govt neglegence
-
వేదన.. అరణ్య రోదన
► కాంట్రాక్టు ఉద్యోగులపై కనికరం చూపని సర్కారు ► అటవీశాఖలో 30 ఏళ్లుగా ఊడిగం ► ఆరంభం నుంచి రూ.7500 జీతంతో బతుకీడుస్తున్న ఏఎఫ్‌బీఓలు ► ఉద్యోగ భద్రత, జీతాల పెంపు కోసం వేడుకోలు ఎండనక వాననక, అటవీ ప్రాంతంలో క్రూర మృగాల నడుమ పని చేస్తున్నాం. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం. అయినా మూడు దశాబ్దాలుగా అరకొర జీతాలతోనే బతుకు వెళ్లదీస్తున్నాం. అటవీ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిపై పని చేస్తున్నఅసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల ఆవేదన ఇది. సర్కారు తమను కనికరించి, ఉద్యోగ భద్రతతో పాటు, జీతాలు పెంచి ఆదుకోవాలని ఉద్యోగులు వేడుకొంటున్నారు. అర్ధవీడు : అటవీశాఖలో 1987లో 280 మంది విలేజ్ ఫారెస్ట్ వర్కర్లుగా చేరారు. ప్రభుత్వం 2004లో వీరికి కాంట్రాక్ట్ పద్ధతిపై ఏఎఫ్‌బీఓలుగా పదోన్నతి కల్పించి జీతం 7500 ఇస్తోంది. 30 ఏళ్లుగా పనిచేస్తున్న వారికి కూడా జీతాలు మాత్రం పెంచలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎన్జిఓ అధ్యక్షులు అశోక్‌బాబు ముఖ్యమంత్రితో చర్చలు జరగపగా ఆయన తమను రెగ్యులర్ చేసేందుకు అంగికరించారని, ఇంకోసారి ఆర్థికమంత్రితో చర్చించి రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇంత వరకు ఎటువంటి చర్యలు లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న మొన్న చేరిన కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ రూ.15వేలుపైగా జీతం చెల్లిస్తున్న ప్రభుత్వం తమకు మాత్రం రూ.7500 ఇవ్వడం ఏం న్యాయమని ప్రశ్నిస్తున్నారు. ఈ జీతాలతో తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో రెగ్యులర్ చేశారు: తమతో పాటు విలేజ్ ఫారెస్ట్ వర్కర్లుగా చేరిన పంజాబ్, హర్యానా, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో ఉద్యోగ భద్రతతో పాటు జీతాలు పెంచారని, వారికి అలవెన్సులు అందజేస్తున్నారని ఇక్కడ మా బతుకులు అలాగే ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం స్పందించి తమను రెగ్యులర్ చేయడంతో పాటు జీతాలు పెంచి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. కుటుంబ పోషణ భారమైంది: నేను 1987 నుంచి వీఎఫ్‌ఓగా విధుల్లో చేరాను. 2004లో ఏఎఫ్‌బీఓగా కాంట్రాక్టర్ పద్ధతిలో తీసుకున్నారు. అప్పటి నుంచి నేటి వరకు రూ.7500 జీతంతోనే కుటుంబాలు పోషించుకుంటున్నాం. నిన్న, మొన్న చేరిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు 15వేలకు పైగా జీతాలు చెల్లిస్తున్నారు. అందరు ఉద్యోగుల్లాగే మేం కూడా పని చేస్తున్నాం. వివక్ష మాని ఉద్యోగాకు రెగ్యులర్ చేయాలి. జిల్లాలో 280 మంది ఇలాంటి పరిస్థితులే అనుభవిస్తున్నారు. --- కిఫాయతుల్ల, ఏఎఫ్‌బీఓ -
కార్పొరేషన్ రుణాల పంపిణీలో ప్రభుత్వం నిర్లక్ష్యం
మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు గడ్డం ప్రసాద్‌కుమార్ ధారూరు: బీసీ, ఎస్టీ, మైనార్టీలకు కార్పొరేషన్ రుణాలు అందలేదని, వీటిపై కలెక్టర్ స్పష్టమైన ప్రకటన చేయాలని మాజీ మంత్రి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు గడ్డం ప్రసాద్‌కుమార్ డిమాండ్ చేశారు. ధారూరులో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆరు నెలల కిందట నిరుద్యోగులు కార్పొరేషన్ల రుణాలకు దరఖాస్తులు చేసుకోగా ఎంపికైన లబ్ధిదారులకు ఇంతవరకు మంజూరు కాలేదని తెలిపారు. యూనిట్ల గ్రౌండింగ్‌కు కలెక్టరేట్, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఖాతాల్లో రుణాలు జమ కాలేదని వాపోయారు. లబ్ధిదారులకు రుణాలు పంపిణీ చేస్తారా లేదా అనే విషయాన్ని స్పష్టం చేయాలని కోరారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవసరమైన నిధులు జమచేసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం కార్పొరేషన్ రుణాలకు నిధులు విడుదల చేయకుండా తప్పించుకుంటోందని విమర్శించారు. సంక్షేమ పథకాల అమలులో గారడీ చేస్తోందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు పట్లోళ్ల రాములు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంగమేశ్వర్రావు, గట్టెపల్లి సర్పంచ్ పాండునాయక్, కాంగ్రెస్ నాయకులు చెక్క వీరన్న, నారాయణ్‌రెడ్డి, చాకలి నర్సింహులు, యువజన కాంగ్రెస్ నాయకులు కిరణ్‌కుమార్, కుమ్మరి రాము, శ్రీనివాస్‌రెడ్డి, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.