రూ.2.06 కోట్లకు ‘టెండ ర్’!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:
గ్రేడ్ వన్ మున్సిపాలిటీ అయిన సంగారెడ్డిలో ఇటీవల ముగిసిన టెండర్ల ప్రక్రియపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.2.06 కోట్ల విలువ చేసే పది పనులకు నేడో రేపో ఆమోద ముద్ర వేసేందుకు రంగం సిద్ధమైంది. పారిశుద్ధ్యం, వీధి దీపాలు, తాగునీటి సరఫరా, కార్యాలయ నిర్వహణ, వివిధ ప్రాంతాల్లో సెక్యూరిటీ బాధ్యతల నిర్వహణ వంటి 10 రకాల పనులకు మున్సిపల్ కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 23న నోటిఫికేషన్ విడుదల చేయగా, ఈ నెల 3 వరకు టెండరు షెడ్యూళ్లు స్వీకరించారు. అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు మున్సిపల్ కమిషనర్ సమక్షంలో టెండరు షెడ్యూళ్లు తెరిచారు. మొత్తం 10 పనులకు ఎనిమిది మంది టెండరు షెడ్యూళ్లు దాఖలు చేశారు.
ఒక్కో పనికి అంచనాలకు మించి 4.50 నుంచి గరిష్టంగా 10 శాతం వరకు కాంట్రాక్టర్లు టెండర్ కోట్ చేశారు. 4.5 శాతం నుంచి 4.99 శాతం మేర అదనపు మొత్తానికి పనులు దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లు వ్యూహం పన్నినట్లు టెండర్ షెడ్యూళ్లను పరిశీలిస్తే అర్థమవుతోంది. పారిశుద్ధ్య నిర్వహణలో 100 మంది కాంట్రాక్టు లేబర్ సరఫరాకు సంబంధించిన పనిలో ఓ కాంట్రాక్టర్ అంచనా మొత్తానికి 4.9 శాతం అదనంగా కోట్ చేశాడు. ఇదే కాంట్రాక్టర్ నీటి సరఫరా విభాగంలో 50 మంది కార్మికుల సరఫరాకు 9 శాతం అదనంగా కోట్ చేయడం ఆరోపణలకు ఊతమిస్తోంది. ఇదే రీతిలో ఇతర కాంట్రాక్టర్లు కూడా అంతర్గత అవగాహన మేరకు పనులు దక్కించుకునేందుకు అవగాహనకు వచ్చినట్లు స్పష్టమవుతోంది. అంచనా మొత్తానికి 5 శాతానికి మించి కోట్ చేస్తే పనులు దక్కవనే ఉద్దేశంతో 4.99 శాతం మించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తేలింది.
మున్సిపాలిటీ వ్యవహారాల్లో చక్రం తిప్పుతున్న నేతల కనుసన్నల్లోనే టెండర్లు దాఖలైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. పది మంది టెండర్లు దాఖలు చేయగా ఆరుగురు పనులు దక్కించుకున్నారు. ఇందులో పనులన్నీ కీలక నేతలకు సన్నిహితంగా ఉండే ముగ్గురికే దక్కడం గమనార్హం. టెండర్ షెడ్యూళ్ల వివరాల జాబితా సిద్ధం చేశారు. జాబితా ఆమోదించేందుకు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి, జాయింట్ కలెక్టర్ శరత్ పరిశీలనకు పంపారు. ‘టెండర్లలో కాంట్రాక్టర్లు రింగ్ అయినట్లుగా ఫిర్యాదు అందితే పరిశీ లించి చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు అనుగుణంగా వున్న టెండర్లను మాత్రమే ఆమోదిస్తారని’ సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ ఎం. కృష్ణారెడ్డి వివరణ ఇచ్చారు.