G20 Summit: జీ20 అతిథులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు
న్యూఢిల్లీ: జీ20 కూటమి నేతలు, అతిథులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి ఢిల్లీలో భారత్ మండపం వద్ద ఘనమైన విందు ఇచ్చారు. తృణధాన్యాలు, కశ్మీరీ కాహా్వతో తయారు చేసిన పసందైన వంటకాలను ఈ సందర్భంగా అతిథులు రుచి చూశారు. ముంబై పావ్, బాకార్ఖానీ అనే రొట్టెలు వడ్డించారు. డార్జిలింగ్ టీ ఏర్పాటు చేశారు. భారతీయ వంటకాల్లోని వైవిధ్యం ఇక్కడ సాక్షాత్కారించింది. తొలుత రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ జీ20 నేతలకు స్వాగతం పలికారు.
స్వాగత వేదిక వెనుక ప్రాచీన నలందా విశ్వవిద్యాలయ శిథిలాల చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే జీ20 థీమ్ ‘వసుధైవ కుటుంబం’ అని లిఖించారు. రాష్ట్రపతి ఇచి్చన విందులో అమెరికా అధ్యక్షుడు బైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 300 మంది హాజరయ్యారు. సునాక్ వెంట ఆయన భార్య అక్షతా మూర్తి కూడా వచ్చారు. నలందా విశ్వవిద్యాలయం గురించి బైడెన్‌కు, సునాక్ దంపతులకు ప్రధాని మోదీ తెలియజేశారు. జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా భార్య యోకో కిషిదా భారతీయ సంప్రదాయ చీరను ధరించి రావడం విశేషం.