేంద్రాల్లో బయోమెట్రిక్‌ యంత్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్నెట్‌ సక్రమంగా పనిచేయకపోవటంతో హాజరు నమోదు విషయంలో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాము పనిచేస్తున్న పాఠశాలల్లోని బయోమెట్రిక్‌ యంత్రం పనిచేకపోతే సమీపంలోని గ్రామ పంచాయతీ, మండల అభివృద్ధి అధికారి కార్యాలయం లేదా పక్క గ్రామం, పక్క మండలానికి అయినా వెళ్లి హాజరు నమోదు చేయాలనే అధికారుల ఆదేశాలతో ఉపాధ్యాయులు మానసికంగా ఆవేదనకు గురవుతున్నారు. 
 ఉద్యమానికి సన్నద్ధం
ఉపాధ్యాయులను వేధింపులకు గురిచేస్తూ బయోమెట్రిక్‌ విధానాన్ని బలవంతంగా అమలు చేస్తున్న జిల్లా అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఉద్యమించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేసేందుకు నిర్ణయించాయి. శనివారం జిల్లాలోని ఉపాధ్యాయులంతా నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతారు. ఉపాధ్యాయిని రత్నకుమారి ప్రమాదానికి గురైన ప్రాంతంలో భారీ ధర్నా చేపట్టేందుకు నిర్ణయించారు. మండల కేంద్రాల్లోనూ నిరసన ర్యాలీలు చేపట్టనున్నారు. 20న ఏలూరులోని కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు సంఘాలన్నీ నిర్ణయించాయి. ఉపాధ్యాయ సంఘాల నాయకుల శుక్రవారం సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గోపీమూర్తి, ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బీఏ సాల్మన్‌రాజు, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు డీవీఏవీ ప్రసాదరాజు, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు, ఎంబీటీఎస్‌ నాయకులు బి.మనోజ్‌కుమార్, ఆప్టా నాయకులు ధర్మరాజు, వైఎస్సార్‌ టీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు జి.సుధీర్, టీఎన్‌యూఎస్‌ నాయకుడు టీవీ రామకృష్ణ, ఆర్‌యూపీపీ నాయకుడు రాజబాబు, ఆపస్‌ నాయకుడు రాజకుమార్, డీటీఎఫ్‌ నాయకుడు నరహరి, పీఈటీ అసోసియేషన్‌ నాయకుడు ఎంఎల్‌ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.
 
 అధికారిక హత్యే
ఉపాధ్యాయిని రత్నకుమారి ప్రమాదంలో మరణించిన ఘటనను అధికారిక హత్యగానే చూడాలి. సక్రమంగా పనిచేయని, నాసిరకం బయోమెట్రిక్‌ యంత్రాలు ఏర్పాటు చేశారు. విధిగా హాజరు నమోదు చేయాలనే తీవ్ర ఒత్తిడి కారణంగా ఆమె ప్రమాదానికి గురై మరణించారు. పాలకుల వద్ద పేరు రావాలనే తాపత్రయంతో ఉపాధ్యాయుల నెత్తిన అధిక భారాన్ని మోపుతున్నారు. ఈ ఘటనకు కలెక్టర్‌ కాటంనేని భాస్కర్, జిల్లా విద్యాశాఖ అధికారులే బాధ్యత వహించాలి. 
  పి.జయకర్, అధ్యక్షుడు, యూటీఎఫ్ జిల్లా శాఖ
 
 న్యాయం జరిగేవరకూ పోరాటం
ఉపాధ్యాయుల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వేధింపులకు పాల్పడడం మానుకోవాలి. జిల్లాలోని ఉపాధ్యాయులంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పాఠశాలల్లో నెట్‌ సౌకర్యం, నాణ్యమైన యంత్రాలు ఏర్పాటు చేయకుండా ఎలాగైనా హాజరు నమోదు చేయాలనటం దారుణం. న్యాయం జరిగే వరకూ ఉపాధ్యాయులంతా ఐక్యంగా ఉద్యమిస్తాం.
జి.కృష్ణ, ప్రధాన కార్యదర్శి, ఏపీటీఎఫ్ జిల్లా శాఖ
 
 బయోమెట్రిక్‌కు వ్యతిరేకం కాదు కానీ..
ప్రభుత్వం అమలు చేస్తున్న బయోమెట్రిక్‌ హాజరు నమోదుకు ఉపాధ్యాయులెవరూ వ్యతిరేకం కాదు. కానీ స్కూళ్లలో పూర్తిస్థాయిలో బయోమెట్రిక్‌ యంత్రాలు, నెట్‌ సౌకర్యం లేకుండా విధిగా హాజరు నమోదు చేయాలనడం న్యాయం కాదు. అధికారులు వారి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఉపాధ్యాయులపై భారాన్ని మోపుతున్నారు. 
 డీవీఏవీ ప్రసాదరాజు, అధ్యక్షుడు, ఎస్టీయూ జిల్లా శాఖ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement