govt school Private Educational Institution
-
ఈ ప్రభుత్వ పాఠశాల పిల్లల మార్కులను చూస్తే కార్పోరేట్ స్కూళ్లు సిగ్గు పడాల్సిందే
మదనపల్లె సిటీ: కార్పొరేట్ కాలేజీలకు దీటుగా ఇంటర్మీడియట్లో పేద, సామాన్య కుటుంబాల పిల్లలు సగర్వంగా తలెత్తుకునే రీతిలో మార్కులు సాధించారు. ఒకప్పుడు ప్రభుత్వ కళాశాలల్లో చదివే పిల్లలు పాసైతే చాలు అనుకునేవారు. నేడు ఆ పరిస్థితి మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత కల్పించి, మౌలిక వసతులు కల్పించడంతో విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి అందరి మన్ననలు పొందారు. కార్మికుడి ఇంట.. చదువుల తల్లి మదనపల్లె పట్టణం అవంతి టాకీసు వద్ద నివాసం ఉంటున్న ఖాదర్‌వలి మెకానిక్. షర్మిల గృహిణి. సామాన్య కుటుంబం. కూతురు మెహర్ చిన్నప్పటి నుంచి చదువులో రాణిస్తోంది. పదో తరగతి స్థానిక హోప్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో చదివింది. పదిలో 590 మార్కులు సాధించింది. ఇంటర్మీడియట్ బాలికల జూనియర్ కాలేజీలో బైపిసి చేరింది. ఇంటర్లో 968 మార్కులు వచ్చాయి. రైతు బిడ్డ ..చదువులో దిట్ట రైతు కుటుంబంలో పుట్టి చదువులో రాణిస్తోంది.సత్యసాయి జిల్లా కొక్కంటిక్రాస్ నల్లంవారిపల్లెకు చెందిన లింగారెడ్డి పద్మావతిల కుమారై కవిత. లింగారెడ్డి రైతు, పద్మావతి గృహిణి. కవిత మదనపల్లె జీఆర్టీ ఉన్నత పాఠశాలలో ఓపెన్ స్కూల్లో పదో తరగతి పాసైంది. ఇంటర్ బాలికల జూనియర్ కాలేజీలో బైపీసీ చేరింది. ఇంటర్లో 965 మార్కులు సాధించింది. కాలేజీ హాస్టల్లో ఉంటూ విద్యలో రాణించింది. వాచ్మెన్ కూతురు..ఇంటర్లో టాపర్ తండ్రి వాచ్మెన్. తండ్రి పడుతున్న కష్టాలు చూసి చదువులో రాణించాలనుకుంది ప్రీతిలతాదాల్. మదనపల్లె ఎస్టేట్‌కు చెందిన దిగంబర్దాల్ ఓ అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు. ప్రీతి లతాదాల్ ప్రభుత్వ కళాశాలలో చదివి సీఈసీలో 948 మార్కులు సాధించించి అందరి మన్ననలు అందుకుంది. దినకూలి ఇంట సరస్వతి పుత్రుడు తంబళ్లపల్లె: ఓ దినసరి కూలీ ఇంట చదువుల తల్లి సరస్వతి కొలువుదీరింది. ఆ ఇంటిలోని ఓ విద్యార్థి ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రతిభచాటి పలువురి మన్ననలు పొందాడు. మండలంలోని కొటాలకు చెందిన అమరావతి కూలీ పనులతో కుంటుంబ పోషణ సాగిస్తోంది. రెండో కుమారుడు ఇ.అశోక్‌కుమార్ ప్రాథమిక విద్య కొటాల ప్రభుత్వ పాఠశాలలో, గోపిదిన్నె ఉన్నత పాఠశాలలో పదోవ తరగతి పూర్తి చేసి 540 మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. అప్పటికే తల్లి పడుతున్న కష్టం చూసి అతనిలో బాగా చదవాలనే పట్టుదల పెరిగింది. తంబళ్లపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ గ్రూపులో చేరాడు. ఇంటర్ ఫలితాల్లో 1000 మార్కులకు గాను 950 మార్కులు సాధించాడు. అతడి తండ్రి ఈశ్వరయ్య కోవిడ్ తో మృతి చెందాడు. ఐఏఎస్ కావాలన్నదే ధ్యేయం సివిల్స్ రాసి ఐఏఎస్ కావాలన్నదే ధ్యేయం. అందుకే ఇంటర్మీడియట్ సీఈసీ చేరాను. అధ్యాపకులు రెడ్డప్పరెడ్డి సూచనలు,సలహాలతో మంచి మార్కులు సాధించాను. –ప్రీతిలతాదాల్ ఎంబీబీఎస్ చేస్తా ఎంబీబీఎస్ చేయాలని ఉంది. ఇందు కోసం ఎంసెట్,నీట్ ఎంట్రన్స్‌లకు ప్రిపేర్ అవుతున్నా. అధ్యాపకులు ఇచ్చిన సలహాలు, సూచనలతో ప్రతి రోజు 9 గంటలు చదువుతున్నా. –కవిత రాజుపాళెం : మండలంలోని వెల్లాల బాలికల గురుకుల పాఠశాల విద్యార్ధినులు ప్రభంజనం సృష్టించారు. జమ్మలమడుగు మండలంలో కన్నెలూరు చెందిన సుబన్న, మేరిల కుమార్తె ప్రియాంక ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ గ్రూపు ఫలితాల్లో 1000 మార్కులకు 976 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచింది. 