ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ కసరత్తు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలో ఖాళీ అవుతున్న టీచర్, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తును ప్రారంభించింది. ఖాళీ అవుతున్న ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ స్థానాల్లో ద్వైవార్షిక ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం చేపట్టింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ వి. బాలసుబ్రహ్మణ్యం, , కడప (వైఎస్సార్)-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ బాచుల పుల్లయ్యల పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 29 తో పూర్తి కానుంది. అలాగే గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాలైన ప్రకాశం-నెల్లూరు- చిత్తూరు నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీ వై. శ్రీనివాసరెడ్డి, కడప- అనంతపురం - కర్నూలు స్థానం నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీ ఎం. గేయానంద్, శ్రీకాకుళం- విజయనగరం -విశాఖపట్టణం స్థానం నుంచి గెలుపొందిన ఎమ్మెల్సీ ఎం.వీ.ఎస్. శర్మ ల పదవీ కాలం కూడా అదే సయమానికి పూర్తవుతుంది.
అలాగే తెలంగాణలోని మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి గతంలో ఎన్నికైన కాటిపల్లి జనార్ధన్ రెడ్డి పదవీ కాలం కూడా మార్చి నెలాఖరునాటికి పూర్తవుతుంది. వీటితో పాటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, కర్నాటక రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఓటర్ల నమోదు కార్యక్రమం ప్రారంభించింది.
ఈ స్థానాల ఎన్నికల కోసం ఓటర్లుగా నమోదు కోసం అక్టోబర్ 1 న నోటిఫికేషన్ జారీ చేస్తుంది. దాదాపు నెల రోజుల పాటు నవంబర్ 5 వ తేదీ వరకు ఓటర్ల నమోదు కార్యక్రమం కొనసాగించి నవంబర్ 23 న ఓటర్ల ముసాయిదాను విడుదల చేస్తుంది. ఆ తర్వాత వచ్చే అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత డిసెంబర్ 30 న ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తుంది. ఆ తర్వాత ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలును ప్రకటిస్తుంది. ఈ మేరకు సంబంధిత రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం సమాచారం పంపించింది.