10వ తరగతి జమ్మలమడుగు గూడెంచెరువులోని కస్తూరిబా పాఠశాలలో చదివి 595 మార్కులు సాధించింది. బాలిక తండ్రి బేల్దారిగా పని చేస్తున్నాడు. భవిష్యత్తులో డాక్టర్ అయి పేదలకు సేవచేస్తానని ప్రియాంక చెప్పింది. ప్రియాంక తండ్రి సుబ్బన్న బేల్దారిగా పనిచేస్తున్నాడు, తల్లి మేరి కూలి పని చేసుకుని జీవిస్తున్నారు. భవిష్యత్తులో డాక్టర్నవుతా నంద్యాల జిల్లా సంజాముల మండలంలోని నొస్సం గ్రామానికి చెందిన బి.నాగేశ్వరరావు కుమార్తె బి.ముని జాహ్నవి ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీగ్రూపులో ఫలితాల్లో 1000 మార్కులకు 976 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచింది. రాజుపాళెం మండలంలోని వెల్లాల బాలికల గురుకుల పాఠశాల పదదోతరగతి నుంచి సీనియర్ ఇంటర్ వరకు చదివింది. బాలిక తండ్రి జూనియర్ లైన్మెన్గా, తల్లి అంగన్వాడీ టీచర్‌గా పని చేస్తున్నారు. భవిష్యత్తులో డాక్టర్ కావాలని ఉద్ధేశంతో ప్రస్తుతం నీట్‌కు కోచింగ్ తీసుకుంటున్నట్లు మునిజాహ్నవి తెలిపింది. వ్యవసాయ కూలీ బిడ్డ.. చదువులో దిట్ట రాజుపాళెం మండలంలోని వెల్లాల బాలికల గురుకుల పాఠశాల విద్యార్థి పామిడి లక్ష్మిదేవి సీనియర్ ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచింది. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలోని నగళ్లపాడుకు చెందిన వ్యవసాయ కూలి పామిడి శ్రీనివాసులు కుమార్తె లక్ష్మిదేవి సీనియర్ ఇంటర్ బైపీసీ గ్రూపులో 1000 మార్కులకు 966 మార్కులు సాధించింది.. తండ్రి వ్యవసాయ కూలీ కాగా, తల్లి స్వాతి ఆశా కార్యకర్తగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం తిరుపతిలో నీట్ కోచింగ్ తీసుకుంటున్నానని, భవిష్యత్తులో డాక్టర్నవుతానని తెలిపింది. బి.ఫార్మసీ చేయాలని ఉంది ఎంసెట్, నీట్ ఎంట్రన్స్ రాస్తా. బి.ఫార్మసీ చేయాలని ఉంది.అధ్యాపకులు, తల్లిదండ్రుల సలహాలు, సూచనలతో మంచి మార్కులు సాధించా. –మెహర్, మదనపల్లె ఐఏఎస్ చదవాలన్నదే ఆశయం ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసి ఐఏఎస్ కావాలన్నదే తన ఆశయమని అశోక్‌కుమార్ తెలిపాడు. నేటి ప్రభుత్వం విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు పేద పిల్లలకు ఇస్తున్న భరోసా తనకు ఆనందం కలిగిస్తోందన్నారు. -
సున్నా విద్యార్థులున్న స్కూల్స్126
నల్లగొండ : ఒకనాడు చదువులకు నిలయాలుగా ఉన్న సర్కారు పాఠశాలలు నేడు ఆదరణ కోల్పోయి మూత పడే పరిస్థితికి వచ్చాయి. నిత్యం విద్యార్థులతో కళకళలాడిన పాఠశాలలు ఇప్పుడు విద్యార్థులు కరువై కళావిహీనంగా మారుతున్నాయి. ఓ పక్క ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ప్రవేశపెట్టడం, ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధనల ప్రభావం తెలుగుమీడియం సర్కారు బడులపై పడుతోంది. జిల్లాల్లో చాలా పాఠశాలలు ఇప్పటికే మూత పడిపోగా ఈ సంవత్సరం కూడా మరికొన్నింటికి తాళం వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1 నుంచి 10వ తరగతి వరకు 1,483 ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాల్లో బోధన సాగుతుండడంతో తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు ముందుకు రావడంలేదు. కొన్ని సంవత్సరాలుగా ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్ పాఠశాలలు జిల్లా, డివిజన్. మండల కేంద్రాల్లో విచ్చలవిడిగా వెలిశాయి. ఆయా గ్రామాలకు స్కూళ్లకు సంబంధించిన బస్సులను కూడా పంపిస్తున్నారు. దీంతో వ్యవసాయదారులతో పాటు గ్రామాల్లో, పట్టణాల్లో కూలి చేసుకునే వారు కూడా ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో చేర్పిస్తూ వస్తున్నారు. దీంతో కొంత కాలంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల కంటే ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అక్కడ ఉన్న ఉపాధ్యాయులను డిప్యుటేషన్లపై పక్క పాఠశాలలకు పంపిన సంఘటనలు ఉన్నాయి. గురుకులాల వైపు మొగ్గు తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు కేజీ టు పీజీ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలను ప్రవేశపెడతానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, గురుకుల పాఠశాలలు పెద్ద ఎత్తున నెలకొల్పారు. ఆయా వర్గాల వారితోపాటు ఓసీల్లోని పేదలు కూడా గురుకులాల్లోనే చేరుతున్నారు. ఒక్కో విద్యార్థిపై తెలంగాణ ప్రభుత్వం రూ.1.20లక్షల పై చిలుకే ఖర్చు చేస్తుంది. మంచి పోషకాహారంతోపాటు నాణ్యమైన విద్యను కూడా ఆంగ్లంలోనే అందిస్తుంది. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులంతా గురుకుల పాఠశాలల్లో చేరారు. దీంతో గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతుండగా మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో అంతంత మాత్రంగా కొనసాగే ప్రైవేట్ పాఠశాలలు కూడా మూతపడిపోతున్నాయి. తిరిగి కొనసాగిస్తామంటున్న అధికారులు జిల్లాలో 1483 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే అం దులో 126 ప్రాథమిక పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేడు. ఈ పాఠశాలలన్నీ మూతపడుతుండగా 10 మందిలోపు ఉన్న పాఠశాలలు 97 ఉన్నా యి. 20 మంది పిల్లల లోపు ఉన్నటువంటి యూ పీఎస్ పాఠశాలలు 88 ఉన్నాయి. ఈ పాఠశాలల ను ఆయా గ్రామ సమీప పాఠశాలల్లో విలీనం చే సేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా ఈ విషయాన్ని విద్యాశాఖ కమిషనర్ వివరించారు. పిల్లలు లే ని పాఠశాలలను పూర్తిగా మూసివేయడం జరగద ని, తిరిగి పిల్లలు చేరితే యధావిధిగా కొనసాగిస్తామని తెలిపారు. పక్క గ్రామాల పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు రవాణా చార్జీలు తక్కువ విద్యార్థులున్న పాఠశాలలనుంచి పక్క గ్రామాల పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ప్రభుత్వం రవాణా చార్జీలు చెల్లించేందుకు సిద్ధంగా ఉంది. ఒక్కో విద్యార్థికి ప్రతి నెలా రూ. 600 చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. పాఠశాలల్లో పిల్లలు చేరితే యధావిధిగా కొనసాగిస్తాం ప్రస్తుతం జిల్లాలో 126 పాఠశాలల్లో విద్యార్థులు లేరు. ఆ పాఠశాలల్లో తిరిగి విద్యార్థులు చేరితే యధావిధిగా కొనసాగిస్తాం. ఎప్పుడు విద్యార్థులు వచ్చినా పాఠశాలలు కొనసాగించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలున్నాయి. పక్క గ్రామాల పాఠశాలలకు పంపిస్తే వారికి ప్రభుత్వమే ప్రతినెలా రూ.600 రవాణా ఖర్చులను చెల్లిస్తుంది. – డీఈఓ సరోజినీదేవి -
పాఠ్యపుస్తకం..ప్రియం
కోదాడటౌన్, న్యూస్‌లైన్, ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ధరలు విపరీతంగా పెరిగాయి. గత ఏడాది కంటే ఏకంగా 60 నుంచి 70 శాతం పెంచారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించేందుకు ఇప్పటికే పాఠ్యపుస్తకాలను ఆయా మండల కేంద్రాల్లోకి చేరవేశారు. కానీ ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలను మాత్రం ఇప్పటి వరకు మార్కెట్లోకి విడుదల చేయలేదు. సోమవారం నుంచి ఓ డిస్ట్రిబ్యూటర్ కొన్ని తరగతుల పుస్తకాలను మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ఇదెక్కడి మార్కెటింగ్? ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులు తప్పనిసరిగా ప్రభుత్వం సరఫరా చేసే పాఠ్యపుస్తకాలను మాత్రమే ఉపయోగించాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఈ పుస్తకాలను ఉచితంగా అందజేయనున్నారు. ప్రైవేట్ విద్యార్థులకు పుస్తకాలను బహిరంగ మార్కెట్ ద్వారా అందజేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా రెండు సంస్థలకు పంపిణీ బాధ్యతలు అప్పగించారు. వీరిలో జీటీఓ సేల్స్ అనే డిస్ట్రిబ్యూటర్ 1, 2, 3, 7, 8, 9వ తరగతి పుస్తకాలను పంపిణీ చే స్తుండగా, బెల్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ 4, 5, 6, 10వ తరగతి పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న వీరిద్దరు ఒకేసారి పుస్తకాలను పంపిణీ చేయడం లేదు. జీటీఓ సేల్స్ కంపెనీ పుస్తకాల పంపిణీ చేస్తుండగా, బెల్ కంపెనీ మాత్రం రెండు మూడు రోజుల్లో పంపిణీ మెదలుపెడతామని చెబుతున్నట్టు పలువురు పుస్తక విక్రేతలు అంటున్నారు. దీంతో హైదరాబాద్ చుట్టూ తిరగాల్సి వస్తుం దని, అన్ని తరగతుల పుస్తకాలు కావాలనుకుంటే రెండుచోట్లకు పరుగులు పెట్టాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. ఇంటర్ పుస్తకాలదీ.. అదే దారి మరికొద్ది రోజుల్లో ఇంటర్ తరగతుల ప్రా రంభం కానుండగా ఇప్పటివరకు మార్కెట్లోకి పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రాలేదు. గత ఏడాది ఇంటర్ పుస్తకాల ధరలు అధికంగా ఉన్నాయనే విమర్శలు రా వడంతో ఈ విద్యాసంవత్సరం నుంచి ధర లు తగ్గించనున్నట్లు అధికారులు ప్రకటిం చారు. తెలుగు ఆకాడమీ అధికారులు ప్రతి పాదనలు పంపినప్పటికీ అటునుంచి సమాధానం రాకపోవడంతో ధరల విషయం తేలక పాఠ్యపుస్తకాలను మార్కెట్లోకి విడుదల చేయలేదని సమాచారం. తాజా గా పాత ధరలతోనే మరో 15రోజుల్లో పాఠ్యపుస్తకాలు మార్కెట్లోకి విడుదల చేస్తామని, ధరల తగ్గింపు ఈ విద్యాసంవత్సరానికి లేనట్టేనని తె లుగు అకాడమి అధికారులు చావుకబురు చల్ల గా చెబుతున్నారు. మరో 15రోజులపాటు ఇం టర్ పుస్తకాలు మార్కెట్లోకి రాకపోతే ఇబ్బం దులు తప్పవని విద్యావేత్తలు అంటున్నారు.